హోం మంత్రిత్వ శాఖ
గుజరాత్ విశ్వవిద్యాలయంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సస్టెయినబిలిటీ నిర్వహించిన 'కశ్మీర్ మహోత్సవ్'ను ఉద్దేశించి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
భారతదేశం శతాబ్దాలుగా సహజీవనం ద్వారా ముందుకు సాగుతోంది; దేశంలో సహజీవనాన్ని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలతో పాటు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' అనే మూలమంత్రాన్ని అందించారు:
ఒకప్పుడు కశ్మీర్ లో బాంబు పేలుళ్లు, దాడులు, రాళ్లు రువ్వడం జరిగేవి: కానీ నేడు మోదీ నాయకత్వంలో వచ్చిన మార్పుల కారణంగా కశ్మీర్ యువత చేతిలో పుస్తకాలు, ల్యాప్ టాప్ లు ఉన్నాయి; , స్టార్టప్ ల పట్ల వారికి కొత్త ఆలోచన
ఉంది; ప్రపంచ యువతకు సవాలు విసరగల సత్తా వారికి ఉంది:
స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, పీఎం ముద్ర యోజన వంటి పథకాలకు అనుగుణంగా దేశంలోని యువత తమ మేధో సామర్థ్యాన్ని, శక్తిని, ఉత్సాహాన్ని పెంపొందించుకుంటే భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకోకుండా ఎవరూ ఆపలేరు.
నేడు స్టార్టప్ ఇండియా ద్వారా భారతదేశంలో 70,000 స్టార్టప్ లకు ఎకోసిస్టమ్ సిద్ధం అయింది; అందులో 44 శాతం స్టార్టప్ లను మహిళలే నడుపుతున్నారు; ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యువత తిరిగి కశ్మీర్ కు వెళ్లినప్పుడు, వారు కాశ్మీర్ లో కూడా స్టార్టప్ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెడతారు:
కాశ్మీర్ అనేక సంస్కృతుల సమ్మేళనం
Posted On:
02 MAR 2023 7:15PM by PIB Hyderabad
గుజరాత్ విశ్వవిద్యాలయంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సస్టెయినబిలిటీ నిర్వహించిన కాశ్మీర్ మహోత్సవ్ ను ఉద్దేశించి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
శతాబ్దాలుగా భారతదేశం సహజీవనం ద్వారా ముందుకు సాగుతోందని, భిన్నత్వంతో నిండిన దేశంలో సహజీవనాన్ని బలోపేతం చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాు తో పాటు 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' అనే మూల మంత్రాన్ని అందించారని శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు. విభిన్న సంస్కృతులు, భాషలు, వంటకాలు, వస్త్రధారణ మన బలమని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు "ఏక్ భార త్ శ్రేష్ఠ భారత్ " భావనను జీవన మంత్రంగా అలవర్చుకోవాలని పిలుపునిచ్చారని శ్రీ షా తెలిపారు.
కాశ్మీర్ అనేక సంస్కృతుల సమ్మేళనం అని, భరతమాత కిరీటంలో ఒక ఆభరణమని కేంద్ర హోం, సహకార మంత్రి అన్నారు. కశ్మీర్ లో చోటుచేసుకుంటున్న మార్పులు కశ్మీర్ బిడ్డలకే కాదు, దేశంలోని మొత్తం యువతకు ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. గత ఏడాది సుమారు 1.80 కోట్ల మంది పర్యాటకులు కాశ్మీర్ ను సందర్శించారని, వారు కశ్మీరియత్ ,కాశ్మీర్ సంస్కృతిని తెలుసుకున్నారని, మంచి సందేశంతో తిరిగి వెళ్లారని శ్రీ షా అన్నారు.
ఒకప్పుడు కశ్మీర్ లో బాంబు పేలుళ్లు, దాడులు, రాళ్లు రువ్వే ఘటనలు జరిగేవని, కానీ నేడు మోదీ నాయకత్వంలో వచ్చిన మార్పుల వల్ల కశ్మీర్ యువత చేతిలో పుస్తకాలు, ల్యాప్ టాప్ లు ఉన్నాయని, స్టార్టప్ ల పట్ల వారికి కొత్త ఆలోచన ఉందని, ప్రపంచ యువతకు సవాలు విసరగల సామర్థ్యం ఉందని ఆయన అన్నారు. కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370, 35ఏలను తొలగించిన తర్వాత తొలిసారిగా ప్రజాస్వామ్యం అట్టడుగు స్థాయి వరకు చేరుకుందన్నారు.
నేడు 30,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు కాశ్మీర్ పంచాయితీ వ్యవస్థలో పనిచేస్తున్నారని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన మార్పులతో యావత్ దేశం సంతోషంగా ఉందన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి వ్యవస్థతో, నిరుపేద భారతీయుడిని ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తున్నారని శ్రీ అమిత్ షా అన్నారు.
