ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

కర్ణాటకలోని హుబ్లీ-ధార్వాడ్ లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం


180 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటయ్యే ప్రాజెక్టు ద్వారా 18,000 మందికి ఉపాధి

ప్రాజెక్టులో 340 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన 9 సంస్థలు/ అంకుర సంస్థలు

Posted On: 24 MAR 2023 6:59PM by PIB Hyderabad

కర్ణాటకలోని  హుబ్లీ-ధార్వాడ్ లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర వ్యవస్థాపక, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా  18,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీ చంద్రశేఖర్ ఈ రోజు బెంగళూరులో తెలిపారు. 

ధార్వాడ్ జిల్లా కొత్తూర్-బలూర్ పారిశ్రామిక వాడలో ఈఎంసి 2.0 పథకం కింద ఏర్పాటయ్యే  ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి క్లస్టర్ త్వరలో 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తుంది. అంకుర సంస్థలతో సహా 9 సంస్థలు ఇప్పటికే ప్రాజెక్టులో 340 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసే ముందుకు వచ్చాయి. వీటిలో 2,500 మందికి ఉపాధి లభిస్తుంది. 

' ప్రపంచంలో ఇప్పటికే టెలికాం హబ్ గా కర్ణాటక ఇప్పటికే గుర్తింపు పొందింది. ఆపిల్ ప్లాంట్లు కోలార్ (విస్ట్రాన్), దేవనహళ్లి (ఫాక్స్ కాన్) పనిచేస్తున్నాయి. కొత్తగా వచ్చే పెట్టుబడులతో ఏర్పాటయ్యే పరిశ్రమలు ఉపాధి అవకాశాలు కల్పించి అభివృద్ధికి దోహదపడతాయి. 'ఆత్మ నిర్భర్ భారత్' లో భాగంగా భారతదేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలని  శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.' అని శ్రీ చంద్రశేఖర్ అన్నారు.  ఎలక్ట్రానిక్స్  ఉత్పత్తి క్లస్టర్ ఏర్పాటుకు ఎంపిక చేసిన ప్రాంతం భౌగోళిక ప్రయోజనాలు కలిగి ఉంది. జాతీయ రహదారి-48 ( ఒక కిలోమీటర్ దూరం), హుబ్లీ విమానాశ్రయానికి (33 కిలోమీటర్లు) దూరంలో ప్రాజెక్టు కేంద్రం ఉంది. దీనివల్ల ఈఎంసి పరిశ్రమకు రవాణా ఖర్చులు తగ్గుతాయి. 

పరిశ్రమ అవసరాలు దృష్టిలో ఉంచుకుని  కర్ణాటకలోని మైసూర్ లో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 

సవరించిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి  క్లస్టర్ పథకానికి కేంద్రం 2020 ఏప్రిల్ 1న ఆమోదం తెలిపింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కలిగి ఉండే క్లస్టర్ ఆధునిక టెస్టింగ్ సౌకర్యాలు కలిగి ఉంటుంది. పరిశ్రమల అభివృద్ధికి సహకరించే విధంగా దీనిలో ఫ్యాక్టరీ షెడ్లు/ ప్లగ్ అండ్ ప్లే  సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల క్లస్టర్ లో యూనిట్లు నెలకొల్పడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. 

ఈ పథకం కింద రూ.1,903 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో 1,337 ఎకరాల విస్తీర్ణంలో మూడు ఎలక్ట్రానిక్స్  ఉత్పత్తి   క్లస్టర్లకు ఆమోదం లభించిందని శ్రీ చంద్రశేఖర్ తెలిపారు.దీనిలో  రూ.889 కోట్ల కేంద్ర ఆర్థిక సహాయం కూడా ఉంటుందన్నారు. మొత్తం  రూ.20,910 కోట్ల పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని   తెలిపారు.

 

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల గత ఎనిమిది సంవత్సరాల కాలంలో  ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించింది. 

***



(Release ID: 1910573) Visitor Counter : 174


Read this release in: English , Urdu , Hindi , Kannada