ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించిన ప్రధాని


“తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి సాంస్కృతిక సంపదకు అనుసంధానం వందే భారత్”

‘అన్నింటా భారత్ మెరుగైనదని చాటుతుంది వందే భారత్ ఎక్స్ ప్రెస్’

“నవ భారత సామర్థ్యానికి, భవిష్యత్ పట్టుదలకు చిహ్నం వందే భారత్”

“అనుసంధానం చేసే మౌలిక వసతులు కేవలం రెండు ప్రదేశాలను కలపటమే కాదు, కలలను వాస్తవంతో కలుపుతూ సబ్ కా వికాస్ ను సాకారం చేస్తుంది.”

“గతి (వేగం) ఉన్నప్పుడు పురోగతి ఉంటుంది. పురోగతి ఉన్నప్పుడు సంపదకు హామీ ఉంటుంది”.

“గడిచిన 7-8 ఏళ్లలో రైల్వేలలో జరిగిన మార్పు వచ్చే 7-8 ఏళ్లలో కనబడుతుంది.”

Posted On: 15 JAN 2023 12:05PM by PIB Hyderabad

సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. భారతీయ రైల్వేలు ప్రారంభించిన ఎనిమిదవ వందే భారత్ రైలు ఇది.  రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ 700 కిలోమీటర్లు నడిచే  రైలు కూడా కావటం గమనార్హం.  ఈ రైలు తెలంగాణలో సికింద్రాబాద్ లో బయలుదేరి వరంగల్, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని   విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుతుంది.

ఈ సందర్భంగా ఏర్పాటైన సభనుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, పండుగ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకూ  దీన్నొక గొప్ప బహుమతిగా అభివర్ణించారు.  ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రజలకూ ప్రధాని  శుభాకాంక్షలు తెలియజేశారు. సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైనికులకు కూడా ప్రధాని ఘనంగా నివాళులర్పించారు. ధైర్య సాహసాలకు, వృత్తినైపుణ్యానికి భారత సైనికులు నిదర్శనమన్నారు. 

పండుగల గురించి మాట్లాడుతూ, దేశంలోని అన్నీ ప్రాంతాలనూ అనుసంధానం చేస్తూ, ప్రజలందరూ ఒకరినొకరు అర్థం చేసుకునేలా  భారతదేశంలోని అనేక ప్రాంతాలకు భారతీయ రైల్వేలు విస్తరించాయన్నారు. ఈ విధమైన కలయిక వలన ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి వెల్లడవుతుందన్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు వలన యాత్రికులతో బాటు తీర్థయాత్రికులు కూడా బాగా ప్రయోజనం పొందుతారన్నారు.  సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం కూడా బాగా తగ్గిపోతుందన్నారు.

“వందే భారత్ ఎక్స్ ప్రెస్  నవ భారత  సామర్థ్యానికి, దీక్షకు ఒక చిహ్నం” అని ప్రధాని అభివర్ణించారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ ఎంచుకున్న మార్గానికి ఇది నిదర్శనమన్నారు.  కలలను, ఆకాంక్షలను  నిజం చేసుకోవటానికి అత్యంత ఉత్సాహంగా ముందుకు సాగుతున్న భారతదేశానికి ఈ రైలు  ఒక ఉదాహరణ అన్నారు. భారతదేశం తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో తన పౌరులకు అత్యంత నాణ్యమైన సౌకర్యాలు అందించటానికి కృషి చేయటాన్ని గుర్తు చేశారు. బానిస మనస్తత్వానికి స్వస్తి పలికి ‘ఆత్మ నిర్భర్’  వైపు వేగంగా అడుగులేస్తున్నదన్నారు.   

‘వందే భారత్’ రైళ్ళ తయారీలో వేగాన్ని కూడా ప్రధాని ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఈ ఏడాది కేవలం 15 రోజుల్లో రెండో  వందే భారత్ రైలు మొదలైందని గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనుల  వేగాన్ని ప్రధాని ప్రస్తావించారు. మొత్తం ఏడు రైళ్ళను ఇప్పటిదాకా ప్రారంభించారు. ఈ వందే భారత్ రైళ్ళు భారతీయులలో గర్వాన్ని నింపుతాయన్నారు. ఇప్పటిదాకా 7 వందే భారత్ రైళ్ళు  మొత్తం 58 రౌండ్లు తిరిగి 23 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి. మొత్తం 40 లక్షల మందికి పైగా వందేభారత్ రైళ్ళలో ప్రయాణించారు. 

