పర్యటక మంత్రిత్వ శాఖ
బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ ‘గోల్డెన్ సిటీ గేట్ టూరిజం అవార్డ్స్ 2023'లో స్వర్ణ, రజత పురస్కారాలు గెలుచుకున్న భారత్
Posted On:
09 MAR 2023 4:15PM by PIB Hyderabad
బెర్లిన్ ఐటీబీ 2023లో, 'టీవీ/సినిమా కమర్షియల్స్ ఇంటర్నేషనల్ అండ్ కంట్రీ ఇంటర్నేషనల్' విభాగంలో అంతర్జాతీయ 'గోల్డెన్ సిటీ గేట్ టూరిజం అవార్డ్స్ 2023'లో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ పసిడి, వెండి స్టార్‌లు గెలుచుకుంది.
2023 మార్చి 7 నుంచి 9వ తేదీ వరకు బెర్లిన్ ఐటీబీలో ఈ కార్యక్రమం జరిగింది. భారత పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ మార్చి 08న ఈ పురస్కారాలను స్వీకరించారు.
పర్యాటకం, ఆతిథ్య రంగాలకు సంబంధించిన వివిధ విభాగాల్లో గోల్డెన్ సిటీ గేట్ టూరిజం మల్టీమీడియా అవార్డులను ఏటా ఇస్తారు. దేశాలు, నగరాలు, ప్రాంతాలు, హోటళ్ల మధ్య సృజనాత్మక మల్టీమీడియా అంతర్జాతీయ పోటీ కోసం 'గోల్డెన్ సిటీ గేట్' పురస్కారం ప్రదానం చేస్తారు. చలనచిత్ర, పర్యాటక నిపుణులతో కూడిన అంతర్జాతీయ న్యాయనిర్ణేతల బృందం ఈ పురస్కారాలను నిర్ణయిస్తుంది. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక వాణిజ్య ప్రదర్శన ఐటీబీ బెర్లిన్‌లో వార్షిక పురస్కారాల ప్రదాన వేడుక జరుగుతుంది.
పురస్కారాలు దక్కిన ప్రచార చలనచిత్రాలు/టెలివిజన్ వాణిజ్య ప్రకటనలను భారతదేశ పునరుద్ధరణపై కోవిడ్ తర్వాతి అంతర్జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా మంత్రిత్వ శాఖ రూపొందించింది. మహమ్మారి తర్వాత మన దేశానికి వస్తున్న విదేశీ పర్యాటకులను స్వాగతించడం కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ భారత బ్రాండ్ చిత్రాలను వాటిని రూపొందించింది. ప్రచారం, మార్కెటింగ్ ప్రయోజనాల కోసం భారత బ్రాండ్ చిత్రాలను దేశీయ, అంతర్జాతీయ ప్రయాణ పరిశ్రమలో విస్తృతంగా వ్యాప్తి చేశారు.
మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ విభాగాల ద్వారా కూడా ఈ చిత్రాలను విస్తృతంగా ప్రచారం చేశారు. అవి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కించుకున్నాయి. వాణిజ్య ప్రకటనలను ఆంగ్లంలో నిర్మించారు, 9 అంతర్జాతీయ భాషలు జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, రష్యన్, చైనీస్, జపనీస్, కొరియన్, అరబిక్ నేపథ్య గళాలతో ప్రచారం చేశారు.
******
(Release ID: 1905447)
Visitor Counter : 209