కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ చందాదారులకు 8.15% వడ్డీ సిఫార్సు చేసిన ఈపీఎఫ్ ట్రస్ట్
Posted On:
28 MAR 2023 11:13AM by PIB Hyderabad
ఉద్యోగుల భవిష్యనిధి కేంద్ర మండలి ట్రస్టీల 233 వ సమావేశం ఈరోజు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖామంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో సహాధ్యక్ష హోదాలో కేంద్ర కార్మిక, ఉపాధి, చానూరు, సహజవాయు శాఖల సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి, సహ ఉపాధ్యక్ష హోదాలో కార్మిక ఉపాధి శాఖ కార్యదర్శి ఆర్తి ఆహుజా, సభ్య కార్యదర్శి శ్రీమతి నీలం షమీ రావు, కేంద్ర భవిష్యనిధి కమిషనర్ కూడా పాల్గొన్నారు.
భవిష్యనిధి సభ్యుల ఖాతాలలో నిల్వ ఉన్న మొత్తం మీద 2022-23 సంవత్సరానికి ఏడాదికి 8.15% చొప్పున వడ్డీ జమ చేయాలని కేంద్ర మండలి సిఫార్సు చేసింది. ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసిన వెంటనే అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆ తరువాత భవిష్య నిధి సంస్థ తన చందాదారుల ఖాతాలలో వడ్డీని జమచేస్తుంది.
సిఫార్సు చేసిన 8.15% వడ్డీ వలన చందాదారుల మొత్తానికి తగిన భద్రతతో బాటు వడ్డీరూపంలో ఎదుగుదల ఉంటుందని కేంద్ర మండలి స్పష్టం చేసింది. మిగులు రూ. 663. 91 కోట్లలోనూ, వడ్డీ రేటు 8.15% లోనూ నిరుటి కంటే పెరుగుదల నమోదయిందని మండలి గుర్తు చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో చందాదారుల మొత్తం సొమ్ము దాదాపు 11 లక్షల కోట్లు కాగా, దాదాపు 90 వేల కోట్లు చందాదారులకు పంపిణీ జరిగేలా మండలి సిఫార్సు చేసింది. నిరుడు ఈ చందాదారుల మొత్తం 77, 424. 84 కోట్లు ఉండగా, పంపిణీ చేసిన మొత్తం 9.56 లక్షల కోట్లుగా నమోదైంది. ఆదాయం నుంచి పంపిణీ చేసిన మొత్తం ఇంటకుముందెన్నడూ లేనంత అధికం. అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే మొత్తం ఆదాయంలో 16% పెరుగుదల, మొత్తం అసలులో 15% పెరుగుదల నమోదయ్యాయి.
కొన్నేళ్ళుగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన సభ్యులకు ఎక్కువ మొత్తాలు పంచుతూ వచ్చింది. భవిష్యనిధి సంస్థకున్న విశ్వసనీయత దృష్ట్యా మిగిలిన పెట్టుబడి కంటే ఎక్కువ వడ్డీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టుబడులు పెడుతూ, అసలు మొత్తపు భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని ఈ సందర్భంగా ట్రస్ట్ మరోసారి గుర్తు చేసింది.
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. మూలధన మార్కెట్లలో, షేర్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ చందాదారులకు సాధ్యమైనంత అధిక వడ్డీ అందేలా చూస్తూ తన బాధ్యతకు కట్టుబడి ఉంది. సంప్రదాయ వైఖరి అవలంబిస్తూనే ఆధునిక ధోరణిని అవలంబిస్తూ, భవిష్యనిధి సంస్థ సభ్యులకు ఇందులో పెట్టుబడులు పెట్టటం తెలివైన నిర్ణయమని పించేలా భవిష్య నిధి సంస్థ కృషి చేస్తోంది.
***
(Release ID: 1911638)
Visitor Counter : 253