ఆయుష్

గువాహటిలో జరిగిన 1వ షాంఘై సహకార సంస్థ సదస్సు, సాంప్రదాయ ఔషధ ఎక్స్పో లో 590 కోట్ల రూపాయల విలువ చేసే వాణిజ్య ఆసక్తి వ్యక్తీకరణ ఆయుష్ రంగానికి భారీ ప్రోత్సాహం

Posted On: 05 MAR 2023 8:23PM by PIB Hyderabad

* 19 దేశాలకు చెందిన కొనుగోలుదారులు , అమ్మకందారులు మధ్య బహుళ ఉత్పత్తులపై చర్చలు 

* సాంప్రదాయ వైద్య రంగంలో వాణిజ్య అవకాశాలపై ఆసక్తి కనబరిచిన భారత్, తజికిస్తాన్, ఆర్మేనియా, ఉజ్బెకిస్థాన్, మంగోలియా, కజకిస్తాన్, బహ్రయిన్, శ్రీలంక వంటి భాగస్వామ్య దేశాలు

* ' సదస్సు, ఎక్స్పో ద్వారా ఆయుష్ రంగానికి ప్రోత్సాహం అందించి.షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపరిచి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి దోహదపడుతుంది' .. శ్రీ సర్బానంద సోనోవాల్ 

* అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఆయుష్ రంగానికి విస్తృత అవకాశాలు: స్థానిక పారిశ్రామికవేత్తలకు ఎక్స్ పో అవకాశాలను  అందించింది: శ్రీ సర్బానంద సోనోవాల్

.. 

గువాహటి లో1వ షాంఘై సహకార సంస్థ సదస్సు, సాంప్రదాయ ఔషధ ఎక్స్పో విజయవంతంగా ముగిశాయి. తమ దేశ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ దేశాలకు చెందిన అమ్మకందారులు , కొనుగోలుదారులు వివిధ ఉత్పత్తులలో వాణిజ్యం చేయడానికి గల అవకాశాలను కార్యక్రమంలో చర్చించారు. రెండు రోజులపాటు జరిగిన విస్తృత చర్చల్లో అమ్మకందారులు , కొనుగోలుదారులు  590 కోట్ల రూపాయల విలువ చేసే వాణిజ్య అవకాశాలపై ఆసక్తి కనబరిచారు. తొలిసారిగా షాంఘై సహకార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సదస్సు, ఎక్స్పో లను కేంద్ర ఆయుష్ మరియు ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ 2023 మార్చి 2న అస్సాంలోని  గువాహటిలో   ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగిన సదస్సు, నాలుగు రోజుల పాటు జరిగిన సదస్సు, ఎక్స్పోలో 17 దేశాలకు చెందిన 150 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సు ఈరోజు ఘనంగా ముగిసింది. 

 ముగింపు సమావేశంలో ప్రసంగించిన శ్రీ సర్బానంద సోనోవాల్ సదస్సు  విజయవంతం అయ్యిందని అన్నారు. ' తొలిసారిగా జరిగిన సదస్సు, ఎక్స్పో లో 590 కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపార అవకాశాలకు సంబంధించిన  చర్చలు జరిగాయి. 590 కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపార అంశాలపై ఆసక్తి వ్యక్తీకరణ అయ్యింది. వాణిజ్య అంశాలకు సంబంధించి ఎక్స్పో విజయవంతం అయ్యింది. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల మధ్య సహకారం పెంపొందించడానికి, వివిధ అంశాలపై విస్తృత సమావేశాల నిర్వహణకు సదస్సు అవకాశం కల్పించింది. సంప్రదాయ వైద్య విధానం షాంఘై సహకార సంస్థ  సభ్య దేశాలకు విస్తరించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన సదస్సు విజయం సాధించింది. ఆయుష్ రంగంలో మార్కెట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంప్రదాయ వైద్య విధానం  సహాయంతో ప్రజల  జీవన నాణ్యత మెరుగు పరచడానికి ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో భారత సంప్రదాయ వైద్య విధానానికి గుర్తింపు లభించేలా చూడడానికి సదస్సు అవకాశం కల్పించింది.    షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి. భారత   ఆయుష్ మార్కెట్‌ మరింత అభివృద్ధి సాధించడానికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి అవకాశం కలుగుతుంది" అని  శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు. 

