ఆయుష్

మూడు జాతీయ ఆయుష్ సంస్థలను 2022 డిసెంబర్ 11న జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


సాంప్రదాయ భారత వైద్య విధానంలో పరిశోధనలు ప్రోత్సహించడానికి మూడు జాతీయ సంస్థల ఏర్పాటు.. శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 06 DEC 2022 2:25PM by PIB Hyderabad

మూడు జాతీయ ఆయుష్ ఇన్‌స్టిట్యూట్‌లు - ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA), గోవా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ (NIUM), ఘజియాబాద్ మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి (NIH), ఢిల్లీ  లను 2022 డిసెంబర్ 11న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి  అంకితం చేస్తారని  కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రకటించారు. డిసెంబర్ 11, 2022 న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వారా దేశం.  ఈ శాటిలైట్ సంస్థలు ఆయుష్ రంగంలో  పరిశోధన, అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని మంత్రి వివరించారు.  ఎక్కువ మంది ప్రజలకు సరసమైన ఆయుష్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 

9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ వివరాలను శ్రీ సర్బానంద సోనోవాల్ మీడియాకు తెలిపారు. గోవాలో డిసెంబర్ 11న జరిగే కాంగ్రెస్ ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారని అన్నారు.  గోవాలోని పంజిమ్‌లో జరిగే ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్   అంతర్జాతీయ స్థాయిలో ఆయుష్ వైద్య విధానం శాస్త్రీయత, సమర్థత మరియు బలాన్ని ప్రదర్శిస్తుంది అని శ్రీ సర్బానంద సోనోవాల్  తెలిపారు. మీడియా సమావేశంలోఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్‌తో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

సాంప్రదాయ భారతీయ వైద్య వ్యవస్థలను బలోపేతం  చేయడానికి, పరిశోధనలు చేపట్టడానికి  అవసరమైన మౌలిక సౌకర్యాలు, మానవ వనరులు కల్పించాలన్న ప్రధానమంత్రి సూచనల మేరకు నూతన సంస్థలు ఏర్పాటు అవుతాయని మంత్రి పేర్కొన్నారు. ఆయుష్ వైద్య విధానం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు.   

ఆయుర్వేదం, హోమియోపతి మరియు యునాని రంగంలో ఏర్పాటయ్యే ఈ  మూడు జాతీయ ఆయుష్ సంస్థలను ఏర్పాటు చేయడం వల్ల యూజీ,పీజీ,  డాక్టోరల్ కోర్సులలో అదనంగా 400  సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల 400 మంది విద్యార్థులు ఆయుర్వేదం, హోమియోపతి మరియు యునాని వైద్య విద్యను అభ్యసించి గలుగుతారు. ఆయుర్వేదం, హోమియోపతి మరియు యునాని ఆస్పత్రుల్లో  550 అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. 

గోవాలో ఏర్పాటయ్యే  ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) ఆయుర్వేద వైద్య విధానంలో  విద్య, పరిశోధన మరియు రోగుల సంరక్షణ సేవలకు సంబంధించిన  యూజీ,పీజీ,    పోస్ట్ డాక్టోరల్ కోర్సులను అందిస్తుంది. దీనికోసం  అత్యధిక నాణ్యత గల సౌకర్యాలను సంస్థలో కల్పిస్తారు.  ఇది మెడికల్ వాల్యూ ట్రావెల్ (MVT)ని ప్రోత్సహించే ఆయుర్వేద వెల్నెస్ హబ్‌గా అభివృద్ధి చేయబడుతుంది.  విద్యా ,పరిశోధన ప్రయోజనాల కోసం అంతర్జాతీయ మరియు జాతీయ సహకారం కోసం ఒక మోడల్ సెంటర్‌గా పని చేస్తుంది.

ఢిల్లీ కేంద్రంగా  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి (NIH) పనిచేస్తుంది. హోమియోపతి వైద్య వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందించడానికి ఉత్తర భారతదేశంలో  మొట్టమొదటి సారిగా సంస్థ ఏర్పాటవుతుంది.  ఆధునిక సౌకర్యాలతో సాధారణ వైద్యం తో ఆయుష్ ఆరోగ్య సంరక్షణ సేవలను ఏకీకృతం చేస్తుంది. హోమియోపతి రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. 

 బెంగళూరు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ కు అనుబంధ సంస్థగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఏర్పాటయ్యే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ (NIUM) పనిచేస్తుంది.  ఉత్తర భారతదేశంలో ఇటువంటి సంస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.  ఎంవీటీ  క్రింద   ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు  విదేశీయులకు కూడా సేవలందిస్తుంది.

గోవాలోని పంజిమ్‌లో 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ (WAC)ని నిర్వహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తోంది.  ప్రపంచ స్థాయిలో ఆయుష్ వైద్య విధానం  శాస్త్రీయత, సమర్థత మరియు బలాన్ని చాటి చెప్పడానికి కాంగ్రెస్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వివిధ కార్యక్రమాలను సమావేశంలో నిర్వహిస్తారు.   ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ లో వివిధ అంశాలపై  చర్చలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. 

***

 



(Release ID: 1881242) Visitor Counter : 130