రైల్వే మంత్రిత్వ శాఖ
దేశంలో 2030 నాటికి నికరశూన్య కర్బన ఉద్గార లక్ష్య సాధనకు భారత రైల్వేల (ఐఆర్) సంకల్పం
బ్రాడ్ గేజ్ (బీజీ) రైలుమార్గాల 100 శాతం విద్యుదీకరణకు ‘ఐఆర్’ కట్టుబాటు
Posted On:
07 DEC 2022 3:50PM by PIB Hyderabad
భారత రైల్వేలు (ఐఆర్) 2030 నాటికి నికరశూన్య కర్బన ఉద్గార లక్ష్యం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ దిశగా కింద పేర్కొన్న చర్యలు చేపట్టింది:
- రైలు మార్గాల నెట్‌వర్క్ 100 శాతం విద్యుదీకరణ
- రైల్వేల పరిధిలో (31.10.2022 వరకు) దాదాపు 142 మెగావాట్ల సామర్థ్యంగల సౌర విద్యుత్ ప్లాంట్లు, సుమారు 103 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లు (పైకప్పులు, ఖాళీ స్థలాలు రెండింటా) ప్రారంభించబడ్డాయి.
- రైలు ఇంజన్లు, విద్యుత్ మల్టిపుల్ యూనిట్ (ఇఎంయు-ఎము) రైళ్లు, ప్రధాన మార్గాల విద్యుత్ మల్టిపుల్ యూనిట్ (ఎంఇఎంయు-మెము) రైళ్లు, కోల్‌కతా మెట్రో సెట్లు, విద్యుత్ రైలు సెట్లలో పునరుత్పాదక బ్రేకింగ్‌తో ‘ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ (ఐజీబీటీ) ఆధారిత 3-ఫేజ్ ప్రొపల్షన్ వ్యవస్థ వినియోగం.
- శబ్దం, వాయు కాలుష్యం, డీజిల్ వినియోగం తగ్గింపులో భాగంగా ‘ఎండ్ ఆన్ జనరేషన్’ (ఇఓజి) రైళ్లు ‘హెడ్ ఆన్ జనరేషన్’ (హెచ్‌ఓజి) రైళ్లుగా మార్పిడి.
- విద్యుత్ వినియోగం తగ్గించడం కోసం రైల్వే స్టేషన్లు, సర్వీస్ భవనాలు, నివాస గృహాలు, కోచ్‌లుసహా అన్ని రైల్వే సంబంధిత భవన సముదాయాల్లో ‘లైట్ ఎమిటింగ్ డయోడ్’ (ఎల్‌ఇడి)ల ఏర్పాటు.
- కర్బన సంగ్రహణం కోసం రైల్వే భూముల అటవీకరణ.
- హరిత ధ్రువీకరణ- వివిధ పారిశ్రామిక యూనిట్లు, రైల్వే స్టేషన్లు, ఇతరత్రా రైల్వే సంస్థలు హరిత ధ్రువీకరణ చేయబడ్డాయి. అంతేకాకుండా పర్యావరణ నిర్వహణ వ్యవస్థ కింద: వివిధ రైల్వే స్టేషన్లకు ‘ఐఎస్‌ఓ 14001’ ధ్రువీకరణ కూడా చేయబడింది.
- తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్ల (డిఎఫ్‌సి) నిర్మాణం.
- వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తిచేసే ప్లాంట్ల ఏర్పాటు.
ఈ చర్యలతోపాటు సంప్రదాయ వనరుల ద్వారా ఇంధన వినియోగం తగ్గింపు దిశగా పునరుత్పాదక ఇంధన ఉత్పాదకతను పెంచుకోవాలని ‘ఐఆర్’ నిర్ణయించింది. కాగా, ప్రస్తుత రైళ్ల సమూహంలో సౌరశక్తి రైలును చేర్చే ప్రతిపాదన లేదు. సౌరశక్తి వ్యవస్థ పగటివేళ పని చేసేది కావడంతోపాటు సుమారు 4 నుంచి 5 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను మాత్రమే ఉత్పత్తి చేయగలదు. అలాగే పొగమంచు/శీతల, వర్షాకాలాల్లో ఈ వ్యవస్థ సరిగా పనిచేయదు. దీంతోపాటు వాతావరణ పరిస్థితులను బట్టి బ్యాటరీ బ్యాకప్ 2 నుంచి 3 గంటలకు మించదు. అందువల్ల ఈ వ్యవస్థ పొడిగింపు ముందుకు సాగలేదు.
రైల్వేలు-కమ్యూనికేషన్లు/ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.
******
(Release ID: 1881698)
Visitor Counter : 156