మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

మూడవ దశ సాగర్ పరిక్రమ కార్యక్రమాన్ని గుజరాత్ నుంచి మహారాష్ట్ర వరకు నిర్వహించనున్న - మత్స్య శాఖ

Posted On: 18 FEB 2023 6:20PM by PIB Hyderabad

 

 

1.    మత్స్యకారులు, ఇతర వాటాదారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ మత్స్యకార పథకాలు, కార్యక్రమాల ద్వారా వారి ఆర్థికాభివృద్ధిని సులభతరం చేయడాన్ని సాగర్ పరిక్రమ లక్ష్యంగా పెట్టుకుంది.

 

2.    గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన నాణ్యత, ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడంతో పాటు, జీవనోపాధి అవకాశాలను మరింతగా సృష్టించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

 

3.    ఈ ప్రయాణంలో రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు, మత్స్యకారులు, పారిశ్రామికవేత్తలు, వాటాదారులు, నిపుణులు, అధికారులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. 

 

4.    కె.సి.సి. ప్రచార కార్యక్రమం 2023 ఫిబ్రవరి 16, 17 తేదీల్లో మహారాష్ట్ర, గుజరాత్‌ లలో జరిగింది. 

 

 

సాగర్ పరిక్రమ అనేది మన గొప్ప స్వాతంత్య్ర సమరయోధులు, నావికులు, మత్స్యకారులకు వందనం చేస్తూ 75వ ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్ స్ఫూర్తిగా మత్స్యకారులు, చేపల పెంపకం దారులతో పాటు సంబంధిత వాటాదారులందరికీ సంఘీభావం తెలుపుతూ తీర ప్రాంతం వెంబడి సముద్రంలో చేపడుతున్న ఒక పరిణామ ప్రయాణం.  మత్స్యకారులు, ఇతర వాటాదారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, పి.ఎం.ఎం.ఎస్.వై. వంటి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ మత్స్యకార పథకాలు, కార్యక్రమాల ద్వారా వారి ఆర్థికాభివృద్ధిని సులభతరం చేయడం లక్ష్యంగా, ఇది భారత ప్రభుత్వం చేపట్టిన ఒక అద్భుత కార్యక్రమం. 

 

మూడవ దశ ‘సాగర్ పరిక్రమ’ 2023 ఫిబ్రవరి 19వ తేదీన గుజరాత్‌, హజీరా పోర్టు లోని సూరత్ నుండి ప్రారంభమౌతుంది. ఆ తర్వాత మీడియా తో కలిసి మహారాష్ట్ర తీర ప్రాంతం వెంబడి ప్రయాణం కొనసాగుతుంది. 2023 ఫిబ్రవరి 20, 21 తేదీల్లో ఉత్తర మహారాష్ట్ర లోని సత్పతి, వాసాయి, వెర్సోవా, సాసన్ డాక్, ముంబై లోని ఇతర ప్రాంతాల వెంబడి ఈ ప్రయాణం కొనసాగుతుంది. 

 

ఐదు తీర ప్రాంత జిల్లా లైన థానే, రాయగడ, గ్రేటర్ ముంబై, రత్నగిరి, సింధుదుర్గ్‌ లతో కూడిన 720 కి.మీ.మేర మహారాష్ట్ర తీరప్రాంతాన్ని కలిగి ఉంది.  మత్స్య రంగం అభివృద్ధి లో జానపద మత్స్య కారులు, విక్రేతలు, పరిశ్రమలు మత్స్య పరిశ్రమ రంగానికి చెందిన ఆర్థిక విలువలు, ముఖ్యంగా ఎగుమతులలో ప్రత్యక్ష వాటాను కలిగి ఉన్నాయి.

 

భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన మత్స్య విభాగం; జాతీయ మత్స్య అభివృద్ధి మండలి; గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ మత్స్య శాఖ; మహారాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్;  భారతీయ తీర రక్షక దళం; ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా; గుజరాత్ మారిటైమ్ బోర్డు ప్రతినిధులు; మత్స్యకారుల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా;  భారత ప్రభుత్వ మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్;   భారత ప్రభుత్వ మత్స్య శాఖ, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు, గుజరాత్ ప్రభుత్వం,  మహారాష్ట్ర ప్రభుత్వం, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు,  భారతీయ తీర రక్షక దళానికి చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు, మత్స్యకారులు, పారిశ్రామికవేత్తలు, వాటాదారులు, నిపుణులు, అధికారులు, దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఈ ప్రయాణంలో పాల్గొంటున్నారు. 

