విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
రాజస్థాన్‌లోని చారిత్రక నగరం ఉదయపూర్‌లో నేడు భారత
జి20 అధ్యక్ష దూత (షెర్పా)ల తొలి సమావేశం ప్రారంభం
Posted On:
04 DEC 2022 9:27PM by PIB Hyderabad
భారత జి20 అధ్యక్ష దూత (షెర్పా)ల తొలి సమావేశం నేడు- 2022 డిసెంబర్ 04న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మీడియా ప్రతినిధులతో సంభాషణలు, సమావేశాలు నిర్వహించబడ్డాయి. అలాగే పేరుకుపోతున్న బహుళ సంక్షోభాల యుగంలో సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనను వేగిరపరచే దిశగా 2030 చర్చనీయాంశ జాబితాలోని మధ్యంతర లక్ష్యంలో భాగంగా ‘జీవితాల్లో పరివర్తన’ పేరిట ఒక అనుబంధ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఉదయపూర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు జి20 కూటమిలోని వివిధ దేశాల షెర్పాలతోపాటు ప్రతినిధులు, ఆహ్వానిత అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యారు. ఈ ప్రతినిధులను స్వాగతించడంతోపాటు భారతీయ ఆతిథ్యం, కళా సంప్రదాయ ప్రదర్శనలో భాగంగా వివిధ రాజస్థానీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఉదయపూర్‌లోని ప్రసిద్ధ ‘పిచోలా’ సరస్సు తీరాన ప్రసార, ప్రచురణ మాధ్యమాల ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించబడింది. ఈ సందర్భంగా రాబోయే ఏడాది కాలంలో భారత కీలక ప్రాధాన్యాలు, ప్రతిరోధక ఆర్థిక ప్రగతి, వాతావరణ చర్యలు, మహిళా చోదక అభివృద్ధి తదితర అంశాలపై చర్చలు సాగాయి. పాత్రికేయులకు వివరాల వెల్లడిలో భాగంగా భారత జి20 అధ్యక్షత స్వరూపం, వివిధ కార్యాచరణ-సంప్రదింపుల బృందాల ఏర్పాటు గురించి సంక్షిప్తంగా సమాచారం ఇవ్వబడింది. అదే సమయంలో కార్యాచరణ బృందాల ప్రాథమ్యాలు ప్రముఖంగా వివరించబడ్డాయి. అనేక అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ అన్ని దేశాల నడుమ సమష్టి భావనసహా ఇతర దేశాలతో సంయుక్తంగా పరిష్కారాన్వేషణకు భారత్ చొరవ చూపుతుందని పునరుద్ఘాటించబడింది. అలాగే దక్షిణార్ధ గోళ దేశాల విషయంలో భారతదేశ వైఖరిని స్పష్టం చేయడంపైనా దృష్టి సారించబడింది.
మొదటి అనుబంధ కార్యక్రమం కింద ‘ఎస్‌డీజీ’ల సాధన కార్యక్రమాల అమలును వేగిరపరచడంపై బృంద చర్చ నిర్వహించబడింది. కాగా- ‘ఎస్‌డీజీ’లకు ఆమోదం, అమలు, పర్యవేక్షణసహా ఉప-జాతీయ, స్థానిక పరిస్థితులకు తగినట్లు వాటి విస్తరణకు సంబంధించి గత ఏడేళ్లుగా భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అయితే, ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉన్నప్పటికీ భారీ స్థాయిన ప్రభావం సృష్టించడంలో భారతదేశం చేపట్టిన అనేక కార్యక్రమాలు, చర్యలు విజయవంతమయ్యాయి. డిజిటల్ పరివర్తనాత్మకతలో... ముఖ్యంగా ‘ప్రగతి కోసం డేటా’, నిష్పాక్షిక హరిత మార్పు, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, ‘ఎస్‌డీజీ’ల సాధన దిశగా ఆర్థిక వృద్ధి వగైరా అంశాల్లో వినూత్న విధానాలు, ఉపకరణాలోపాటు అనుభవాలు, వివిధ రకాల ఉత్తమాచరణ పద్ధతులు, గుణపాఠాలను భారత్ మేళవించింది. ఇతర దేశాలు ‘ఎస్‌డీజీ’ల సాధనలో సవాళ్లను ఎదుర్కొంటూ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవడంలో భారత్ చేసిన కృషి ఉపయోగకరం కాగలదు. ‘ఎస్‌డీజీ’ల సాధన దిశగా ప్రయాణం 2030 చర్చనీయాంశ మధ్యంతర బిందుకు చేరిన నేపథ్యంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలు, పేరుకుంటున్న సవాళ్లను, అనేక అడ్డంకులను అధిగమించడానికి ఈ నాలుగు వేగకారకాలు ఏ విధంగా తోడ్పడతాయనే అంశంపై అనుబంధ చర్చ ఫలవంతంగా సాగింది. అంతకుముందు ప్రతినిధులందరికీ అందజేసిన స్వాగత ప్రకటనలో- ప్రతి సవాలు ఒక అవకాశమేనని, సంక్షోభాల నడుమ వినూత్న పరిష్కారానికి నాయకత్వం కృషి చేయాలన్నది తాము విశ్వసిస్తున్న సూత్రమని భారత జి20 షెర్పా అమితాబ్ కాంత్ నొక్కిచెప్పారు. తదనుగుణంగా సరికొత్త భవిష్యత్తుకు రూపమివ్వడంలో జి20 షెర్పాలందరికీ బృహత్తర బాధ్యత ఉన్నదని స్పష్టం చేశారు. చర్చ ముగింపు సందర్భంగా- ‘ఎస్‌డీజీ’ల సాధన కోసం ప్రపంచాన్ని తిరిగి పట్టాలు ఎక్కించడంలో సమష్టి కృషికి నాయకత్వంతోపాటు వనరులు సమకూర్చగల విశిష్ట స్థితిలో జి20 వేదిక ఉన్నదని చర్చా బృందం స్పష్టంగా ప్రకటించింది.
జల ఉపరితలంపై చిత్రలేఖనం ‘జల్ సాంఝీ’ 300 ఏళ్లనాటి అరుదైన రాజస్థానీ కళారూపం. ఈ నైపుణ్య ప్రదర్శనలో భాగంగా ప్రముఖ కళాకారుడు రాజేష్ వైష్ణవ్ నీటిపై ఒక అందమైన కళాఖండంతో అతిథులందరికీ కనువిందు చేసి వారి అభినందనలు అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ గాయకుడు శ్రీ గాజీ ఖాన్ బర్నా నేతృత్వంలోని ఎడారి సంగీత విభావరి బృందంతోపాటు రాజస్థాన్‌లోని ‘లంగా-మాంగనియర్’ జానపద సంగీత కళావారసులైన నిపుణులైన కళాకారులు చిరస్మరణీయ ప్రదర్శనలతో అతిథులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జానపద సంగీతంతో వీనులవిందు చేయడంతోపాటు రాజస్థానీ జానపదానికి ప్రాణంపోసే- ‘కమైచా, సింధీ సారంగి, సురిందా, అల్గోజా, మట్కా, మురళి, ఢోలక్, ఖర్తాల్, భాపాంగ్, తాండూర, మోర్చాంగ్, మంజీరా వంటి సంగీత వాద్యాల మధురనాదంతో అలరించారు. గౌరవనీయ అతిథులను ఎడారి సంగీత విభావరి బృందం రాజస్థానీ కళారూపాల మూలాల్లోకి తీసుకెళ్లే విధంగా జానపద సంప్రదాయంతో మేళవించిన సాంస్కృతిక అనుభూతిలో ముంచెత్తారు. షెర్పాలతోపాటు ఇతర ప్రతినిధి బృందాల సభ్యులందరికీ సంప్రదాయ చిరుధాన్యా అల్పాహారం, రాజస్థానీ బాంధినీ బ్యాగ్‌లను నమూనాలుగా బహూకరించారు.
ఈ జి20 కూటమి దేశాల షెర్పాలు, ఆహ్వానిత అంతర్జాతీయ సంస్థల షెర్పాల సమావేశం నాలుగు రోజులపాటు (2022 డిసెంబరు 04-07) సాగుతుంది. సాంకేతిక పరివర్తన, హరిత ప్రగతి, కొన్ని సమకాలీన ప్రధాన సమస్యలపై కీలక చర్చలకు ఇది వేదికగా నిలుస్తుంది. అలాగే పర్యావరణం కోసం జీవనశైలి (లైఫ్), మహిళల నేతృత్వంలో అభివృద్ధికి గుర్తింపు, ‘ఎస్‌డీజీ’ల అమలును వేగవంతం చేయడం, సమ్మిళిత-ప్రతిరోధక వృద్ధికి సౌలభ్యం తదితరాలపైనా సంభాషణలు సాగుతాయి.
******
(Release ID: 1881776)