సబ్ కా వికాస్ లో భాగంగా రెండు కీలకమైన ప్రదేశాలను నేరుగా అనుసంధానం చేయటం దీని ప్రత్యేకతగా అభివర్ణించారు. ఈ విధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా బాగా జరుగుతోందన్నారు. ఇది కేవలం రెండు ప్రదేశాలను కలపటానికే పరిమితం కాకుండా కలలను, ఆకాంక్షలను  కూడా అనుసంధానం చేసిందన్నారు. ఇది అభివృద్ధికి  బాటలు వేస్తూ తయారీ కేంద్రాలను మార్కెట్ కు అను సంధానం చేయటంలోను, ప్రతిభావంతులను సరైన వేదికకు చేర్చటంలోనూ ఎంతగానో ఉపయోగపడింది. గతి  (వేగం) ఉన్నప్పుడే ప్రగతి ఉంటుందని చెప్పటానికి ఇదొక ఉదాహరణ. పురోగతి ఉన్నప్పుడే సంపదకు హామీ లభిస్తుందని ప్రధాని అన్నారు.

ఒకప్పుడు అనుసంధాన ఫలితాలు కొద్ది మందికి మాత్రమే పరిమితమైన నాటి రోజులను ప్రధాని గుర్తు చేసుకున్నార. అత్యధిక జనాభా డబ్బు, సమయం వృధా చేసుకోవలసిన పరిస్థితి ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు.  అందరూ వేగంగా ప్రయాణిస్తూ పురోగతి ఫలాలు అందుకోవటానికి నిదర్శనంగా అవందే భారత్  రైలును గుర్తుంచుకుంటారని ప్రధాని అభివర్ణించారు. రైల్వేలు అనగానే సమయపాలనమీద ఆరోపణలు, దారుణమైన విమర్శలు ఉండే రోజులకు కాలం చెల్లిందన్నారు. సమస్యలన్నీ  పరిష్కారం కావటంతో గడిచిన ఎనిమిదేళ్ళ కాలంలో భారతీయ రైల్వేలు పూర్తిగా మారిపోవటాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 

ఈరోజు భారతీయ రైల్వేలలో ప్రయాణం అనేది ఒక అద్భుతమైన అనుభూతిని మిగుల్చుతోందని, చాలా రైల్వే స్టేషన్లు  ఆధునిక భారతదేశాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. గడిచి ఏడెనిమిదేళ్ళలో జరిగిన పని వలన వచ్చే ఏడెనిమిదేళ్లలో భారత రైల్వేల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.  కోచ్ ల రూపురేఖలు మార్చటం, పర్యాటకాన్ని ప్రోత్సహించటానికి హెరిటేజ్ రైళ్ళను ప్రారంభించటం, వ్యవసాయ ఉత్పత్తులను సుదూర ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు తరలించటానికి కిసాన్ రైల్,  2 డజన్లకు పైగా నగరాలకు మెట్రో రైలు సౌకర్యం లాంటివి ఎంత వేగం పుంజుకున్నాయో ప్రధాని వరుసగా చెప్పుకొచ్చారు. 

తెలంగాణలో గడిచిన  ఎనిమిదేళ్లలో రైల్వేల పురోగతి అద్భుతంగా సాగిందని ప్రధాని విస్పష్టంగా చెప్పారు.  2014 కు ముందు తెలంగాణకు రైల్వే బడ్జెట్ రూ. 250 కోట్ల లోపే ఉండేదని, నేడు అది రూ. 3,000 కోట్లకు పెరగటాన్ని ఆయన గుర్తు చేశారు.  తెలంగాణలో మెదక్ లాంటి అనేక ప్రదేశాలు ఇప్పుడు రైలు మార్గంతో అనుసంధానం కావటాన్ని గుర్తు చేశారు.  2014 కు ముందు ఎనిమిదేళ్ళ కాలంలో తెలంగాణ ప్రాంతంలో కొత్తగా వేసిన రైలు మార్గం 125 కిలోమీటర్ల లోపే ఉండగా గడిచిన 8 ఏళ్లలో 325 కిలోమీటర్ల రైలుమార్గం నిర్మించటాన్ని గుర్తు చేస్తూ పోల్చి చెప్పారు. తెలంగాణలో   ట్రాక్ విస్తరణ పనులు 250 కిలోమీటర్లకు పైగా జరిగిందని విద్యుదీకరణ పనులు  మూడు రేట్లు పెరిగాయని అన్నారు.   త్వరలోనే తెలంగాణలోని అన్ని  బ్రాడ్ గేజ్  మార్గాల విద్యుదీకరణ పూర్తి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

