వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్వభావ మార్పులు వేగవంతం: శ్రీ పీయూష్ గోయల్
ఎఫ్‌సీఐ 59వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రకటించిన మంత్రి
అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: శ్రీ గోయల్
ఎఫ్‌సీఐ సంస్థలో ఏమాత్రం అవినీతికి సహించని విధాన అవలంభన: శ్రీ గోయల్
అక్రమ కార్యకలాపాలను గురించి అప్రమత్తం చేసే వారికి రివార్డ్ ఇచ్చే యంత్రాంగ సంస్థాగతీకరణ: శ్రీ గోయల్
కోవిడ్ మహమ్మారి సమయంలో "ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన" కింద ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార సరఫరా గొలుసు వ్యవస్థను నిర్వహించిన ఎఫ్‌సీఐ సంస్థకు శ్రీ గోయల్ ప్రశంసలు
Posted On:
14 JAN 2023 4:52PM by PIB Hyderabad
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) స్వభావ మార్పుల ప్రక్రియను వేగంగా చేపట్టాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి, వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయడం తద్వారా సంస్థ దేశంలోని ప్రజలకు, పేదలకు మరియు రైతులకు మెరుగ్గా సహాయం చేయడం కొనసాగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఇక్కడ ఎఫ్‌సీఐ సంస్థ 59వ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి ప్రారంభోపన్యాసం చేశారు. ఎఫసీఐ మరియు సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సి.డబ్ల్యు.సి) యొక్క పరివర్తనను ప్రతి వారం పర్యవేక్షించవలసిందిగా, పక్షంవారీ ప్రాతిపదికన స్థితిని అప్‌డేట్ చేయాలని ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శిని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. పరివర్తన ప్రక్రియకు సహకరించని, జాప్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీ గోయల్ అన్నారు. ఎఫ్‌సీఐలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులపై కొనసాగుతున్న దర్యాప్తు గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, ఇది సంస్థకు మేల్కొలుపు పిలుపు అని.. అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టబోమని అన్నారు. అవినీతిని ఏ మాత్రం సహించకూడదన్న సూత్రాన్ని ఎఫ్‌సీఐ అనుసరిస్తోందని వివరించారు. ఎఫ్సీఐ అధికారులు, సిబ్బంది ఏదైనా అవినీతికి పాల్పడితే తెలియజేయాలని పిలుపునిచ్చారు. అవినీతి కార్యకలాపాలను గురించి సమాచారం అందించి అప్రమత్తం చేసే యంత్రాంగాన్ని సంస్థాగతీకరించాలని శ్రీ గోయల్ కార్యదర్శిని ఆదేశించారు. కోవిడ్ మహమ్మారి విస్తరించి ఉన్నప్పటికీ, దేశంలో ఎవరూ ఆకలితో నిద్రపోలేదని ఆయన వివరించారు. "ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన" (పీఎంజీకేఏవై) కింద ఆహార ధాన్యాల సజావుగా సరఫరా అయ్యేలా కోవిడ్మహమ్మారి సమయంలో ఎఫ్‌సీఐ ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార సరఫరా గొలుసు వ్యవస్థను చేపట్టిన విధానాన్ని శ్రీ గోయల్ ప్రశంసించారు. ఆహార భద్రత, ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడం, ద్రవ్యోల్బణం నియంత్రణ తదితర అంశాల్లో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. ఈ ఏడాదికి సంబంధించిన బియ్యం సేకరణ మెరుగ్గా ఉన్నాయని, రాబోయే సీజన్లో గోధుమల సేకరణ మరింతగా మెరుగ్గా సాగాలని తాను ఎదురు చూస్తున్నానని శ్రీ గోయల్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరైన గౌరవనీయులైన కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి, మహమ్మారి సమయంలో దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ, ముఖ్యంగా సమాజంలోని బలహీన వర్గాలకు ప్రధానమంత్రి దార్శనికత పథకం పీఎంజీకేఏవై కింద తగినంత ఆహార ధాన్యాల సరఫరాను నిర్ధారించడం ద్వారా ఎఫ్‌సీఐ చేపట్టిన అద్భుతమైన పనిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డి.ఎఫ్.పి.డి కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిని నిర్మూలించడానికి, ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలను అందించే వ్యవస్థను నిర్ధారించాలని ఎఫ్‌సీఐ సంస్థ సీఎండీ శ్రీ అశోక్ కె.కె. మీనాను ఆదేశించారు.
*****
(Release ID: 1891486)
Visitor Counter : 149