రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత నౌకాదళానికి కీలక విన్యాసాలైన 'థియేటర్ లెవల్‌ ఆపరేషనల్‌ రెడీనెస్‌ ఎక్సర్‌సైజ్‌' (ట్రోపెక్స్-23) ప్రారంభం

Posted On: 24 JAN 2023 2:40PM by PIB Hyderabad

భారత నౌకాదళానికి చెందిన ప్రధాన సముద్రతల యుద్ధ విన్యాసాలు ట్రోపెక్స్ 2023 ఎడిషన్ ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో జరుగుతోంది. ఈ విన్యాసాలను ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. భారత నౌకాదళ విభాగాలు మాత్రమే కాకుండా భారత సైన్యం, భారత వైమానిక దళం, తీర రక్షక దళం కూడా ఇందులో పాల్గొంటాయి.

జనవరి 23 - మార్చి 23 తేదీల మధ్య మూడు నెలల పాటు ట్రోపెక్స్‌ నిర్వహిస్తారు. ఈ విన్యాసాల్లో భాగంగా, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు సహా భారత నౌకాదళానికి చెందిన అన్ని ఉపరితల పోరాట ఆస్తులను మోహరించారు.
ఇతర విభాగాలతో రవాణా, సమాచార సహకారం విషయంలో నౌకాదళ సంసిద్ధతను ఈ విన్యాసాలు ధృవీకరిస్తాయి, మెరుగుపరుస్తాయి. నౌకాశ్రయంలో, సముద్రంలో వివిధ దశల్లో యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తారు. ఆయుధ కాల్పులు సహా వివిధ పోరాట అంశాలను ప్రదర్శిస్తారు.

సంవత్సరాలు మారే కొద్దీ ఈ విన్యాసాల పరిధి, సంక్లిష్టత పెరుగుతూ వచ్చింది. వివిధ విపత్కర పరిస్థితులు ఒకేసారి చుట్టుముట్టినా తొణక్కుండా ఎదిరించగల నౌకాదళ పోరాట సంసిద్ధతను పరీక్షించే అవకాశాన్ని అందిస్తుంది. భారత సైన్యం, భారత వైమానిక దళం, తీర రక్షణ దళంతో పరస్పర సహకారాన్ని సులభతరం చేస్తుంది. దీంతోపాటు, సంక్లిష్ట వాతావరణంలో ఉమ్మడి కార్యకలాపాలు చేపట్టే సత్తాను మరింత బలోపేతం చేస్తుంది.

 

***


(Release ID: 1893287) Visitor Counter : 241