కేంద్ర మంత్రివర్గ సచివాలయం
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను వల్ల ఏర్పడే పరిస్థితిని ఎదుర్కోవడానికి సంసిద్ధతను సమీక్షించిన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (NCMC)
Posted On:
06 DEC 2022 6:41PM by PIB Hyderabad
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా ఎదురయ్యే పరిస్థితిని
ఈ రోజు సమావేశమై, బంగాళాఖాతంలో తుఫాను వల్ల ఏర్పడే పరిస్థితిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను, సంసిద్ధతను కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన ఈ రోజు జరిగిన నేషనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీ (NCMC) సమావేశం సమీక్షించింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు/సంస్థలు రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల సంసిద్ధతను సమావేశం సమీక్షించింది.
బంగాళాఖాతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ జనరల్ కమిటీ కి వివరించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ రోజు సాయంకాలానికి అల్పపీడనం బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ డిసెంబర్ 7వ తేదీ సాయంకాలానికి కి తుఫానుగా బలపడుతుంది. డిసెంబర్ 08 ఉదయం నాటికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. ఇది తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ వివరించారు.
తుఫాను వల్ల ఏర్పడే పరిస్థితిని ఎదుర్కోవడానికి, ప్రజలను రక్షించడానికి తీసుకుంటున్న చర్యలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు నేషనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీకి వివరించారు. ఆస్తి,ప్రాణ నష్టం కలగకుండా చూడడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. స్థానిక సంస్థల సహకారంతో ముందస్తు జాగ్రత్త చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని మత్స్యకారులను హెచ్చరించమని, ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారిని వెనక్కి రప్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అత్యవసర సేవల కోసం యంత్రాంగాన్ని సిద్ధం చేశామని పేర్కొన్నారు.
పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల నుంచి అందిన విజ్ఞప్తి మేరకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం రంగంలోకి దిగడానికి సిద్దమయింది. తమిళనాడు కు ఐదు బృందాలు, పుదుచ్చేరికి 2 బృందాలను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం పంపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విజ్ఞప్తి అందిన వెంటనే ఆ రాష్ట్రానికి వెళ్ళడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని సిద్ధం చేశారు. సహాయ చర్యలు చేపట్టేందుకు నౌకలు , విమానాలతో పాటు ఆర్మీ మరియు నేవీ యొక్క రెస్క్యూ మరియు రిలీఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. కోస్ట్ గార్డ్ కూడా తన నౌకలతో సిద్ధంగా ఉంది.
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మరియు కేంద్ర సంస్థల సంసిద్ధత చర్యలను సమీక్షించిన శ్రీ రాజీవ్ గౌబా రాష్ట్ర/యుటి ప్రభుత్వాల సంబంధిత అధికారులు మరియు సంబంధిత కేంద్ర సంస్థలు నివారణ మరియు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూడాలని, ఆస్తి మరియు విద్యుత్ మరియు టెలికాం వంటి మౌలిక సదుపాయాలకు సాధ్యమైనంత తక్కువ నష్టం జరిగేలా చూడడానికి చర్యలు అమలు చేయాలని అన్నారు. దెబ్బతినే అవకాశం ఉన్న వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
విపత్తును ఎదుర్కోవడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారం అందుతుందని శ్రీ రాజీవ్ గౌబా హామీ ఇచ్చారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్య కార్యదర్శులు, పుదుచ్చేరికి సీనియర్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, విద్యుత్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, డీజీ టెలికాం, సభ్య కార్యదర్శి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ, భారత వాతావరణ విభాగం కోస్ట్ గార్డ్ డీజీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1881279)
Visitor Counter : 200