రక్షణ మంత్రిత్వ శాఖ
ఆలోచించండి ఆవిష్కరించండి, నూతన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయండి.. పరిశ్రమలు ఏర్పాటు చేయండి
పశ్చిమ బెంగాల్ విశ్వ భారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో విద్యార్థులకు రక్షణ శాఖ మంత్రి పిలుపు
పరిశోధనా సంస్థలు, అంకుర సంస్థలు భారతదేశాన్ని మరింత బలోపేతం చేసి స్వావలంబన సాధించేందుకు సహకరిస్తాయి... శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
24 FEB 2023 12:18PM by PIB Hyderabad
విద్యార్థులు వినూత్న ఆలోచనలతో నూతన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసి పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు రావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. స్వావలంబన సాధించి భారత దేశాన్ని మరింత శక్తివంత దేశంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం చేస్తున్న కృషికి పరిశోధనా సంస్థలు అంకుర సంస్థలు సహకరిస్తాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 2023 ఫిబ్రవరి 24న జరిగిన పశ్చిమ బెంగాల్ విశ్వ భారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్ గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్ ని స్ఫూర్తిగా తీసుకుని స్పష్టమైన దృక్పధంతో జీవితంలో ఎదగడానికి విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. జీవిత లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తూ శతాబ్దాల నాటి భారతీయ సంప్రదాయాలు విలువలు పరిరక్షణకు దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.
శక్తి సామర్ధ్యాలను పూర్తిగా వినియోగిస్తూ ఒక బృందంలో పని చేసి విజయం సాధించడానికి కృషి చేస్తూ విజయాలు చూసి గర్వపడకుండా, అపజయం ఎదురైనప్పుడు కుంగిపోకుండా ముందుకు సాగాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. విచ్చలవిడితనం అపజయాలకు, సమతూల్యత విజయానికి కారణం అవుతాయన్నారు. విద్యార్థులు అహంకారానికి దూరంగా ఉండాలన్నారు. “ వ్యక్తిత్వం,జ్ఞానం, సంపదకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి. భారతదేశ ప్రగతి పథంలో యువత పాత్ర కీలకంగా ఉంటుంది. మీరు ఎంత బలవంతులు అయితే మన దేశం అంత బలపడుతుంది’’ అని అన్నారు.
విద్యార్థులు ఎక్కడికి వెళ్లినా విశ్వభారతి పరిమళాన్ని వెదజల్లాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఉద్బోధించారు, విశ్వ భారతి విశ్వవిద్యాలయం అభివృద్ధిని విద్యార్థులు తమ నైతిక కర్తవ్యంగా పరిగణించాలని సూచించారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ తాత్విక వారసత్వం అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జ్ఞానం,ప్రతిభకు విశ్వవిద్యాలయం నిదర్శనం అని అన్నారు. “ భారతీయ , ప్రపంచ విజ్ఞాన రంగాల అద్వితీయ సమ్మేళనం విశ్వభారతి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్ఞాన ప్రవాహాన్ని భారతీయ ఆలోచనలోకి విశ్వభారతి సమ్మిళితం చేస్తుంది. మొత్తం ప్రపంచానికి జ్ఞానోదయం చేస్తుంది, ”అని ఆయన అన్నారు.
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయవాదం, సార్వత్రిక మానవతావాదం గురించి విద్యార్థులకు రక్షణ శాఖ మంత్రి వివరించారు.గొప్ప తత్వవేత్త అయిన రవీంద్రనాధ్త ఠాగూర్ తన ఆలోచనలు, తత్వశాస్త్రం, విలువలతో భారతీయ సమాజాన్ని, రాజకీయాలను ప్రభావితం చేశారు అని అన్నారు. శతాబ్దాలుగా భారత జాతీయవాదం సహకారం, మానవ సంక్షేమ భావనపై ఆధారపడి ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. . “భారత జాతీయవాదం సాంస్కృతికమైనది గాని ప్రాదేశికమైనది కాదు. భౌగోళిక అంశాలతో సంబంధం లేకుండా దేశం చైతన్యవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజా సంక్షేమం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. భారత జాతీయవాదం ప్రత్యేకవాదం అందరినీ కలుపుకొని పోతూ సార్వత్రిక సంక్షేమం స్ఫూర్తితో పనిచేస్తుంది. భారత జాతీయవాదానికి విశ్వభారతి సూచిక’’ అని అన్నారు.
పారిశ్రామిక అభివృద్ధి, దేశాభివృద్ధికి ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం అత్యంత అవసరమని గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ భావించారని పేర్కొన్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆయన దార్శనికతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన కాలంలో శ్రీ ఠాగూర్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న అంశంపై స్పష్టమైన అవగాహనతో వ్యవహరించారన్నారు. ఆ దార్శనికత ఫలితంగా నేడు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడం ద్వారా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్న రక్షణ శాఖ మంత్రి , 'మేకింగ్ ఇన్ ఇండియా, మేకింగ్ ఫర్ ది వరల్డ్' దేశ విధానమన్నారు.' ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం గుర్తింపు పొందింది. ప్రముఖ పెట్టుబడి సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక ప్రకారం, రాబోయే 4-5 సంవత్సరాల కాలంలో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 2047 నాటికి మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధిస్తుంది అన్న నమ్మకం నాకుంది. ఇది గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌కు నిజమైన నివాళి అవుతుంది” అని ఆయన అన్నారు.
సామాజిక పరివర్తన, మహిళా సాధికారత మరియు కుల వివక్ష నిర్మూలన వంటి అంశాలపై రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలు ప్రస్తావించిన శ్రీ సింగ్ ఈ ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతం, రచనలు భారతీయత నిండిన సారాంశమైన జ్ఞానాన్ని ప్రసరింపజేస్తాయని ఆయన అన్నారు.
గొప్ప తత్వవేత్త అయిన వారి రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యా సంబంధిత ఆలోచనలు నేటికీ మార్గదర్శక కాంతిగా పనిచేస్తాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. “సత్యాన్వేషణ , సామాజిక సంక్షేమాన్ని సాధించడానికి విద్య ఒక్కటే మార్గమని గురుదేవ్ విశ్వసించారు. కేవలం నేర్చుకుంటే సరిపోదు. నేర్చుకున్న విద్య సమాజ హితానికి ఉపయోగపడాలని రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య విద్యా విధానంలో ఒక ఉపాధ్యాయుడు 40-50 మంది విద్యార్థులకు విద్యను అందిస్తారు. దీనివల్ల విద్యార్థుల వ్యక్తిత్వం అభివృద్ధి చెందదు. భారతదేశంలో ప్రాచీన గురుకులంలో ఇటు వంటి వ్యవస్థ లేదు. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి 1:5 గా ఉండేది అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల వ్యక్తిత్వ వికాసం, సరైన ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి పై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 ని ప్రభుత్వం రూపొందించింది”అని ఆయన అన్నారు.
****
(Release ID: 1902023)