రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రూ.2,444 కోట్ల విలువైన 7 జాతీయ రహదారుల ప్రాజెక్టులు, మధ్యప్రదేశ్‌లో రూ.1600 కోట్లతో 2.28 కి.మీ. పొడవుతో నిర్మించిన మొట్టమొదటి 6 వరుసల జంట సొరంగాలను రెవాలో ప్రారంభించిన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
10 DEC 2022 6:34PM by PIB Hyderabad
204 కి.మీ. పొడవుతో, రూ.2,444 కోట్ల వ్యయంతో నిర్మించిన 7 జాతీయ రహదారుల ప్రాజెక్టులను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మధ్యప్రదేశ్‌లోని రెవాలో ఇవాళ ప్రారంభించారు. ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర సీనియర్ మంత్రి శ్రీ గోపాల్ భార్గవ, రెవా ఎంపీ శ్రీ జనార్దన్ మిశ్రా, సిద్ధి ఎంపీ శ్రీమతి రీతి పాఠక్, ఎంపీ గణేష్ సింగ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రహదారి ప్రాజెక్టుల ప్రారంభోత్స సభలో శ్రీ గడ్కరీ మాట్లాడారు. చుర్హత్ సొరంగం, బైపాస్ నిర్మాణంతో రెవా నుంచి సిద్ధి మధ్య దూరం 7 కి.మీ. తగ్గిందని అన్నారు. రెండున్నర గంటల ప్రయాణం 45 నిమిషాలకు తగ్గిందని చెప్పారు. మోహనియా ఘాట్ దాటేందుకు 45 నిమిషాలకు బదులు ఇప్పుడు 4 నిమిషాలు మాత్రమే పడుతుందని అన్నారు.
రెవా-సిద్ధి సెక్షన్‌లో వాహనాల రాకపోకలకు సొరంగం నిర్మించడం వల్ల తెల్లపులులు, ఇతర వన్యప్రాణులు, మొత్తం అటవీ పర్యావరణ వ్యవస్థకు రక్షణ ఏర్పడిందన్నారు. దేవ్‌తలాబ్-నైగర్హి రహదారి నిర్మాణంతో ప్రయాగ్‌రాజ్, వారణాసితో రెవా జిల్లా అనుసంధానం మరింత మెరుగ్గా మారింది.
సత్నా-బేలా నాలుగు వరుసల రహదారి నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలోని బొగ్గు, సిమెంట్, వజ్రాల పరిశ్రమలకు రవాణా సులభతరం అవుతుందని శ్రీ గడ్కరీ చెప్పారు. ఈ మార్గం నిర్మాణం వల్ల సత్నా నుంచి రేవాకు 40 నిమిషాల్లో చేరుకోవచ్చని వెల్లడించారు. ఝాన్సీ, ఓర్చా, ఖజురహో, పన్నా, సత్నా వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను సులభంగా చేరుకోవచ్చు. రైతులు, ఇతర చిన్న వ్యాపారవేత్తలు మార్కెట్‌ను మరింత సులభంగా చేరుకోవచ్చని, వాళ్ల సమయం, ఇంధనం ఆదా అవుతాయని కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా, రెవా-సిద్ధి రహదారిని నాలుగు వరుసలుగా మార్చాలన్న డిమాండ్‌కు ఆమోదం తెలుపుతూ, రహదారి విస్తరణకు శ్రీ గడ్కరీ ఆమోదం తెలిపారు. 19 కి.మీ. పొడవైన 2 వరుసల రెవా బైపాస్‌ను 4 వరుసలుగా మారుస్తామని కూడా ప్రకటించారు. బైపాస్ విస్తరణ వల్ల సత్నా నుంచి చోర్హాట్ మీదుగా ప్రయాగ్‌రాజ్-వారణాసి అనుసంధానం మెరుగుపడుతుందని చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో రూ.1600 కోట్ల వ్యయంతో 2.28 కి.మీ. పొడవుతో నిర్మించిన మొట్టమొదటి 6 వరుసల జంట సొరంగాలను, 13 కి.మీ. పొడవైన 4 వరుసల బైపాస్‌ను కూడా శ్రీ నితిన్ గడ్కరీ ఈరోజు ప్రారంభించారు.
ఎన్‌ఏటీఎం విధానంలో నిర్మించిన ఈ జంట సొరంగాలు 300 మీటర్లలో ఒకదానితో మరొకటి కలుస్తుంటాయి. దీని కారణంగా ట్రాఫిక్‌కు ఎటువంటి ఆటంకం ఉండదు. మోహనియా లోయలో ప్రమాదకర వంపుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలతో పాటు వాహన రాకపోకలకు ఎక్కువ సమయం పట్టేది. జంట సొరంగాల నిర్మాణంతో ఆ సమస్యకు సమసిపోతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఆప్టికల్ ఫైబర్‌తో కూడిన ఐటీ నిఘా వ్యవస్థ, అగ్ని ప్రమాద సహాయ వ్యవస్థ, కంట్రోల్ రూమ్, కెమెరాలు, ఫోన్ వంటి అత్యాధునిక సదుపాయాలను ఈ జంట సొరంగాల్లో ఏర్పాటు చేశారు.
ఇది భారతదేశపు మొదటి అక్విడక్ట్. దీనికి దిగువన సొరంగం, పైన బన్‌సాగర్ కాల్వ ఉంది. దీని పైన పూర్వపు రహదారి కూడా ఉంది. ఈ సొరంగంలో ఒక పెద్ద, చిన్న వంతెన, ఒక ఆర్‌వోబీ, ఒక ఓవర్‌పాస్, ఒక అండర్‌పాస్, 4 కెనాల్ క్రాసింగ్‌లు, 11 బాక్స్ కల్వర్టులు, 20 కల్వర్టులను నిర్మించారు.
*****
(Release ID: 1882628)
Visitor Counter : 158