 

ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రగతిశీల మత్స్యకారులకు, ముఖ్యంగా తీరప్రాంత మత్స్యకారులు, మత్స్యకారులు, చేపల పెంపకం దారులు, యువ మత్స్య పారిశ్రామిక వేత్తలు మొదలైన వారికి ప్రధాన మంత్రి మత్స్య సంపద పథకం, కె.సి.సి. తో పాటు, రాష్ట్ర పథకానికి సంబంధించిన ధ్రువపత్రాలు / అనుమతులను అందజేయడం జరుగుతుంది.   ఈ పథకాల పట్ల మత్స్యకారులకు విస్తృత అవగాహన కోసం పి.ఎం.ఎం.ఎస్.వై. పథకం, రాష్ట్ర పథకాలు, ఈ-శ్రమ్, ఎఫ్.ఐ.డి.ఎఫ్., కె.సి.సి. మొదలైన వాటిపై పూర్తి సమాచారాన్ని ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీడియోలు, డిజిటల్ ప్రచారం, జింగిల్స్ ద్వారా  ప్రాచుర్యం లోకి తీసుకురావాలి.   సాగర పరిక్రమపై మరాఠీ భాషలో ఒక గీతాన్ని కూడా విడుదల చేయనున్నారు.

 

దేశ ఆహార భద్రత, తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధి కోసం సముద్ర మత్స్య వనరుల వినియోగం మధ్య స్థిరమైన సమతుల్యత పై సాగర్ పరిక్రమ ప్రయాణం దృష్టి పెడుతుంది.  అదేవిధంగా, సముద్ర పర్యావరణ వ్యవస్థ పరిరక్షణతో పాటు, మత్స్యకార సంఘాల మధ్య అంతరాలను, వారి అంచనాలను తగ్గించడంపై కూడా సాగర్ పరిక్రమ దృష్టి పెడుతుంది.   మత్స్యకార గ్రామాల అభివృద్ధి, పర్యావరణ వ్యవస్థ విధానం ద్వారా స్థిరమైన, బాధ్యతాయుతమైన అభివృద్ధిని నిర్ధారించడానికి; ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సృష్టించడం పై కూడా ఈ కార్యక్రమం దృష్టి సారిస్తోంది. 

 

గుజరాత్, డయ్యూ, మహారాష్ట్ర, గోవా, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అండమాన్-నికోబార్, లక్షద్వీప్ దీవులు వంటి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని కోస్తా తీర ప్రాంతాల నుంచి ముందుగా నిర్ణయించిన సముద్ర మార్గాలలో ఈ సాగర్ పరిక్రమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది.  ఈ కార్యక్రమంలో భాగంగా, తీరప్రాంత గిరిజన మత్స్యకారుల సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా, ఆయా ప్రదేశాల్లో మత్స్యకారులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, వాటాదారులతో పరస్పర చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.   గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన నాణ్యత, ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడంతో పాటు, వారికి మరిన్ని జీవనోపాధి అవకాశాలను సృష్టించేందుకు, వారు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్.డి.జి.లను) చేరుకోవడానికి భారత ప్రభుత్వం ఒక సమగ్ర విధానాన్ని అవలంబించింది.

 

"సాగర్ పరిక్రమ" మొదటి దశ "క్రాంతి-సే-శాంతి" అనే ఇతివృత్తంతో 2022 మార్చి, 5వ తేదీన ప్రారంభమై, గుజరాత్‌ లోని మాండ్వి (శ్యామ్‌ జీ కృష్ణ వర్మ స్మారక చిహ్నం) నుండి ఓఖా-ద్వారక వరకు మూడు ప్రదేశాల గుండా ప్రయాణించి, 2022 మార్చి, 6వ తేదీన పోర్‌-బందర్‌ లో ముగిసింది.   ఈ కార్యక్రమం భారీ విజయాన్ని సాధించింది.   ఈ కార్యక్రమానికి ఐదు వేల మందికి పైగా ప్రత్యక్షంగా హాజరయ్యారు.  కాగా, యూ-ట్యూబ్, ఫేస్‌-బుక్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని సుమారు పది వేల మంది ప్రజలు వీక్షించారు.

 

ఈ ప్రయాణం 2022 సెప్టెంబర్, 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రెండవ దశ కార్యక్రమం కొనసాగింది.  ఈ కార్యక్రమం ఐ.ఎఫ్.బి., ఐ.సి.జి. నౌకల్లో ప్రయాణిస్తూ  మంగ్రోల్, వెరావల్, డయ్యూ, జఫ్రాబాద్, సూరత్, డామన్, వల్సాద్ వంటి ఏడు ప్రదేశాల గుండా సాగింది.  ఇందులో భాగంగా మత్స్యకారులతో సంభాషించి, తీరప్రాంత మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది.  శంకర్ మహదేవన్ గుజరాతీ భాషలో ఆలపించిన సాగర పరిక్రమ గీతాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించడం జరిగింది.  ఈ కార్యక్రమానికి 20 వేల మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా హాజరయ్యారు.  కాగా, యూ-ట్యూబ్, ఫేస్‌-బుక్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని సుమారు 15 వేల మంది ప్రజలు వీక్షించారు.

