కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ నాయకత్వ బాధ్యతలను చేజిక్కించుకున్న భారత్
Posted On:
03 JAN 2023 5:24PM by PIB Hyderabad
బ్యాంగ్‌కాక్‌లోని థాయ్‌లాండ్‌లో కేంద్ర కార్యాలయం కలిగిన ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ (ఎపిపియు - అప్పు) నాయకత్వ బాధ్యతలను భారతదేశం ఈ నెల నుంచి చేపట్టనుంది. ఆగస్టు - సెప్టెంబర్ 2022లో బ్యాంగ్‌కాక్‌లో నిర్వహించిన 13వ ఎపిపియు కాంగ్రెస్ సందర్భంగా విజయవంతంగా నిర్వహించిన ఎన్నికలను అనుసరించి, పోస్టల్ సర్వీసెస్ బోర్డు (సిబ్బంది) మాజీ సభ్యుడు డాక్టర్ వినయ్ ప్రకాష్ 4 సంవత్సరాల పదవీ కాలానికి యూనియన్ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 32 సభ్యదేశాల అంతర్ ప్రభుత్వ సంస్థ ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ (ఎపిపియు). ఈ ప్రాంతంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యుపియు)కు చెందిన ఏకైక నియంత్రిత సంస్థ అయిన ఎపిపియు, ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ఏజెన్సీ. సభ్య దేశాల మధ్య తపాలా సంబంధాలను విస్తరించడం, సులభతరం చేయడం, మెరుగుపరచడంతో పాటు పోస్టల్ సేవల రంగంలో సహకారాన్ని ప్రోత్సహించడం ఎపిపియు లక్ష్యం. వివిధ యుపియు ప్రాజెక్టులకు ప్రాంతీయ కేంద్రమైన ఎపిపియు - యుపియుకు చెందిన అన్ని సాంకేతిక, కార్యాచరణ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో సఫలం చేయడంలో ముందుండడమే కాక, అంతర్జాతీయ తపాలా నెట్‌వర్క్ లో ఈ ప్రాంతం ఏకీకృతమయ్యేందుకు సాధ్యమైనంత ఉత్తమ రీతిలో పని చేస్తుంది. యూనియన్ కార్యకలాపాలకు సెక్రెటరీ జనరల్ నాయకత్వం వహించడమే కాక ఈ ప్రాంతంలో అంతర్ ప్రభుత్వ తపాలా శిక్షణ సంస్థ అయిన ఆసియన్ పసిఫిక్ పోస్టల్ కాలేజ్ (ఎపిపిసి) డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.
యూనియన్ పట్ల తన విజన్ గురించి మాట్లాడుతూ, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తపాలా నెట్‌వర్క్ ద్వారా వ్యాపార వృద్ధిని మెరుగుపరిచేందుకు, యూనియన్ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, ఎపిపిసి అందిస్తున్న శిక్షణా కోర్సులను సంస్కరించేందుకు పోస్టల్ ప్లేయర్లతో ప్రాంతీయ సహకారాన్ని మెరుగుపరచడం నా లక్ష్యమని, డాక్టర్ విపి సింగ్ పేర్కొన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతం అంతర్జాతీయ తపాలా పరిమాణంలో సగ భాగాన్ని కలిగి ఉండటమే కాక ప్రపంచ తపాలా మానవ వనరులలో మూడింట ఒక వంతును కలిగి ఉంది.
తపాలా రంగంలో ఒక అంతర్జాతీయ సంస్థకు ఒక భారతీయుడు నాయకత్వం వహించడం ఇది తొలిసారి. ఈ రంగానికి కీలకమైన తరుణంలో, శాఖకు చెందిన తమ అధికారి యూనియన్ కార్యకలాపాలకు నాయకత్వం వహించడం విశేషమని, ప్రత్యేకించి భారతదేశం జి20 అధ్యక్ష పదవి ఈ సంవత్సరం ప్రారంభమవనున్న తరుణంలో ఇది జరగడం హర్షణీయమని పోస్టల్ శాఖ కార్యదర్శి శ్రీ వినీత్ పాండే అన్నారు. ఎపిపియుకు పూర్తి సహకారాన్ని అందించడాన్ని కొనసాగిస్తూనే, ఎపిపియు సభ్యత్వ సామూహిక దృక్పథాన్ని సమర్ధవంతంగా అమలు చేయడం కోసం భారతదేశం దోహదం చేస్తుందని, ఆయన పేర్కొన్నారు.
****
(Release ID: 1888676)
Visitor Counter : 233