వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జాతీయ స్టార్టప్ అవార్డుల 2022 విజేతలకు సన్మానం తో నేడు ముగిసిన స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వారోత్సవాలు
వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శనంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాల నిర్వహణ
Posted On:
16 JAN 2023 5:38PM by PIB Hyderabad
స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వారోత్సవాలు ఈ రోజు ముగిసాయి. ముగింపు కార్యక్రమంలో భాగంగా 2022 జాతీయ స్టార్ట్ అప్ అవార్డులను ప్రదానం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య ,పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ,జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్ పాల్గొని విజేతలను సన్మానించి అవార్డులు అందజేశారు.
భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నస్టార్టప్ సంస్థలను గుర్తించి ప్రోత్సహించడానికి జాతీయ స్టార్టప్ అవార్డులు అందజేస్తున్నారు. కేవలం ఆర్థిక పరమైన ప్రయోజనాలు సాధిస్తున్న స్టార్టప్ సంస్థలు మాత్రమే కాకుండా అసాధారణమైన సామర్థ్యాలను ప్రదర్శించడం ద్వారా దేశాభివృద్ధికి సహకరిస్తున్న సంస్థలు, ఈ రంగంలో కీలక పాత్ర పోషించిన సంస్థలను అవార్డులకు ఎంపిక చేశారు.
వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా వారోత్సవాల్లో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. స్టార్టప్ సెల్, గుజరాత్ ప్రభుత్వం మరియు ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సహకారంతో ఈరోజు గాంధీనగర్‌లో స్టార్టప్ ఇండియా స్టార్టప్‌లు, ఇంక్యుబేటర్లు, పెట్టుబడిదారులు, స్టార్టప్ రంగాన్ని ప్రోత్సహిస్తున్న వారి కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలో స్టార్టప్ సంస్థలకు అందిస్తున్న ప్రోత్సాహం, మూలధన సమీకరణ, స్టార్టప్ రంగం అభివృద్ధి సాధించడానికి గల అవకాశాలు, పరిశ్రమల భాగస్వామ్యం, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్టార్టప్ రంగంపై అవగాహన కల్పించడానికి అమలు జరుగుతున్న కార్యక్రమాలు లాంటి అంశాలపై కార్యక్రమంలో సదస్సులు నిర్వహించారు. కార్యక్రమంలో 150 మందికి పైగా వ్యవస్థాపకులు, సలహాదారులు, ఇంక్యుబేటర్లు, స్టార్టప్ రంగం అభివృద్ధికి సహకరిస్తున్న వారు పాల్గొన్నారు.
బిలియన్ డాలర్ కలను సాకారం చేసుకోవడం అనే అంశంపై స్టార్టప్ ఇండియా ఒక వెబ్‌నార్‌ను నిర్వహించింది. వివిధ అంశాలపై వారం రోజుల పాటు స్టార్టప్ ఇండియా వెబినార్లు నిర్వహించింది. స్టార్టప్ రంగంలో నిధుల సమీకరణ అంశంలో లింగ సమానత్వాన్ని సాధించి అసమానతలు తొలగించే అంశంపై ప్రాధాన్యత ఇస్తూ వెబ్‌నార్‌ను నిర్వహించారు. వెబ్‌నార్‌ను https://www.youtube.com/watch?v=n37-J_DcPv0 లో చూడవచ్చు.
బెంగళూరు, రైసెన్, గురుగ్రామ్, ఇండోర్, భోపాల్, గాంధీనగర్, ఘజియాబాద్, మొహాలి, ఢిల్లీ, భువనేశ్వర్, జల్గావ్, నాగ్‌పూర్, కొట్టాయం, ఇంఫాల్, కోల్‌కతా తదితర నగరాల్లో ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ స్టార్టప్ ఇండియాకు చెందిన వివిధ కేంద్రాలు కార్యక్రమాలు నిర్వహించాయి. సామర్థ్యం పెంపుదల వర్క్‌షాప్, నిపుణుల ప్రసంగాలు , రాష్ట్ర స్థాయి పోటీలు మరియు సవాళ్లు, స్టార్టప్ పై దృష్టి , స్టార్టప్ సదస్సులు , రౌండ్ టేబుల్‌లతో సహా అనేక కార్యక్రమాలు జరిగాయి.
*****
(Release ID: 1891755)
Visitor Counter : 146