ఆర్థిక మంత్రిత్వ శాఖ
జి-20 ఇండియా ప్రెసిడెన్సీ క్రింద "విధాన దృక్పథం: క్రిప్టో ఆస్తులపై విధాన ఏకాభిప్రాయానికి కార్యాచరణపై చర్చ"పై - నిపుణుల చర్చా గోష్టి
Posted On:
25 FEB 2023 12:47PM by PIB Hyderabad
భారత దేశ జి-20 ప్రెసిడెన్సీ "వసుధైవ కుటుంబకం" లేదా "ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు" అనే ఇతివృత్తం పై ఆధారపడి ఉంది, ఇది సమానమైన వృద్ధి, అందరికీ భాగస్వామ్య భవిష్యత్తు సందేశాన్ని నొక్కి చెబుతుంది. ఆర్థిక రంగాన్ని మార్చడం, ఆర్థిక చేరికను పెంచడంతో పాటు, ఆర్థిక మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడంలో డిజిటల్ సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. 2023 సంవత్సరంలో ఆర్థిక రంగ నియంత్రణ సంస్కరణలతో పాటు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత సమర్థవంతంగా, సురక్షితంగా, స్థిరంగా చేయడంమే, ఇండియన్ ప్రెసిడెన్సీ ప్రాధాన్యత.
ఈ ప్రపంచం వేగవంతంగా పరిణామం చెందుతున్నప్పటికీ, క్రిప్టో ఆస్తుల కోసం సమగ్ర ప్రపంచ విధాన కార్యాచరణ ప్రణాళిక లేదు. క్రిప్టో ఆస్తులు, సాంప్రదాయ ఆర్థిక రంగం, క్రిప్టో ఆస్తుల చుట్టూ ఉన్న సంక్లిష్టత, అస్థిరత మధ్య ఎక్కువ పరస్పర అనుసంధానంపై ఉన్న ఆందోళనల దృష్ట్యా, విధాన రూపకర్తలు కఠినమైన నియంత్రణ కోసం పిలుపునిచ్చారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్.ఏ.టి.ఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్.ఎస్.బి), చెల్లింపులు, మార్కెట్ మౌలిక సదుపాయాల కమిటీ (సి.పి.ఎం.ఐ), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమీషన్స్ (ఐ.ఓ.ఎస్.సి.ఓ), బ్యాంకింగ్ పర్యవేక్షణపై బాసెల్ కమిటీ (బి.సి.బి.ఎస్) వంటి గ్లోబల్ స్టాండర్డ్-సెట్టింగ్ సంస్థలు వాటి సంబంధిత సంస్థాగత ఆదేశాలలో పని చేస్తున్నప్పుడు, నియంత్రణ ఎజెండాను సమన్వయం చేస్తున్నాయి.
క్రిప్టో ఆస్తులపై అంతర్జాతీయ విధాన డైలాగ్ ను రూపొందించడం
ఆర్థిక సమగ్రత ఆందోళనలకు మించి క్రిప్టో ఆస్తులపై జి-20 చర్చను విస్తృతం చేయాలని, ఆర్థిక వ్యవస్థలో స్థూల ఆర్థిక పరమైన చిక్కులు, విస్తృతమైన క్రిప్టో స్వీకరణను సంగ్రహించాలని భారతదేశం భావిస్తోంది. జి-20 సభ్యులు సమన్వయ, సమగ్రమైన విధాన ప్రతిస్పందనను రూపొందించడానికి అనుమతిస్తూ, దీనికి గ్లోబల్ సవాళ్లు, క్రిప్టో ఆస్తుల అవకాశాలకు డేటా-ఆధారిత సమాచార విధానం అవసరం.
