రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

క్లాసికల్ రాగాస్ ఆధారంగా రూపకల్పన చేసిన భారతీయ ట్యూన్స్ 'బీటింగ్ ది రిట్రీట్' 2023 వేడుకలో ప్లే కానున్నాయి


ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేందుకు 3,500 స్వదేశీ డ్రోన్‌లతో కూడిన భారతదేశపు అతిపెద్ద డ్రోన్ షో

మొదటిగా 3-డీ అనామోర్ఫిక్ ప్రొజెక్షన్ నిర్వహణ

Posted On: 28 JAN 2023 3:20PM by PIB Hyderabad

న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక విజయ్ చౌక్‌లో సాయుధ దళాల ప్రెసిడెంట్ మరియు సుప్రీం కమాండర్ శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జనవరి 29, 2023న జరిగే 'బీటింగ్ ది రిట్రీట్' వేడుకకు ఇండియన్ క్లాసికల్ రాగాస్ ఆధారంగా రూపొందిన భారతీయ ట్యూన్‌లు అలరించనున్నాయి.  ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు స్టేట్ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సిఏపిఎఫ్‌)కి చెందిన మ్యూజిక్ బ్యాండ్‌లు 29 ఆకర్షణీయమైన మరియు ఫుట్-ట్యాపింగ్ ఇండియన్ ట్యూన్‌లను ప్లే చేస్తాయి.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యే ఈ వేడుకలో 3,500 స్వదేశీ డ్రోన్‌లతో కూడిన దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో కూడా జరగనుంది. ఈ అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన రైసినా కొండలపై సాయంత్రం ఆకాశాన్ని మరింత దేదీప్యమానం చేయనుంది. ఇది స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్ యొక్క విజయాన్ని, దేశ యువత యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని కళ్లకు కడుతుంది. మరియు భవిష్యత్ ఆలోచనలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎం/ఎస్ బోట్‌ల్యాబ్స్ డైనమిక్స్‌ నిర్వహిస్తుంది.

మొదటిసారిగా నార్త్ మరియు సౌత్ బ్లాక్  ముఖభాగంలో బీటింగ్ రిట్రీట్ వేడుక 2023 సందర్భంగా 3-డి అనామోర్ఫిక్ ప్రొజెక్షన్ నిర్వహించబడుతుంది.

'అగ్నివీర్' ట్యూన్‌తో  మాస్ బ్యాండ్  వేడుక ప్రారంభమవుతుంది. ఆపై పైప్స్ మరియు డ్రమ్స్ బ్యాండ్‌లు 'అల్మోరా', 'కేదార్ నాథ్, 'సంగం దుర్', 'క్వీన్ ఆఫ్ సత్పురా', 'భాగీరథి', 'కొంకణ్ సుందరి' వంటి మనోహరమైన ట్యూన్‌లు ఆలపిస్తాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ 'అప్రజే అర్జున్', 'చర్ఖా', 'వాయు శక్తి', 'స్వదేశీ' వాయించగా ఇండియన్ నేవీ మనోహరమైన 'ఏక్లా చోలో రే', 'హమ్ తైయార్ హై', 'జై భారతి' వాయించనున్నారు.

ఇండియన్ ఆర్మీ బ్యాండ్ 'శంఖనాద్', 'షేర్-ఎ-జవాన్', 'భూపాల్', 'అగ్రణీ భారత్', 'యంగ్ ఇండియా', 'కదమ్ కదమ్ బాధయే జా', 'డ్రమ్మర్స్ కాల్' మరియు 'ఏ మేరే వతన్ కే'లను వాయించనుంది.

'సారే జహాన్ సే అచా' అనే ఎప్పటికీ జనాదరణ పొందిన ట్యూన్‌తో ఈవెంట్ ముగింపునకు వస్తుంది.

వేడుకకు ప్రధాన కండక్టర్ ఫ్లైట్ లెఫ్టినెంట్ లీమాపోక్పం రూపచంద్ర సింగ్ వ్యవహరిస్తారు. ఆర్మీ బ్యాండ్‌కు సబ్ మేజ్ డిగ్గర్ సింగ్ నాయకత్వం వహిస్తుండగా.. నావల్ మరియు ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ కమాండర్లుగా ఎం ఆంథోని రాజ్ మరియు వారెంట్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఉంటారు. రాష్ట్ర పోలీసు మరియు సిఏపిఎఫ్ బ్యాండ్‌ల కండక్టర్‌గా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ సింగ్ ఉంటారు.

నాయబ్ సుబేదార్ సంతోష్ కుమార్ పాండే నేతృత్వంలో బగ్లర్స్ ప్రదర్శనలు ఇవ్వనుండగా..సుబేదార్ మేజర్ బస్వరాజ్ వాగ్గే సూచనల మేరకు పైపులు, డ్రమ్స్ బ్యాండ్ వాయించనున్నారు.

ప్రతి సంవత్సరం జనవరి 29న విజయ్ చౌక్‌లో జరిగే ‘బీటింగ్ ది రిట్రీట్’ వేడుక నాలుగు రోజుల పాటు జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపును సూచిస్తుంది. రంగులు మరియు ప్రమాణాలను పరేడ్ చేసినప్పుడు ఇది జాతీయ గర్వించదగిన సంఘటనగా ఉద్భవించింది.

ఈ వేడుకను 1950ల ప్రారంభంలో భారత సైన్యానికి చెందిన మేజర్ రాబర్ట్స్ స్వదేశీయంగా భారీ బ్యాండ్‌ల  విశిష్ట వేడుకగా అభివృద్ధి చేశారు. ఇది శతాబ్దాల నాటి సైనిక సంప్రదాయాన్ని సూచిస్తుంది. దళాలు సూర్యాస్తమయం సమయంలో పోరాటాన్ని నిలిపివేసినప్పుడు  ఆయుధాలను మూసివేసి శిబిరానికి తిరిగి వచ్చిన సందర్భాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుంది. ఈ వేడుక గడిచిన కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను పునఃసృష్టిస్తుంది.


 

******



(Release ID: 1894495) Visitor Counter : 180