ప్రధాన మంత్రి కార్యాలయం

‘ఎన్‌సీసీ.. ఎన్‌ఎస్‌ఎస్’ విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం


“జైహింద్‌... ఇది అందరికీ ఉత్తేజమిచ్చే తారకమంత్రం”;

“యువతరంతో సంభాషణ నాకెప్పుడూ ప్రత్యేకమే”;

“జాతీయ లక్ష్యాలు...సమస్యలతో యువత సంధానకర్తలు ఎన్‌సీసీ... ఎన్‌ఎస్‌ఎస్”;

“వికసిత భారతంలో ప్రధాన లబ్ధిదారులు మీరే..
దాని నిర్మాణం మీమీదగల గురుతర బాధ్యత”;

“భారతదేశం సాధించిన విజయాలలో ప్రపంచం తన కొత్త భవిష్యత్తును చూస్తోంది”;

“మీ గమ్యాలు దేశ లక్ష్యాలతో ముడిపడినప్పుడు మీ విజయాల పరిధి విస్తరిస్తుంది.. ప్రపంచం మీ గెలుపును భారతదేశ విజయంగా చూస్తుంది”;

“దేశంలోని యువత అదృశ్య రంగాలను... అవకాశాలను
అందుకోవాలి... అనూహ్య పరిష్కారాలను అన్వేషించాలి”;

“మీరంతా యువతరం.. మీ భవిష్యత్తును నిర్మించుకునే సమయమిది.. కొత్త ఆలోచనలు.. ప్రమాణాల సృష్టికర్తలేగాక నవ భారత మార్గదర్శకులూ మీరే”

Posted On: 25 JAN 2023 5:46PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతీయ విద్యార్థి సైనిక దళం (ఎన్‌సీసీ), జాతీయ స్వచ్ఛంద సేవ (ఎన్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వేషధారణలో అనేకమంది చిన్నారులు ప్రధానమంత్రి నివాసానికి రావడం ఇదే తొలిసారి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. “జైహింద్... అన్నది అందరికీ ఉత్తేజమిచ్చే తారకమంత్రం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. కొన్ని వారాలుగా దేశంలోని యువతరంతో తాను ముచ్చటించడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. వీర సాహెబ్‌ జాదాల ధైర్యసాహసాలకు నివాళిగా ‘వీర బాలల దినోత్సవం’ ఒక నెల కిందటే నిర్వహించుకున్నామని ప్రధాని గుర్తుచేశారు. అలాగే కర్ణాటకలో జాతీయ యువజనోత్సవం, అగ్నివీర్‌ల తొలిబృందంతో ఇష్టాగోష్ఠి, ఉత్తరప్రదేశ్‌లోని క్రీడా మహాకుంభ్‌లో యువ క్రీడాకారులు, పార్లమెంటులో-తన నివాసంలో బాలల సందర్శన, జాతీయ బాల పురస్కార గ్రహీతలతో సంభాషణ తదితరాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. ఇవేకాకుండా జ‌న‌వ‌రి 27న విద్యార్థుల‌తో ‘పరీక్షపై చర్చ’ కార్యక్రమంలో తాను పాల్గొనబోతున్నానని ఆయన పేర్కొన్నారు.

   యువతరంతో సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వడానికిగల రెండు ప్రధాన కారణాలను ఆయన వివరించారు. మొదటిది- యువతరంతో మమేకమైనపుడు వారిలోని శక్తి, తాజాదనం, కొత్తదనం, అభిరుచుల ఫలితంగా అన్నిరకాల సానుకూలతలు తనను ఆవహించి రాత్రింబవళ్లు శ్రమించడానికి ప్రేరణనిస్తాయని చెప్పారు. రెండోది- “ఈ ‘అమృత కాలం’లో ఆకాంక్షలకు, స్వప్నాలకూ ప్రతినిధులు మీరే.. అంతేకాకుండా వికసిత భారతంలో ప్రధాన లబ్ధిదారులు మీరే.. దాని నిర్మాణం మీమీదగల గురుతర బాధ్యత” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రజా జీవితంలోని వివిధ కోణాల్లో యువత పాత్ర పెరుగుతుండటం ప్రోత్సాహకరమని ఆయన అన్నారు. పరాక్రమ దినోత్సవం, స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు వంటి కార్యక్రమాల్లో యువత భారీ ఎత్తున పాల్గొనడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇది యువతకు దేశంపైగల అంకితభావానికి, వారి స్వప్నాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు.