క్రిప్టో ఆస్తుల, విస్తృత స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వ ప్రభావాల గురించి విధాన రూపకర్తలకు తెలియజేయడానికి, 2023 ఫిబ్రవరి, 23వ తేదీన బెంగళూరులో జరిగిన 2వ జి-20 ఆర్ధిక, సెంట్రల్ బ్యాంకు డిప్యూటీస్ సమావేశం కోసం చర్చా పత్రాన్ని సిద్ధం చేయవలసిందిగా భారత ప్రెసిడెన్సీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్) ని అభ్యర్థించింది. ఈ సమావేశంలో భాగంగా, క్రిప్టో ఆస్తులపై చర్చను విస్తృతం చేసేందుకు ప్రెసిడెన్సీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, "విధాన దృక్పథాలు: క్రిప్టో ఆస్తులపై విధాన ఏకాభిప్రాయానికి దారి" శీర్షికన సదస్సు జరిగింది. ఐ.ఎం.ఎఫ్. స్పీకర్, శ్రీ తొమ్మసో మన్సిని-గ్రిఫ్ఫోలీ, ఈ కార్యక్రమంలో చర్చా పత్రాన్ని సమర్పిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క అంతర్గత, బాహ్య స్థిరత్వంతో పాటు, దాని ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై క్రిప్టో స్వీకరణ పరిణామాలను నొక్కి చెప్పారు. క్రిప్టో ఆస్తులకు ఉద్దేశించిన ప్రయోజనాలలో చౌకైన, వేగవంతమైన సరిహద్దు చెల్లింపులు, మరింత సమీకృత ఆర్థిక మార్కెట్లతో పాటు, పెరిగిన ఆర్థిక చేరికలు ఉన్నాయనీ, అయితే అవి ఇంకా పూర్తిగా బయటపడలేదనీ, శ్రీ మాన్సిని-గ్రిఫోలీ పేర్కొన్నారు. పరస్పర చర్య, భద్రత, సమర్థతతో సమస్యలకు ప్రైవేట్ రంగం హామీ ఇవ్వలేదనీ, లెడ్జర్ల కోసం క్లిష్టమైన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ / ప్లాట్-ఫారమ్ లను ప్రజా ప్రయోజనంగా చూడాలని కూడా ఆయన సూచించారు. క్రిప్టో అసెట్ విశ్వానికి సంబంధించిన ప్రపంచ సమాచార అంతరాలతో పాటు, జి-20 ఆధ్వర్యంలో క్రిప్టో ఆస్తులకు సంబంధించిన పరస్పర అనుసంధానాలు, అవకాశాలు, నష్టాల గురించి లోతైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని గురించి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
జి-20 సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో పాటు ఈ అంశంపై ప్రముఖ నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ చర్చల్లో దిగువ పేర్కొన్న అంశాలతో సహా, అనేక ఇతర అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది:
ఏ) క్రిప్టో ఆస్తి విశ్వం యొక్క సాధారణ వర్గీకరణతో పాటు,
క్రమబద్ధమైన వర్గీకరణ అవసరం,
బి) క్రిప్టో ఆస్తుల ప్రయోజనాలు, నష్టాలు
సి) మరింత మూల్యాంకనం చేయవలసిన స్థూల ఆర్థిక విధాన ప్రశ్నలు
డి) ఆర్థిక స్థిరత్వ సమస్యలు, నియంత్రణ ప్రతిస్పందనలు.
