మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సైబర్ ముప్పు నుంచి కాపాడే సమర్థవంతమైన పరిష్కారాలు అందించే జాతీయ స్థాయి హాకథాన్ ‘కవచ్ -2023’ ని ఉమ్మడిగా ఆవిష్కరించిన ఏఐసీటీఈ, బీ పీ ఆర్ డి
Posted On:
16 FEB 2023 4:17PM by PIB Hyderabad
భారతదేశ సైబర్ సంసిద్ధతను మరింత ముందుకు తీసుకువెళుతూ సైబర్ ముప్పు నుంచి కాపాడే సమర్థవంతమైన పరిష్కారాలు అందించే జాతీయ స్థాయి హాకథాన్ ‘కవచ్ -2023’ ఈరోజు ఆవిష్కృతమైంది. 21 వ శతాబ్దపు సైబర్ భద్రతను, సైబర్ నేరాల సవాళ్లను ఎదుర్కోవటానికి వీలైన కొత్త ఆలోచనలను, నవకల్పనలను గుర్తించటం దీని లక్ష్యం.
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఛైర్మన్ డాక్టర్ టీజీ సీతారామ్ మీడియాతో మాట్లాడుతూ, సైబర్ ముప్పు నుంచి కాపాడే సమర్థవంతమైన పరిష్కారాలు అందించే విశిష్టమైన జాతీయ స్థాయి హాకథాన్ గా ‘కవచ్ -2023’ ని అభివర్ణించారు. దీన్ని ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖలోని నవకల్పనల విభాగం, ఏఐసీటీఈ, హోమ్ మంత్రిత్వ శాఖలోని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (బీపీఆర్డీ), ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి, ఎంహెచ్ఎ) ఉమ్మడిగా నిర్వహించాయన్నారు. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలకు, సామాన్య పౌరులకు ఎదురయ్యే 21 వ శతాబ్దపు సైబర్ సవాళ్ళను దీటుగా ఎదుర్కోవటానికి తగిన నవకల్పనల ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలు లభిస్తాయన్నారు.
బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ డైరెక్టర్ జనరల్ శ్రీ బాలాజీ శ్రీవాస్తవ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 36 గంటల పాటు సాగే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు చెందిన యువత, రిజిస్టర్ చేసుకున్న అంకుర సంస్థలు పాల్గొని సైబర్ భద్రతకు. సైబర్ నేరాల అదుపుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిష్కార మార్గాలను కనుక్కోవటానికి వాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, నవకల్పనాత్మక నైపుణ్యాన్ని వినియోగిస్తాయి. సమర్థవంతమైన సైబర్ పర్యవేక్షణతో సైబర్ నేరాలను అరికడుతుంది.
ఏఐసీటీఈ వైస్ ఛైర్మన్ శ్రీ అభయ జేరే మాట్లాడుతూ, కవచ్-2023 ని రెండు దశలలో నిర్వహిస్తామన్నారు. మొదటిదశలో సమస్యలను వర్గీకరిస్తారు. నకిలీ వార్తలు/సోషల్ మీడియా, డార్క్ వెబ్, మహిళల భద్రత, ఫిషింగ్ కనిపెట్టటం, వీడియో అనలిటిక్స్/ సీసీటీవీ, అసభ్య వీడియోల గుర్తింపు, స్పామ్ అప్రమత్తత, మాల్వేర్ అనాలిసిస్/ డిజిటల్ ఫోరెన్సిక్స్ లాంటివి జనం ముందుంచుతామన్నారు. పాల్గొనటానికి ఆసక్తి చూపే వారు కృత్రిమ మేధ/ యంత్ర అధ్యయనం, అగ్మెంటెడ్ రియాలిటీ / వర్చువల్ రియాలిటీ వంటి అత్యాధునిక సాంకేతిక మార్గాల ద్వారా పరిష్కారాలు కనుక్కోవాల్సి ఉంటుంది. వాళ్ళ కాన్సెప్ట్స్ ను కవచ్-2023 పోర్టల్ లో ఉంచాలని సూచించారు.
హాకథాన్ ప్రారంభం సందర్భంగా ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి, ఎంహెచ్ఎ) సీఈవో శ్రీ రాజేశ్ కుమార్ మాట్లాడుతూ, డిజిటల్ నేరాల సమయంలో హాకథాన్ ప్రాధాన్యాన్ని వివరించారు. కవచ్-2023 గ్రాండ్ ఫినాలే 36 గంటల మెగా ఈవెంట్ గా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల నుంచి ఎంపిక చేసిన యువతతోబాటు అంకుర సంస్థలు పాల్గొని తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, నవకల్పనాత్మక నైపుణ్యాలతో సమస్యలకు పరిష్కార మార్గాలు కనుక్కుంటాయని, విజేత జట్టుకు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తామని చెప్పారు.
రక్షమంత్రిత్వశాఖ డైరెక్టర్ శ్రీమతి రేఖా లోధాని మాట్లాడుతూ, ఇందులో పాల్గొన్నవారు సమర్పించిన కాన్సెప్ట్ లను సంబంధిత అంశాలలో నిపుణులైనవారు పరిశీలిస్తారు. గ్రాండ్ ఫినాలే లో అత్యంత నవకల్పనాత్మకంగా ఉన్నట్టు ఎంపిక చేసిన అంశానికి సంబంధించిన జట్టు తాము చూపిన పరిష్కార మార్గాన్ని వివరించి అది సాంకేతికంగా ఎలా అమలు చేయటానికి సాధ్యమవుతుందో ఆచారణాత్మకంగా చూపించాల్సి ఉంటుందన్నారు. ఉత్తమ ఆలోచన సమర్పించిన జట్టును జ్యూరీ సభ్యులు విజేతగా ప్రకటిస్తారు.
****
(Release ID: 1899998)
Visitor Counter : 205