శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
22 భారతీయ భాషలలో సైన్స్ అందించడంపై చర్చించేందుకు జాతీయ స్థాయి మేధోమథన సమావేశాన్ని నిర్వహించిన సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్
Posted On:
13 JAN 2023 2:15PM by PIB Hyderabad
మొత్తం 22 భారతీయ భాషల్లో సైన్స్ సమాచార మార్పిడిపై కృషిపై 10 జనవరి 2023న న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్ - నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్) మేధోమథన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాన్ని హైబ్రిడ్ (మిశ్రిత) పద్ధతిలో నిర్వహించారు.
ఈ మేధోమథన సమావేశం సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ సీనియర్ శాస్త్రవేత్త శ్రీ హసన్ జావైద్ ఖాన్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమైంది. ఈ కీలకమైన సమావేశానికి హాజరైన నిపుణులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్, ఇతర సంస్థలు సైన్స్ కమ్యూనికేషన్ విషయంలో చేస్తున్న పలురకాల కృషిని ఆయన వివరించారు. ఇప్పటివరకూ స్పృశించని భాషలు, సుదూర ప్రాంతాలు, చర్చించని అంశాలలో సైన్స్ కమ్యూనికేషన్ ప్రాధాన్యతను, సైన్స్ వ్యాప్తికి సంబంధించి ప్రసార మాధ్యమాల ద్వారా సైన్స్ కమ్యూనికేషన్ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ఇందులో మనం ఇంకా ఎన్నో దూరాలకు ప్రయాణించవలసి ఉందని అన్నారు.
.ఇమేజ్
స్వాగతోపన్యాసం చేస్తున్న సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ ప్రధాన శాస్త్రవేత్త శ్రీ హసన్ జావైద్ ఖాన్
భారతీయ భాషలలో సైన్స్ కమ్యూనికేషన్ నిపుణులు ఈ మేధోమథన సమావేశంలో తమ ఆలోచనలను పంచుకున్నారు.
సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ శాస్త్రవేత్త డాక్టర్. మనీష్ మోహన్ గోరె మేధోమథన సమావేశ అజెండాను, రూపురేఖలను పరిచయం చేశారు. సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ కోసం భారతీయ భాషలలో సైన్స్ సమాచారంపై దృష్టి పెట్టిన ప్రాజెక్టు ప్రధాన ఇన్వెస్టిగేటర్ డాక్టర్ గోరె. ఆయా భాషలలో విజ్ఞాన శాస్త్రాన్ని అందించడంలో విజయాలు, సవాళ్ళు, సంభావ్య పరిష్కారాలు దాని స్థితిగతులను ఆయన చర్చించారు. భారతీయ భాషలలో తులనాత్మకంగా తక్కువ సాహిత్యం ఉన్నవాటిలో ప్రముఖ సైన్స్ సాహిత్యాన్ని అభివృద్ధి చేసేందుకు చట్రాన్ని కూడా ఆయన చర్చించారు.
ఈ మేధోమథన సమావేశానికి, మొత్తం 22 భారతీయ భాషల (అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మళయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సంథాలీ, సింథి, తమిళం, తెలుగు, ఉర్దూ) లో సైన్స్ సమాచారాన్ని అందించగల నిపుణులైన వారిని ఆహ్వానించారు. వారు ఈ భాషలలో సైన్స్ కమ్యూనికేషన్, లోకప్రియమైన సైన్స్ సాహిత్య అభివృద్ధికి ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు, ప్రణాళికలు, ప్రశంసలను అందించేందుకు ప్రణాళికలను చర్చించి, సూచించారు. ఈ 22 అధికారిక భాషలు భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరిచినవే.
ఈ సమావేశం, భారతీయ భాషలలో సైన్స్ కమ్యూనికేషన్ విశ్లేషణపై దృష్టిపెట్టిన సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ ప్రాజెక్టులో భాగం.
సైన్స్ కమ్యూనికేషన్ కోసం ప్రస్తుత చేస్తున్న కృషి స్థితిగతులు & సైన్స్ కమ్యూనికేషన్‌కు దోహదం చేయడంతో పాటు ప్రజాదరణ పొందిన సైన్స్ సాహిత్యం, భారత అధికారిక భాషలలో సైన్సను అందించడంలో సమకాలీన కీలక సవాళ్ళను చర్చించేందుకు భిన్న భాషలకు చెందిన సైన్స్ కమ్యూనికేషన్ నిపుణులను ఒకచోట సమీకరించడం సమావేశం అజెండా. సమావేశ ఫలితంగా పలు విలువైన సూచనలు అందాయి.
ఆహ్వానించిన నిపుణుల మధ్య చర్చ కోసం ఒక బహిరంగ సెషన్‌ను సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ శాస్త్రవేత్త డాక్టర్ పరమానంద బర్మన్ సంచాలకులుగా వ్యవహరించారు. సమావేశం ముగింపులో సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ శాస్త్రవేత్త డాక్టర్ మెహర్ వాన్ నిపుణులకు, సంబంధిత వ్యక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టు సిబ్బంది కుమారి నియతీ సింగ్, శ్రీ మహబ్బత్ సింగ్ కూడా ఈ మేధోమథన సమావేశంలో పాలుపంచుకున్నారు.
***
(Release ID: 1891180)
Visitor Counter : 193