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయుషెక్సిల్ (ఆయుష్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్) సహకారంతో  ఇన్వెస్ట్ ఇండియా  ఈ కార్యక్రమంలో బి2బి  సమావేశాలు నిర్వహించింది. 56 మందికి పైగా ఎగ్జిబిటర్లు,  19 దేశాలకు చెందిన  కొనుగోలుదారులు సంప్రదాయ వైద్య రంగంలో ఉన్న వాణిజ్య అవకాశాలపై చర్చించారు. సదస్సు మొదటి  రోజు కొనుగోలుదారులు, విక్రేతల మధ్య 50కి పైగా  సమావేశాలు జరిగాయి. సాంప్రదాయ ఔషధ ఉత్పత్తుల రంగం, ఆయుర్వేద మందులు, మూలికా న్యూట్రాస్యూటికల్స్, ఆయుర్వేద సౌందర్య సాధనాలు మొదలైన రంగాల్లో   ఆసక్తి కనిపించింది. రెండో రోజు  75 కి పైగా సమావేశాలు జరిగాయి.  ఇందులో భారతదేశం, తజికిస్తాన్, అర్మేనియా, ఉజ్బెకిస్తాన్, మంగోలియా, కజకిస్తాన్, బహ్రెయిన్, శ్రీలంక దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. దమైరా ఫార్మా, AIMIL గ్లోబల్, హెర్బల్ స్ట్రాటజీ హోమ్‌కేర్, అల్మాటీ, దిండయాల్ ఇండస్ట్రీస్, ఫిడాల్గో హెల్త్‌కేర్ లాంటి సంస్థలు పాల్గొన్న బి2బి  సమావేశాల్లో 590 కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపార అవకాశాలపై ఆసక్తి వ్యక్తం అయ్యింది. ఆయుర్వేద జెల్, నూనెలు, క్యాప్సూల్, ఆయుర్వేదిక్ హెయిర్ రెమెడీ ఉత్పత్తులు,న్యూట్రాస్యూటికల్స్, ఆయుర్వేద హోమ్ కేర్,  హైజీన్ & వెటర్నరీ   వంటి ఉత్పత్తులపై   వాణిజ్య ఆసక్తి వ్యక్తం అయ్యింది. . పరిశ్రమకు 9 లెటర్స్ ఆఫ్ ఇంటెంట్  అందాయి.

షాంఘై సహకార సంస్థ  సదస్సు  మార్చి 2న గౌహతిలో ప్రారంభమైంది, కార్యక్రమంలో  కేంద్ర ఆయుష్ మరియు మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్రభాయ్ ముంజ్‌పారా, మాల్దీవుల ఆరోగ్య మంత్రి  డాక్టర్ తేట్ ఖైంగ్ విన్, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సఫియా మొహమ్మద్ సయీద్,  వైద్య రాజేష్ కొటేచా తదితరులు పాల్గొన్నారు. 

 

షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలలో సంప్రదాయ వైద్య విధానం, సేవలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, సౌందర్య సాధనాలు, విధానాలు వంటి అంశాలపై సదస్సులో చర్చలు జరిగాయి. సభ్య దేశాలకు చెందిన నియంత్రణ సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార వర్గాలు సదస్సులో పాల్గొన్నాయి. దీనివల్ల   సంప్రదాయ వైద్యం , అనుబంధ రంగాల్లో పరస్పరం వాణిజ్యం, సంబంధాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారతదేశంతో సహా 17 దేశాలకు చెందిన 150 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఆరోగ్య మంత్రులు, అధికార ప్రతినిధులు మరియు  షాంఘై సహకార సంస్థ సభ్య  దేశాలకు చెందిన  విదేశీ కొనుగోలుదారులు వంటి ఉన్నత స్థాయి ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.  13 దేశాలకు చెందిన 75 మంది విదేశీ అధికారులు, వ్యాపార ప్రతినిధులు వ్యక్తిగతంగా పాల్గొన్నారు. చైనా, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ మరియు కజాఖ్స్తాన్ దేశాలకు చెందిన  అధికార ప్రతినిధులు ఇంటర్నెట్ ద్వారా వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. 