 

కె.సి.సి. ప్రచార కార్యక్రమం భారత ప్రభుత్వ మత్స్య శాఖ ద్వారా 2023 ఫిబ్రవరి 16, 17 తేదీల్లో మహారాష్ట్ర, గుజరాత్‌ లలో జరిగింది.   2023 ఫిబ్రవరి 16వ తేదీన భారత ప్రభుత్వ మత్స్య శాఖ కు చెందిన అధికారులు డాక్టర్ నియతి జోషి, శ్రీ నిఖిల్ కుమార్ తో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన శ్రీ సాగర్ కువేస్కర్, డాక్టర్ సందీప్ పి. జాదవ్ వసాయ్ లో క్యాంపు సమావేశాన్ని నిర్వహించారు.  మత్స్య సంపద నమోదు, దాని ప్రయోజనాల కోసం మత్స్యకారులకు, మత్స్య రైతులకు కె.సి.సి. గురించి అవగాహన కల్పించారు.

 

ముంబై నగరం, ముంబయి పరిసర ప్రాంతంలోని సాసన్ డాక్‌ లో మత్స్యకారులు, మత్స్య రైతుల కోసం 2023 ఫిబ్రవరి 17వ తేదీన కె.సి.సి ప్రచార శిబిరం నిర్వహించారు.  భారత ప్రభుత్వ మత్స్య శాఖ, మహారాష్ట్ర మత్స్య విభాగానికి చెందిన అధికారులు; లీడ్ బ్యాంకు ప్రతినిధులు,  బ్యాంకు అఫ్ ఇండియా, ముంబాయి జిల్లా బ్యాంకు ప్రతినిధులతో పాటు సుమారు రెండు వందల మంది మత్స్య కారులు, మత్స్య రైతులు ఈ శిబిరంలో పాల్గొన్నారు.    మత్స్యకారులు, మత్స్య రైతుల సమస్యలను అర్థం చేసుకునేందుకు అందరూ ప్రయత్నించారు.  మత్స్యకారులు, చేపల పెంపకందారుల కోసం కె.సి.సి. వివరాలతో పాటు, దాని ప్రయోజనాలను బ్యాంకు ప్రతినిధులు వివరించారు.

 

ఆరోగ్యకరమైన మహాసముద్రాలు, సముద్రాలు భూమిపై మానవ ఉనికికి, జీవితానికి చాలా అవసరం.  అవి ఈ భూగ్రహం లో 70 శాతం ప్రాంతాన్ని ఆక్రమించి, మానవాళికి ఆహారం, శక్తి, నీటిని అందిస్తాయి.   తద్వారా జీవనోపాధి, వాతావరణ మార్పు, వాణిజ్యం, భద్రత వంటి అభివృద్ధి చెందుతున్న సంక్లిష్టమైన, పరస్పరం అనుసంధానమైన అభివృద్ధి సమస్యలకు అవి భారీ పరిష్కారాలను అందిస్తున్నాయి.  వాతావరణ మార్పులను తగ్గించడంలో, దాని ప్రభావాలను మెరుగుపరచడంలో మహాసముద్రాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.  తీరప్రాంత రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు, భద్రత, జీవనోపాధికి హిందూ మహాసముద్రం చాలా ముఖ్యమైనది.

 

భారతదేశం 9 సముద్ర తీర రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలలో 8,118 కి.మీ. మేర తీరప్రాంతాన్ని కలిగి ఉంది.  2.8 మిలియన్ల తీరప్రాంత మత్స్యకారులకు జీవనోపాధిని అందిస్తోంది.  మొత్తం ప్రపంచం లోని చేపల ఉత్పత్తిలో 8 శాతం వాటాను కలిగి ఉన్న భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా నిలిచింది.  దేశం మొత్తం మీద చేపల ఉత్పత్తి 162.48 లక్షల టన్నులు కాగా ఇందులో 121.21 లక్షల టన్నులు లోతట్టు ప్రాంతాల నుండి, 41.27 లక్షల టన్నులు సముద్రాల నుండి ఉత్పత్తి అవుతున్నాయి.  మత్స్య ఎగుమతుల విలువ 57,586.48 కోట్ల భారతీయ రూపాయలకు చేరింది.  ఈ రంగం జి.వి.ఎ. లో స్థిరమైన వృద్ధి రేటును చూపుతోంది.  వ్యవసాయ జి.డి.పి. లో 6.72 శాతం మేర వాటాను కలిగి ఉంది.  కాగా వ్యవసాయ ఎగుమతుల్లో 17 శాతం వాటాను కలిగి ఉంది.

 

 

*****(Release ID: 1900539) Visitor Counter : 134