ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.122.47 కోట్ల డివిడెండ్ అందజేసిన హెచ్‌ఎల్‌ఎల్
హెచ్‌ఎల్‌ఎల్ సాధించిన విజయానికి అభినందిస్తూ, మహమ్మారి సమయంలో
ఆ సంస్థ కృషిని ప్రశంసించిన డాక్టర్ మన్సుఖ్ మాండవియా
ఆర్థిక క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన అనేవి పిఎస్‌యు ల సుస్థిరతకు
కీలకమైన అంశాలు: డాక్టర్ మన్సుఖ్ మాండవియా
Posted On:
11 JAN 2023 12:35PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీ రత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ (హెచ్‌ఎల్‌ఎల్) 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు రూ.122.47 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ఈరోజు ఇక్కడ నిర్మాణ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి (ఆరోగ్య, కుటుంబ సంక్షేమం) డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమక్షంలో హెచ్‌ఎల్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బెజి జార్జ్ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యకు చెక్కును అందించారు.


2021–22 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌ఎల్‌ఎల్‌కు రూ.35,668 కోట్ల రికార్డు టర్నోవర్, పన్నుకు ముందు రూ.551.81 కోట్ల లాభం రావడం పట్ల సంతోషం వ్యక్తంచేసారు డాక్టర్ మన్సుఖ్ మాండవ్య. మహమ్మారి సమయంలో వారి మద్దతును అభినందిస్తూ, “హెచ్‌ఎల్‌ఎల్ ముఖ్యమైన పాత్ర పోషించింది. కోవిడ్-19 మహమ్మారి నిర్వహణ కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మద్దతుగా అత్యవసర వైద్య సామాగ్రి సేకరణ, పంపిణీ, మహమ్మారి నిర్వహణ కోసం అత్యవసర వైద్య వస్తువుల సేకరణ మరియు సరఫరా కోసం నోడల్ ఏజెన్సీగా, ఇది సంక్షోభం లోనూ రియల్ టైం సేవా, నిర్వహణను అందించగలిగింది" అని కేంద్ర మంత్రి అన్నారు.
పిఎస్‌యులు గొప్ప విజన్‌తో స్థాపించినప్పటికీ, వాటి పనితీరు ఎల్లప్పుడూ సంతృప్తికరంగా లేదని ఆయన పేర్కొన్నారు. పిఎస్‌యుల సుస్థిరతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, "ఆర్థిక క్రమశిక్షణ మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన పిఎస్‌యుల స్థిరత్వానికి కీలకమైన అంశాలు" అని స్పష్టం చేశారు.
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, హెచ్‌ఎల్‌ఎల్ సాధించిన విజయానికి అభినందనలు తెలిపారు. మహమ్మారి సమయంలో సంస్థ కృషిని ప్రశంసించారు. హెచ్‌ఎల్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బెజి జార్జ్, హెచ్‌ఎల్‌ఎల్ పట్ల విశ్వాసం నింపినందుకు, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, ముఖ్యంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా అందించిన సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వ కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి మద్దతుగా గర్భనిరోధక సాధనాలను ఉత్పత్తి చేయడానికి హెచ్‌ఎల్‌ఎల్ 1966 మార్చి 1 న స్థాపించారు. పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెడుతూనే హెచ్‌ఎల్‌ఎల్ ఇతర ఆరోగ్య సంరక్షణ విభాగాలైన హాస్పిటల్ ఉత్పత్తులు, హాస్పిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, మెడికల్ ఎక్విప్‌మెంట్ ప్రొక్యూర్‌మెంట్ కన్సల్టెన్సీ, డయాగ్నస్టిక్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్స్ రిటైలింగ్ మొదలైన వాటిలో విస్తరించింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, మంత్రిత్వ శాఖ, హెచ్‌ఎల్‌ఎల్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
****
(Release ID: 1890344)