రాష్ట్రపతి సచివాలయం
సందర్శకులకు రాష్ట్రపతి నిలయం సందర్శనకు వీలు కల్పిస్తూ ఏర్పాటైన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్రపతి
సందర్శకులు తమ స్లాట్ ను HTTP://VISIT.RASHTRAPATIBHAVAN.GOV.IN ద్వారా బుక్ చేసుకోవచ్చు
Posted On:
22 MAR 2023 1:07PM by PIB Hyderabad
సందర్శకులకు రాష్ట్రపతి నిలయం సందర్శనకు వీలు కల్పిస్తూ ఏర్పాటైన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (మార్చి 22, 2023) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి, తెలంగాణ హోం మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ ఇతర ప్రముఖులు రాష్ట్రపతి నిలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జైహింద్ ర్యాంప్ పునరుద్ధరణ, పరిరక్షణకు, చారిత్రక పతాక స్తంభం ప్రతి రూపం నిర్మాణ కార్యక్రమానికి రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. జైహింద్ ర్యాంప్ ఒక చారిత్రాత్మక మెట్ల బావి. గతంలో ప్రాంగణం యొక్క నీటి అవసరాలు తీర్చింది, 1948 లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయిన సందర్భంగా చారిత్రక పతాక స్తంభం ఏర్పాటయింది.
ఈ సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ముర్ము మాట్లాడుతూ రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి ప్రాంగణం ప్రతి భారతీయుడికి చెందుతాయన్నారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను దేశం సగర్వంగా జరుపుకుంటున్నదని ఆమె అన్నారు. ప్రజలు, ముఖ్యంగా మన యువతరం స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలుసుకోవాలని, మన స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన విలువలు గౌరవించాలని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి నిలయంలో ఒక నాలెడ్జ్ గ్యాలరీ ని ఏర్పాటు చేశారు. గ్యాలరీ రాష్ట్రపతి భవన్, నిలయం చరిత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. మన స్వాతంత్ర్య సమర యుద్ధంలో అంతగా గుర్తింపు పొందని వీరుల సమాచారాన్ని అందిస్తుంది. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, యువత నిలయాన్ని సందర్శించి వారి వారసత్వంతో మమేకం కావాలని ఆమె కోరారు.
వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రాష్ట్రపతి నిలయం ని సాధారణ ప్రజల సందర్శనార్థం తెరవడం ఇదే తొలిసారి. గతంలో ప్రజలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పరిమిత కాలం పాటు నిలయం తోటలను సందర్శించడానికి అనుమతి ఉండేది.
నిలయం పర్యటనలో ప్రజలు ప్రెసిడెన్షియల్ వింగ్, భోజనశాల తో సహా లోపలి నుంచి భవనాన్ని చూడవచ్చు. నిలయం వంటగదిని డైనింగ్ హాల్ కు కలిపే భూగర్భ సొరంగం గుండా ప్రయాణించి తెలంగాణ సంప్రదాయ చేర్యాల్ పెయింటింగ్ లు చూడవచ్చు. .
సందర్శకులు రాష్ట్రపతి భవన్ , రాష్ట్రపతి నిలయం చరిత్ర ,భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవచ్చు. మరియు గతంలో గుర్రపు శాల ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన 'నాలెడ్జ్ గ్యాలరీ' లో భారత రాష్ట్రపతి పాత్ర, బాధ్యతలు తెలుసుకోవచ్చు. . నాలెడ్జ్ గ్యాలరీ ఆవరణలో సందర్శకులు బగ్గీ,రాష్ట్రపతి ఉపయోగించే లిమోసిన్ లతో సెల్ఫీలు తీసుకోవచ్చు.
సందర్శకులు రాష్ట్రపతి నిలయం ఆవరణలోని జైహింద్ ర్యాంప్ మరియు ఫ్లాగ్ పోస్ట్ పాయింట్ తో పాటు ప్రకృతి అందాలు కూడా చూడవచ్చు. నిలయంలో ఉన్న రాక్ గార్డెన్, హెర్బల్ గార్డెన్, సీతాకోకచిలుక, నక్షత్ర గార్డెన్ వంటి వివిధ విభాగాలను ప్రజలు చూడవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా పండ్ల, చెట్లు, పువ్వుల సమాచారాన్ని పొందడానికి ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రపతి దక్షిణ భారత దేశ పర్యటన సమయంలో మినహా ఏడాది పొడవునా రాష్ట్రపతి నిలయం సాధారణ ప్రజల కోసం తెరవబడుతుంది. సందర్శకులు http://visit.rashtrapatibhavan.gov.in ద్వారా ఆన్ లైన్ లో తమ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రాష్ట్రపతి నిలయంలో రిసెప్షన్ కార్యాలయంలో కూడా వాక్ ఇన్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ప్రజలు వారానికి ఆరు రోజులు (సోమవారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాలు మినహా) ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 05:00 గంటల వరకు నిలయాన్ని సందర్శించవచ్చు, చివరి ప్రవేశం సాయంత్రం 04:00 గంటల వరకు ఉంటుంది.
రాష్ట్రపతి నిలయం సందర్శకుల నుంచి నామమాత్రపు రిజిస్ట్రేషన్ ఛార్జీ వసూలు చేస్తారు. భారతీయులు రూ.50, విదేశీయులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
టూర్ గైడ్ తో పాటు పార్కింగ్, క్లోక్ రూమ్, వీల్ చైర్, కేఫ్, సావనీర్ షాప్, విశ్రాంతి గదులు, తాగునీరు, ప్రథమ చికిత్స సౌకర్యాలు సందర్శకులకు అందుబాటులో ఉంటాయి
***
(Release ID: 1909522)
Visitor Counter : 263