గుజరాత్ యూనివర్సిటీ సర్దార్
వల్లభాయ్ పటేల్ , డాక్టర్ విక్రమ్ సారాభాయ్ , శ్రీ నరేంద్ర మోదీల విశ్వ విద్యాలయం అని, దేశ నిర్మాణానికి సేవలు అందించిన ఎందరో మహనీయులను ఈ విశ్వవిద్యాలయం తయారు చేసిందని ఆయన అన్నారు.
దేశంలోనే తొలి ఇన్నోవేషన్ పార్క్ ను గుజరాత్ యూనివర్సిటీలో ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 300కు పైగా స్టార్టప్ లకు మద్దతు ఇస్తోందని, గుజరాత్ లోని అమూల్ కోఆపరేటివ్ సొసైటీ 28 లక్షల మంది మహిళల కృషితో సజావుగా పనిచేస్తోందని, దాని వార్షిక టర్నోవర్ రూ.60,000 కోట్లుగా ఉందని శ్రీ అమిత్ షా చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వచ్చే మూడేండ్లలో దేశంలోని రెండు లక్షల పంచాయతీల్లో మల్టీడైమెన్షనల్ ప్రాథమిక సహకార పరపతి సొసైటీల (పీఏసీఎస్ ) ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఇవి పంచాయతీలకు గ్రామీణాభివృద్ధిలో కొత్త కోణాలను అందిస్తాయని, ఈ బహుళార్థసాధక పీఏసీఎస్ లను క్షేత్రస్థాయిలో నిర్వహించేందుకు సహకార మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉన్న యువతకు అనేక వేదిక లను అందించారని శ్రీ అమిత్ షా అన్నారు. యువతలోని శక్తికి, ప్రతిభకు ప్రపంచ వేదికను కల్పించే వేదిక 'స్కిల్ ఇండియా' అని ఆయన అన్నారు.
అనేక కొత్త ఐటీఐలలో 4 వేల సీట్లు సృష్టించామని, 15 వేల ఐటీఐలలో 126 స్ట్రీమ్ లలో 20 లక్షల మందికి పైగా యువతకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. 'స్టార్టప్ ఇండియా' కింద 70,000కు పైగా స్టార్టప్ లు తమ ఎకోసిస్టమ్ ను బలోపేతం చేసుకుంటున్నాయని, అయితే 2016లో వాటి సంఖ్య కేవలం 724 మాత్రమేనని శ్రీ షా అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'స్టార్టప్ ఇండియా' పథకం ప్రారంభించిన తరువాత 70,000 కు పైగా స్టార్టప్ లు ఏర్పాటయ్యాయని, వీటిలో 44 శాతం స్టార్టప్ లను అమ్మాయిలు,
మహిళలు నడుపుతున్నారని శ్రీ షా తెలిపారు. ఇవి కాకుండా 100కు పైగా స్టార్టప్ లు యూనికార్న్ క్లబ్ లో చేరగా, 45 శాతం స్టార్టప్ లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్నాయి.
కశ్మీర్ లో కూడా స్టార్టప్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని శ్రీ అమిత్ షా యువతకు పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 లో 'మేక్ ఇన్ ఇండియా' పథకాన్ని
ప్రారంభించారని, దీని ఫలితంగా 2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వాణిజ్య ఎగుమతులు 400 కోట్ల డాలర్లను దాటాయని ఆయన అన్నారు. పీఎల్ఐ పథకం కింద 12 రంగాల్లో రూ.3 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. భారతదేశ యువతకు 'పేటెంట్ రిజిస్ట్రేషన్' కోసం అనేక సౌకర్యాలు కల్పించామని శ్రీ షా చెప్పారు.
2013-14లో భారత్ నుంచి కేవలం 3000 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, ప్రస్తుతం భారత్ నుంచి ఏటా 24 వేల దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి దేశ యువత కోసం ముద్ర యోజన, డిజిటల్ ఇండియా మిషన్ , ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా వంటి అనేక పథకాలను ప్రారంభించారని ఆయన తెలిపారు.
ఇది 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సంవత్సరం అని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 నుంచి 2047 వరకు 25 సంవత్సరాలను 'అమృత్ కాల్'గా ప్రకటించారని శ్రీ అమిత్ షా అన్నారు.
ఈ 'అమృత్ కాల్'లో, స్వాతంత్ర్య శతాబ్ది నాటికి, భారతదేశం ప్రపంచంలోని ప్రతి రంగంలో మొదటి స్థానంలో ఉంటుందని మనం ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, పీఎం ముద్ర యోజన వంటి పథకాలకు అనుగుణంగా దేశంలోని యువత తమ మేధో సామర్థ్యాన్ని, శక్తిని, ఉత్సాహాన్ని పెంపొందించుకుంటే భారతదేశం ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి చేరుకోకుండా ఎవరూ ఆపలేరని శ్రీ అమిత్ షా అన్నారు.
*******
(Release ID: 1903792)
Visitor Counter : 189