   రోనా మహమ్మారి సమయంలో ‘ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్’ కార్యకర్తలు పోషించిన పాత్రను ప్రధానమంత్రి ప్రశంసించారు. అటువంటి వ్యవస్థలను ప్రోత్సహించడంలో ప్రభుత్వ కృషిని ప్రస్తావించారు. దేశ సరిహద్దులో, తీర ప్రాంతాల్లో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేలా యువతను సమాయత్తం చేసే దిశగా ప్రభుత్వం చేపట్టిన సన్నాహాలను వివరించారు. ఈ మేరకు దేశంలోని అనేక జిల్లాల్లో సైన్యం, నావికా-వైమానిక దళాల సాయంతో చేపట్టిన కార్యక్రమాల ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కసరత్తు ద్వారా యువత భవిష్యత్‌ పరిస్థితులకు తగినట్లు సంసిద్దులు కావడంతోపాటు అత్యవసర సమయాల్లో తొలి ప్రతిస్పందన దళంగా వ్యవహరించగల సామర్థ్యం సంతరించుకుంటారని ఆయన పేర్కొన్నారు. దేశ సరిహద్దు సమీప గ్రామాల అభివృద్ధికి చేపట్టిన శక్తిమంతమైన సరిహద్దు కార్యక్రమాలను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. “సరిహద్దు ప్రాంతాల యువత సామర్థ్యం పెంచేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నాం. తద్వారా  విద్య, ఉపాధికి మెరుగైన అవకాశాలు సృష్టించబడిన గ్రామాలకు వలస కుటుంబాలు తిరిగి వెళ్లవచ్చు” అని ప్రధానమంత్రి చెప్పారు.

   విద్యార్థి సైనికుల విజయాలన్నింటిలోనూ వారి తల్లిదండ్రుల-కుటుంబాల సహకారం కచ్చితంగా ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా విశ్వాస్.. సబ్‌కా ప్రయాస్’ స్ఫూర్తే ఇందుకు కారణమని వివరించారు. “మీ భవిష్యత్‌ గమ్యాలు దేశ లక్ష్యాలతో ముడిపడినప్పుడు మీ విజయాల పరిధి విస్తరిస్తుంది. ప్రపంచం మీ గెలుపును భారతదేశ విజయంగా చూస్తుంది” అని ప్రధానమంత్రి అన్నారు. డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం, హోమీ జహంగీర్ భాభా, డాక్టర్ సి.వి.రామన్ వంటి శాస్త్రవేత్తలతోపాటు మేజర్ ధ్యాన్‌చంద్ వంటి క్రీడా ప్రముఖులు సాధించిన ఘనతను ఈ సందర్భంగా ఉదాహరించారు. వారు అధిగమించిన మైలురాళ్లను, వారి గెలుపును ప్రపంచం మొత్తం భారతదేశం సాధించిన విజయాలుగా పరిగణిస్తుందని గుర్తుచేశారు. ఆ మేరకు “భారతదేశం సాధించిన విజయాలలో ప్రపంచం తన సరికొత్త భవిష్యత్తును చూసుకుంటోంది” అని ఆయన పేర్కొన్నారు. సమష్టి కృషి స్ఫూర్తికిగల శక్తిని నొక్కిచెబుతూ- యావత్‌ మానవాళి ప్రగతికి సోపానాలు కాగలిగినవే చారిత్ర‌క విజ‌యాలవుతాయని ప్రధానమంత్రి అన్నారు.

