యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 10 నగరాల్లో ఖేలో ఇండియా దస్ కా దమ్ టోర్నమెంట్ నిర్వహణ; బాలికలను ప్రోత్సహించిన ప్రముఖ క్రీడాకారిణులు

Posted On: 07 MAR 2023 6:20PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని క్రీడల విభాగం, ఖేలో ఇండియా దస్ కా దమ్ ఈవెంట్‌ను మార్చి 10వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 వేడుకల రూపంలో దీనిని నిర్వహిస్తారు. ఒక అంతర్జాతీయ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇలా క్రీడాపోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారి. టోర్నమెంట్‌ నిర్వహించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ రూ.50 లక్షలు మంజూరు చేసింది.

మార్చి 10వ తేదీన, దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొంటారు. ఈ టోర్నమెంట్‌లో 10 క్రీడాంశాలు ఉన్నాయి, దేశంలోని 10 నగరాల్లో ఇవి జరుగుతాయి. 15,000 మంది మహిళా అథ్లెట్లు పాల్గొంటారు.

 

టోర్నమెంట్‌లో పాల్గొనే బాలికలను ఉత్సాహపరిచేలా, భారత హాకీ క్రీడాకారిణి రాణి, బాక్సర్ నిఖత్ జరీన్ సహా దేశంలోని అగ్రశ్రేణి మహిళా క్రీడాకారిణులు వీడియోలు పోస్ట్‌ చేశారు. ప్రముఖ క్రీడాకారిణుల్లో కొందరు కొన్ని నగరాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు, విజేతలను సత్కరిస్తారు. ఖో ఖో, వుషు, రెజ్లింగ్, ఫెన్సింగ్, విలువిద్య, ఈత, బాస్కెట్‌ బాల్, జూడో, అథ్లెటిక్స్, యోగాసానాలు ఈ టోర్నమెంట్‌లో క్రీడాంశాలుగా ఉన్నాయి.

జాతీయ/రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనలేకపోయిన మహిళా క్రీడాకారిణులకు ఒక వేదికను అందించడం, క్రీడాపోటీలు జరగని ప్రాంతాలను చేరుకోవడం ఈ టోర్నమెంట్‌ ముఖ్య ఉద్దేశం.

క్రీడాపోటీలు జరిగే ప్రాంతాల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

***


(Release ID: 1904953) Visitor Counter : 193