బి 2బి సమావేశాల సందర్భంగా షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలు అమలు చేస్తున్న   'సంప్రదాయ వైద్యం విధానం నియంత్రణ వ్యవస్థ ' ఉత్పత్తులు,  ఫార్మాకోపియా, నాణ్యత హామీ, పరిశోధన అంశాలపై   వివరణాత్మక ప్రదర్శనలు,  చర్చలు జరిగాయి. సంప్రదాయ వైద్యాన్ని ఎలా ప్రచారం చేయాలనే అంశంపై చర్చించారు. ఉత్పత్తుల  వారీగా ఎగుమతి,దిగుమతి అవకాశాలు,  ఆర్థిక భాగస్వామ్య అంశాలు చర్చించడానికి నిర్వహించిన   'మీ కొనుగోలుదారుని తెలుసుకోండి' కార్యక్రమం, బి 2 బి సమావేశాలు సభ్య దేశాలకు మార్కెట్ అవకాశాలు ఎక్కువ చేశాయి.   షాంఘై సహకార సంస్థ సభ్య   దేశాల మధ్య సంప్రదాయ వైద్య రంగంలో  వాణిజ్య అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమం జరిగింది. ఆయుష్ , విదేశీ సంప్రదాయ వైద్య రంగంలో  పరిశ్రమలు/ఎగుమతిదారులు/దిగుమతిదారులు తమ ఉత్పత్తులు,సేవలను ఎక్స్‌పోలో ప్రదర్శించారు.

 వాణిజ్య విధానాలు,  మార్కెట్ అవకాశాలపై ఫార్మా  డ్రగ్ తయారీదారులకు అవగాహన కల్పించడానికి ఏర్పాటైన కార్యక్రమం ద్వారా  స్థానిక ప్రాముఖ్యత,జనాదరణ పొందిన ఉత్పత్తుల వివరాలు, వాణిజ్యానికి అవకాశం, ఆవిష్కరణలపై సభ్య దేశాలకు అవగాహన కల్పించడంతో పాటు అందుబాటులో ఉన్న మార్కెట్ అవకాశాలు తెలియజేసింది. 

2022 సెప్టెంబర్ 17న ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో భారతదేశం 2023 సంవత్సరానికి  షాంఘై సహకార సంస్థ అధ్యక్ష బాధ్యతలు  స్వీకరించింది. సంప్రదాయ వైద్య విధానంపై షాంఘై సహకార సంస్థ నిపుణుల వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని  సమర్‌కండ్‌లో జరిగిన సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

షాంఘై సహకార సంస్థ రూపొందించిన కార్యక్రమాలను  ఆయుష్ మంత్రిత్వ శాఖ అమలు  చేస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆయుష్ మంత్రిత్వ శాఖ వర్చువల్ విధానంలో నిర్వహించిన సదస్సులో  25 దేశాలకు చెందిన సంప్రదాయ వైద్య నిపుణులు, అభ్యాసకులు పాల్గొన్నారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచనల మేరకు  గత నెలలో న్యూ ఢిల్లీలో జరిగిన నిపుణుల సమావేశంలో సంప్రదాయ వైద్య రంగంలో నిపుణుల వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు సంబంధించి  ముసాయిదా నిబంధనలు ఆమోదించారు.

 షాంఘై సహకార సంస్థ  చైనాలోని షాంఘై లో 2001 జూన్ 15 న ఏర్పాటయింది.  ఎనిమిది మంది  సభ్యులతో  యురేషియా రాజకీయ, ఆర్థిక మరియు భద్రతా కూటమిగా షాంఘై సహకార సంస్థ పనిచేస్తోంది. షాంఘై సహకార సంస్థ లో   08 సభ్య దేశాలు, 03 పరిశీలకులు 14 సంభాషణ భాగస్వామ్య దేశాలు ఉన్నాయి. జూలై 2005 అస్తానా లో జరిగిన సదస్సులో  భారతదేశానికి పరిశీలక దేశ  హోదా, 2017 జూన్ 9న కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన సదస్సులో  పూర్తి సభ్య హోదా లభించింది. నిపుణుల స్థాయిలో ఆమోదం పొందిన ముసాయిదా నిబంధనలు సంబంధిత దేశ పరిపాలన విధానాలకు లోబడి ఆమోదం పొందుతుంది. శిఖరాగ్ర సమావేశంలో షాంఘై సహకార సంస్థ నిబంధనలు ఆమోదిస్తుంది. 

***



(Release ID: 1904490) Visitor Counter : 216