   యువతకు అపూర్వ అవకాశాలున్న ప్రస్తుత కాలచట్రంలో మరో ప్రత్యేకతను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా ‘అంకుర భారతం, మేక్ ఇన్ ఇండియా, స్వయం సమృద్ధ  భారతం’ ఉద్యమాలను ఉదాహరిస్తూ- మానవాళి భవిష్యత్తుపై భారత దృక్పథానికి ఇవి కొత్త ప్రేరణలని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, ఇతర భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాల్లో దేశం ముందంజలో ఉందన్నారు. క్రీడలు, సంబంధిత కార్యకలాపాల కోసం పనిచేస్తున్న బలమైన వ్యవస్థ గురించి గుర్తుచేశారు. “మీరు వీటన్నింటిలోనూ భాగస్వాములు కావాలి. అదృశ్య రంగాలను, అవకాశాలను అందుకోవాలి.  అనూహ్య పరిష్కారాలను అన్వేషించాలి” అని ఆయన ఉద్బోధించారు.

   విష్యత్‌ లక్ష్యాలు, సంకల్పాలు దేశానికి అత్యంత ప్రధానమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో వర్తమాన సంబంధిత కీలక ప్రాధాన్య రంగాలపైనా సమానంగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. దేశంలో సంభవిస్తున్న మార్పులపై యువత అవగాహన పెంచుకుంటూ, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని కోరారు. స్వచ్ఛ భారత్‌ ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ- దేశంలోని ప్రతి యువకుడు దీన్ని తమ జీవిత లక్ష్యంగా పరిగణించాలని చెప్పారు. ఈ మేరకు తమ గ్రామం, ప్రాంతం, పట్టణం, నగరాల పరిశుభ్రతకు కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా అమృత మహోత్సవాల నేపథ్యంలో స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన పుస్తకం కనీసం ఒక్కటైనా చదవాలని కోరారు. పాఠశాలలు కొందరు స్వాతంత్య్ర యోధుల జీవితాలకు సంబంధించిన కవితలు, కథలు లేదా వ్లాగింగ్ వంటి సృజనాత్మకత పోటీలవంటి కార్యకలాపాలు చేపట్టాలని సూచించారు. యువత తమతమ జిల్లాల్లో నిర్మిస్తున్న అమృత సరోవరాల సమీపాన అడవుల పెంపకం చేపట్టాలని, వాటి నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని సూచించారు. యువత కూడా ‘సుదృఢ భారతం’ ఉద్యమంలో పాల్గొంటూ తమ కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకునేలా చూడాలని కోరారు. ప్రతి ఇంట్లో యోగా సంస్కృతిని పెంపొందించాలని కూడా సూచించారు. జి20 శిఖరాగ్ర సదస్సు గురించి కూడా యువత ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండాలని చెప్పారు. ఈ కూటమికి భారత్‌ అధ్యక్ష బాధ్యత నిర్వహిస్తున్న నేపథ్యంలో సంబంధిత చర్చల్లో చురుగ్గా వ్యవహరించాలని ప్రధానమంత్రి యువతకు ఉద్బోధించారు.

   “మన వారసత్వం పట్ల గర్వం’, ‘బానిస మనస్తత్వం నుంచి విముక్తి’పై సంకల్పాన్ని ప్రస్తావిస్తూ- ఈ దిశగా యువత పోషించాల్సిన పాత్రను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఇందులో భాగంగా ప్రయాణ గమ్యాల్లో వారసత్వ ప్రదేశాలను కూడా చేర్చాల్సిందిగా సూచించారు. “మీరంతా యువతరం... మీ భవిష్యత్తును నిర్మించుకునే సమయమిది.. మీరు సరికొత్త ఆలోచనలు, ప్రమాణాల సృష్టికర్తలు మాత్రమే కాదు.. నవ భారత మార్గదర్శకులు మీరే” అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్ (రక్షణ) శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ (క్రీడలు-యువజన వ్యవహారాలు), శ్రీ అర్జున్ ముండా (గిరిజన వ్యవహారాలు)లతోపాటు సహాయ మంత్రులు శ్రీ అజయ్ భట్, శ్రీమతి రేణుకా సింగ్ సరుత, శ్రీ నిషిత్ ప్రమాణిక్ తదితరులు పాల్గొన్నారు.

 



(Release ID: 1893844) Visitor Counter : 147