వందే భారత్ రైలు ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ తో కూడా అనుసంధానమవుతున్న విషయం గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రైలు నెట్ వర్క్ ను బలోపేతం చేయటానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో సుఖమయ జీవనానికి, సుఖమయ వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేస్తూ, గత కొద్ది కాలంలోనే 350 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని, 800 కిలోమీటర్ల మేర ట్రాక్ గేజ్ మార్పిడి పనులను పూర్తి చేయటాన్ని ప్రస్తావించారు.  2014 కు ముందు కాలంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏటా 60 కిలోమీటర్ల చొప్పున మాత్రమే విద్యుదీకరణ జరగగా  ఇప్పుడు ఆ  వేగం ఏడాదికి 220 కిలోమీటర్లకు పెరగటాన్ని గుర్తు చేశారు.   

ప్రధాని తన ప్రసంగం ముగిస్తూ, “ ఈ వేగం, పురోగతి ఇదే విధంగా సాగుతాయి.” అన్నారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నడిచే వందే భారత్ రైల్లో ఉన్నవాళ్ళందరినీ ప్రధాని అభినందించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు  శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ  కిషన్ రెడ్డి , పలువురు రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.

నేపథ్యం

ఇది ఎనిమిదవ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య 700 కిలోమీటర్ల దూరం సాగే ఈ మార్గంలో ప్రయాణ సమయం పన్నెండున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటలకు తగ్గింది. ఈ రైలు తెలంగాణలోని  సికింద్రాబాద్ లో బయలుదేరి వరంగల్, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతూ విశాఖపట్నం చేరుకుంటుంది. ఇందులో అత్యాధునిక ప్రయాణీకుల సౌకర్యాలుం  అందుబాటులో ఉన్నాయి. వేగంతో బాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని ఇస్తుందంటున్నారు.

ఈ రైలు ప్రారంభించటం వలన ఈ ప్రాంతంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుందని, సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఇది ఎనమిదవ వందే భారత్ రైలు. ఇంతకు ముందువాటికంటే ఇది ఆధునాతనమైంది.  తేలికగా ఉండి, ఎక్కువ వేగంతో నడుస్తుంది. కేవలం 52 సెకెన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగం పుంజుకొని గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగానికి చేరుకోగలుగుతుంది.  గతంలో తయారు చేసిన వందే భారత్ రైలు బరువు 430 టన్నులు కాగా ఈ  రైలు బరువు 392 టన్నులు. ప్రయాణీకుల కోరిక మేరకు వైఫై ప్రసారాలు కూడా అందుతాయి. ప్రతి కోచ్ లోనూ 32 అంగుళాల టీవీ తెరలుంటాయి. వీటిలో ప్రయాణీకులకు అవసరమైన సమాచారంతోబాటు ఇన్ఫోటైన్మెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇంతకు ముందు ఏడు రైళ్లలో 24 అంగుళాల తెరలు మాత్రమే ఉండేవి.   ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో పర్యావరణ హితంగా పనిచేస్తుంది. ఏసీల ఇంధన  సామర్థ్యం  15 శాతం ఎక్కువగా ఉంటుంది.  దుమ్మూ ధూళీ లేకుండా పరిశుభ్రమైన గాలి అందే ఏర్పాటు ఉంది.  ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణీకులకు మాత్రమే గతంలో  పక్కకు వాలే సీటు సౌకర్యం ఉండేది. ఇప్పుడు అన్ని సీట్లకూ విస్తరించారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో 180 డిగ్రీలు తిరిగే సీట్లు అమర్చారు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 విమానాల తరహా సౌకర్యాలున్నాయి. అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు, రైలు డీకొనే పరిస్థితిని నివారించగలిగే కవచ్ వ్యవస్థ కూడా ఏర్పాటైంది. 

*****

DS/TS


(Release ID: 1891375) Visitor Counter : 286