విద్యుత్తు మంత్రిత్వ శాఖ

పెరుగుతున్న భూతాపం, వాతావరణంలో వస్తున్న మార్పులపై జీ-20 సభ్య దేశాల ఉమ్మడి కృషి అవసరం.. కేంద్ర మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్


బెంగళూరులో ప్రారంభమైన ఇంధన పరివర్తనపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశం

కర్బన సేకరణ, వినియోగం,నిల్వ (సీసీయూఎస్) అంశంపై విడిగా చర్చించిన సమావేశం

Posted On: 05 FEB 2023 4:47PM by PIB Hyderabad

పెరుగుతున్న భూతాపం, వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కోడానికి జీ-20 సభ్య దేశాలు కలిసి కృషి చేయడానికి ముందుకు రావాలని కేంద్ర ఇంధన, నూతన పునరుత్పాదక శాఖ మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్ పిలుపు ఇచ్చారు. బెంగళూరులో ఈరోజు  ప్రారంభమైన ఇంధన పరివర్తనపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశంలో మంత్రి ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు.దేశ దేశ స్థూల ఉత్పత్తిలో (జీడీపీ) కర్బన ఉద్గారాల స్థాయిని  2005 నాటి స్థాయితో పోల్చి చూస్తే 2030 నాటికీ 45 శాతానికి తగ్గించాలని నిర్ణయించిన భారతదేశం, లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని మంత్రి వివరించారు. 2030 శిలాజేతర ఇంధన ఆధారిత ఇంధన వనరుల నుంచి 50 శాతం విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చూసేందుకు దేశంలో చర్యలు అమలు జరుగుతున్నాయన్నారు. వాతావరణ మార్పుల పనితీరు సూచికలో భారతదేశం ప్రపంచంలో మొదటి 5 దేశాల జాబితాలో ఉందని శ్రీ సింగ్ వెల్లడించారు. దేశంలో తలసరి గ్రీన్ హౌస్ వాయువు విడుదల తక్కువగా ఉందన్నారు. ప్రపంచ సగటు 6.3 టిసిఓ2తో పోల్చి చూస్తే 2020లో దేశంలో తలసరి గ్రీన్ హౌస్ వాయువు విడుదల తక్కువగా ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఇంధన పొదుపు పథకాల వల్ల దేశంలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల 267.9 మిలియన్ టన్నుల వరకు తగ్గిందని శ్రీ సింగ్ అన్నారు. దీనివల్ల $ 18.5 బిలియన్ డాలర్ల వరకు వ్యయం తగ్గుతుందని అన్నారు.

సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఇంధన రంగంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇంధన భద్రత లక్ష్యం సాధించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామని తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు  ఇంధన పరివర్తనపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశం సహకరిస్తుందని మంత్రి అన్నారు.

సమావేశంలో ప్రసంగించిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి పరిశుద్ధ ఇంధనాన్ని అందించేందుకు ప్రపంచ దేశాలు కలిసి కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. ' పర్యావరణ దోపిడీకి కాకుండా పర్యావరణ పరిరక్షణ,పర్యావరణహిత జీవన శైలికి భారతదేశం ప్రాధాన్యత ఇస్తోంది. వనరుల వినియోగం తగ్గించడం, పునర్వినియోగం, రీ సైకిల్ విధానాలు భారతీయ జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్నాయి.దేశం సంస్కృతి, జీవన విధానంలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ భాగంగా ఉంది' అని శ్రీ జోషి వివరించారు.

ఈ సందర్భంగా శ్రీ జోషి గ్లాస్గో లో జరిగిన కాప్ 26 సమావేశంలో  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను ప్రస్తావించారు. అనవసరంగా కాకుండా అవసరాల మేరకు మాత్రమే వనరులను ఉపయోగిస్తూ పర్యావరణ పరిరస్ఖన కోసం భారతదేశం పర్యావరణహిత జీవన విధానం కోసం ప్రజల సహకారంతో కృషి చేస్తుందని శ్రీ మోడీ చేసిన ప్రకటనను శ్రీ జోషి గుర్తు చేశారు.

 

 జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారతదేశం చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి ఇటిడబ్ల్యుజి సమావేశం సాంకేతిక అంతరాలను పరిష్కరించడం ద్వారా శక్తి పరివర్తన వంటి ఆరు ప్రధాన ప్రాధాన్యత రంగాలపై దృష్టి పెడుతుంది. ఇంధన సరఫరా కోసం తక్కువ ఖర్చుతో నిధులు సమకూర్చడం, ఇంధన భద్రత, విభిన్న సరఫరా వ్యవస్థలు, శక్తి సామర్థ్యం, పారిశ్రామిక రంగం ద్వారా తక్కువ పరిమాణంలో కార్బన ఉద్గారాల విడుదల, బాధ్యతాయుతమైన వినియోగం, భవిష్యత్తు కోసం ఇంధన వనరులు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన సమ్మిళిత ఇంధన శక్తి సరఫరా అంశాలపై సమావేశం దృష్టి సారిస్తుంది.  'ఒక భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే ఇతివృత్తం ఆధారంగా సదస్సు జరుగుతుంది.

బ్రెజిల్ విదేశీ సంబంధాల మంత్రిత్వ శాఖ పునరుత్పాదక ఇంధన విభాగాధిపతి రెనాటో డొమిత్ గోడిన్హో, కార్యదర్శి (శక్తి) శ్రీ అలోక్ కుమార్, భారతదేశానికి చెందిన జీ-20 సౌస్ షెర్పా శ్రీ అభయ్ ఠాకూర్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ వి.కె.సరస్వత్ సమావేశంలో ప్రసంగించారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ), పలు అంతర్జాతీయ సంస్థలతో పాటు జీ20 దేశాలు, తొమ్మిది ప్రత్యేక ఆహ్వానిత దేశాలు సహా 150 మందికి పైగా  ప్రతినిధులు  పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా ' కర్బన సేకరణ, వినియోగం,నిల్వ (సీసీయూఎస్); అనే  అంశంపై విడిగా అంతర్జాతీయ సదస్సు   నిర్వహించారు. శూన్య విడుదల  లక్ష్యాలను సాధించడానికి కర్బన సేకరణ, వినియోగం,నిల్వ అంశం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కీలకమైన అంశం సదస్సులో చర్చకు వచ్చింది.

***

 



(Release ID: 1896511) Visitor Counter : 216