నిపుణుల బృందంలో కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీ ఈశ్వర్ ప్రసాద్, అమెరికా విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీమతి హిల్లరీ అలెన్ వంటి విద్యావేత్తలు ఉన్నారు. వికేంద్రీకృత వేదికగా చెప్పుకుంటున్నప్పటికీ, క్రిప్టో కి ఉన్న ప్రపంచంలో అత్యంత కేంద్రీకృత స్వభావం గురించి వారు చర్చించారు. నిజమైన ఆర్థిక వ్యవస్థ కోసం క్రిప్టో ఆస్తులు సృష్టించే ఖర్చులు, ప్రయోజనాలతో పాటు, కొత్త ఫిన్-టెక్ ఆవిష్కరణల కోసం స్పష్టమైన నియంత్రణ పరిధులను ఏర్పాటు చేయవలసిన అవసరం గురించి, బి.ఐ.ఎస్. కు చెందిన శ్రీ హ్యూన్ షిన్ వివరించారు. క్రిప్టో ప్రపంచంలో సరైన పరిపాలనా నిర్మాణం లేకపోవడంతో పాటు, అంతర్జాతీయ ఆర్ధిక, చెల్లింపు విధానాలలో ఇప్పటికే ఉన్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ పరిష్కారాలను కూడా చూడవలసిన అవసరం గురించి, జి-20 దేశాలకు చెందిన ప్రతినిధులు అనేక ఆందోళనలను లేవనెత్తారు.
క్రిప్టో ఆస్తులపై విస్తృత సంభాషణను ప్రారంభించడంలో ఈ కార్యక్రమం సహాయపడింది, అయితే విధాన నిర్ణేతలు, నియంత్రణాధికారులు నిశితంగా పరిశీలించాల్సిన అనేక సంబంధిత విధాన ప్రశ్నలు కూడా పరిగణలోకి వచ్చాయి. విస్తృత ఆర్థిక వ్యవస్థకు క్రిప్టో ఆస్తుల పర్యవసానాలను మూల్యాంకనం చేయడంతో పాటు, ప్రపంచ ఆర్థిక విధానాలలో ఇప్పటికే ఉన్న సవాళ్లకు కూడా క్రిప్టో ఆస్తులు సరైన పరిష్కారమా అనే ప్రశ్న కూడా పరిశీలనలోకి వచ్చింది.
భవిష్యత్ ప్రణాళిక :
విధాన కార్యాచరణ ప్రణాళిక ఆవశ్యకతపై కొనసాగుతున్న సంభాషణను పూర్తి చేయడానికి, క్రిప్టో-ఆస్తుల స్థూల ఆర్థిక, నియంత్రణ దృక్కోణాలను సమన్వయ పరిచే ఐ.ఎం.ఎఫ్., ఎఫ్.ఎస్.బి. ఉమ్మడి సాంకేతిక పత్రాన్ని ఇండియన్ ప్రెసిడెన్సీ ప్రతిపాదించింది. ఇది క్రిప్టో ఆస్తులకు సమన్వయ, సమగ్ర విధానపరమైన విధానాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది. 2023 అక్టోబర్ నెలలో జరిగే 4వ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో అంతర్జాతీయ సంస్థలు తమ ఉమ్మడి పత్రాన్ని సమర్పించాలని భావిస్తున్నారు. జి-20 ఇండియన్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో జరిగిన ఇటువంటి ఇతర చర్చా సదస్సులకు ఈ పత్రం అనుబంధంగా ఉంటుందని భావిస్తున్నారు. జి-20 సమావేశాల్లో సమాచార చర్చను నిర్మించి, సమన్వయ, సమగ్ర విధానపరమైన విధానాన్ని రూపొందించడానికి, ఈ చర్చలు దారితీస్తాయని భావిస్తున్నారు.
ఐ.ఎం.ఎఫ్. చర్చా పత్రం, పాలసీ సెమినార్, ఉమ్మడి ఐ.ఎం.ఎఫ్.-ఎఫ్.ఎస్.బి. పేపర్ క్రిప్టో ఆస్తుల స్థూల-ఆర్థిక, నియంత్రణ దృక్కోణాలకు సంబంధించిన విధాన ప్రశ్నలను ఏకీకృతం చేసి, చక్కటి సమన్వయంతో కూడిన సమగ్ర విధానంపై ప్రపంచ ఏకాభిప్రాయాన్ని, క్రిప్టో ఆస్తులకు సంబంధించిన విధానం, మొత్తం మీద సులభతరం చేస్తుంది.
*****
(Release ID: 1902491)
Visitor Counter : 229