నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా భారతదేశంలోని 197 జిల్లాల్లో నిర్వహించబడుతుంది

Posted On: 10 DEC 2022 10:04AM by PIB Hyderabad
  • 25 రాష్ట్రాల్లోని 197 జిల్లాల పరిధిలో మేళా ప్రారంభమవుతుంది
  • మేళాలో భాగంగా యువతకు అప్రెంటిస్‌షిప్ అవకాశాలను అందించడానికి అనేక స్థానిక వ్యాపారాలకు ఆహ్వానం


స్కిల్ ఇండియా మిషన్ కింద భారతదేశంలోని యువతకు కెరీర్ అవకాశాలను పెంపొందించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గనిర్దేశం మేరకు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఏంఎస్‌డిఈ) డిసెంబర్ 12, 2022న దేశంలోని  25 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 197 ప్రదేశాల్లో ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళాను (పిఎంఎస్‌ఏఎం) నిర్వహించనుంది.

స్థానిక యువతకు అప్రెంటిస్‌షిప్ శిక్షణ ద్వారా వారి కెరీర్‌ను రూపొందించుకునే అవకాశాన్ని అందించడానికి అనేక స్థానిక వ్యాపారాలు మేళాలో భాగం కావడానికి ఆహ్వానించబడ్డాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన  కంపెనీలు పాల్గొననున్నాయి. పాల్గొనే కంపెనీలు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో  అప్రెంటీస్‌లను కలుసుకునే అవకాశాన్ని పొందుతాయి. మరియు అక్కడికక్కడే దరఖాస్తుదారులను ఎంపిక చేస్తాయి అలాగే వారి సంస్థలో భాగమయ్యే అవకాశాన్ని వారికి అందిస్తాయి.

ఆసక్తిగల అభ్యర్ధులు  https://www.apprenticeshipindia.gov.in/ ని సందర్శించడం ద్వారా మేళాకు నమోదు చేసుకోవచ్చు. అలాగే మేళా జరిగే సమీప ప్రదేశాన్ని తెలుసుకోవచ్చు. 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు మరియు నైపుణ్య శిక్షణ సర్టిఫికేట్లు లేదా ఐటిఐ డిప్లొమా హోల్డర్లు లేదా గ్రాడ్యుయేట్లు ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మూడు  రెజ్యూమ్  కాపీలు, మార్క్‌షీట్లు, మూడు సర్టిఫికేట్‌ల  కాపీలు, ఫోటో ఐడీ (ఆధార్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) మరియు మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లను సంబంధిత వేదికలకు తీసుకెళ్లాలి.

ఇప్పటికే నమోదు చేసుకున్న వారు  సంబంధిత పత్రాలతో వేదిక వద్దకు చేరుకోవాలని సూచించబడింది. ఈ ఫెయిర్ ద్వారా అభ్యర్థులు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సివిఈటి) గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రాలను కూడా పొందుతారు. తద్వారా శిక్షణ తర్వాత వారి ఉపాధి అవకాశాలు మరింత  మెరుగుపడతాయి.

ప్రధాన్ మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళాపై  నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అతుల్ కుమార్ తివారీ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ  “నేటి యువతకు అప్రెంటిస్‌షిప్ అవకాశాల పరంగా భారతదేశం తరచు ఇతర అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోల్చబడింది. ఈ అంతరాన్ని తగ్గించడానికి, శిక్షణార్థులు మరియు విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. గత నెలలో జరిగిన అప్రెంటిస్‌షిప్ మేళా సందర్భంగా కష్టపడి పనిచేయడానికి, మన ఆర్థిక వ్యవస్థకు సహకారం అందించడానికి మరియు మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో సహాయం చేయడానికి ఆసక్తి ఉన్న  యువత నుండి మాకు గొప్ప స్పందన లభించింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే ఎక్కువ మంది అప్రెంటిస్‌లను నియమించుకునేలా కంపెనీలను ప్రోత్సహించడం. అదే సమయంలో సరైన ప్రతిభను కనుగొనడంలో మరియు శిక్షణ మరియు ఆచరణాత్మక అనుభవం ద్వారా వారి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో యజమానులకు సహాయం చేయడం. అప్రెంటిస్‌షిప్ నుండి ఉన్నత విద్య వరకు విశ్వసనీయమైన మార్గాలను నిర్మించడంతో పాటు విద్యావ్యవస్థలో అప్రెంటిస్‌షిప్‌ను పొందుపరచడం కూడా కీలకం. మా నిరంతర ప్రయత్నాలతో 2022 చివరి నాటికి భారతదేశంలో అప్రెంటిస్‌షిప్ అవకాశాలను 10 లక్షలకు మరియు 2026 నాటికి 60 లక్షలకు పెంచడమే లక్ష్యం" అని వెల్లడించారు.

దేశంలో ప్రతి నెలా అప్రెంటిస్‌షిప్ మేళాలు నిర్వహించబడతాయి. ఇందులో ఎంపిక చేసిన వ్యక్తులు కొత్త నైపుణ్యాలను పొందేందుకు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా నెలవారీ స్టైఫండ్‌ను అందుకుంటారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అప్రెంటిస్‌షిప్ అత్యంత స్థిరమైన మోడల్‌గా పరిగణించబడుతుంది మరియు స్కిల్ ఇండియా మిషన్ కింద ఇది పెద్ద ప్రోత్సాహాన్ని పొందుతోంది.

అప్రెంటిస్‌షిప్ శిక్షణ ద్వారా సంవత్సరానికి 10 లక్షలమంది యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.  ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి, సంస్థలు మరియు విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడానికి పిఎంఎన్‌ఏఎం ఒక వేదికగా ఉపయోగించబడుతోంది. భాగస్వామ్య సంస్థల్లో ఉన్న వివిధ అవకాశాలపై యువతకు అవగాహన కల్పిస్తోంది.

 

****



(Release ID: 1882387) Visitor Counter : 142