ఆర్థిక మంత్రిత్వ శాఖ

సోమ‌వారం 65వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని జ‌రుపుకోనున్న డిఆర్ఐ


ఈ సంద‌ర్భంగా జ‌రుగ‌నున్న 8వ రీజిన‌ల్ క‌స్ట‌మ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మీటింగ్ (ఆర్‌సిఇఎం)

Posted On: 04 DEC 2022 9:07AM by PIB Hyderabad

డైరెక్టొరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) ఈ ఏడాది 5-6వ తేదీల‌లో త‌న 65వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటోంది.  కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రి శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీతారామ‌న్‌, కేంద్ర ఆర్ధిక శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ పంక‌జ్ చౌధ‌రితో క‌లిసి ఈ రెండు రోజుల కార్య‌క్ర‌మాన్నిప్రారంభిస్తారు. 
భార‌త ప్ర‌భుత్వ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ & క‌స్ట‌మ్స్ (సిబిఐసి - ప‌రోక్ష ప‌న్నులు & క‌స్ట‌మ్స్ బోర్డు) ఆధ్వ‌ర్యంలో స్మ‌గ్లింగ్ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌పై ప్ర‌ధాన నిఘా, అమ‌లు ఏజెన్సీ డిఆర్ఐ. ఈ సంస్థ 1957 డిసెంబ‌ర్ 4న ఉనికిలోకి వ‌చ్చింది. కేంద్ర‌కార్యాల‌యం న్యూఢిల్లీలో క‌లిగిన డిఆర్ఐకు 12 జోన‌ల్ యూనిట్లు, 35 ప్రాంతీయ యూనిట్లు, 15 ఉప‌- ప్రాంతీయ యూనిట్ల‌తో  800 మంది అధికారుల‌తో ప‌ని చేస్తోంది. 
 ఆరు ద‌శాబ్దాల‌కు పైగా, భార‌త దేశ‌వ్యాప్తంగా, విదేశాల‌లోనూ త‌న ఉనికిని క‌లిగిన డిఆర్ఐ మాద‌క ప‌దార్ధాలు & మ‌త్తు ప‌దార్ధాలు, బంగారం, వ‌జ్రాలు, విలువైన లోహాలు, వ‌న్య‌ప్రాణుల‌కు సంబంధించిన వ‌స్తువులు, సిగిరెట్లు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి & పేలుడు ప‌దార్ధాలు, న‌కిలీ నోట్లు, విదేశీ మార‌కం, ఎస్‌సిఒఎంఇటి వ‌స్తువులు, ప్ర‌మాద‌క‌ర‌మైన & ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించే  వ‌స్తువులు, ప్రాచీన‌కాలానికి చెందిన వ‌స్తువులు తదిరాల అక్ర‌మ ర‌వాణా వంటి వాటిని గుర్తించి, నిరోధించే కార్య‌క్ర‌మల‌ను నిర్వ‌హించి, వ్య‌వ‌స్థీకృత నేర‌గాళ్ళ బృందాలు, స్మ‌గ్ల‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకుంటోంది. వీటితో పాటుగా వాణిజ్య మోసాల‌ను, క‌స్ట‌మ్స్ డ్యూటీ ఎగ‌వేత‌ల‌ను వెలికితీయ‌డంలో కూడా డిఆర్ఐ నిమ‌గ్న‌మై ఉంది. 
వివిధ దేశాల‌తో చేసుకున్న క‌స్ట‌మ్స్ ప‌ర‌స్ప‌ర స‌హాయ ఒప్పందాల కింద స‌మాచార మార్పిడి, ఇత‌ర దేశాల‌లోని క‌స్ట‌మ్స్ విభాగాల ఉత్త‌మ ఆచ‌ర‌ణ‌ల‌ను అభ్య‌సించ‌డంపై దృష్టి ఉంచి అంత‌ర్జాతీయ క‌స్ట‌మ్స్ స‌హ‌కారంలో డిఆర్ఐ ముందంజ‌లో ఉంది. 
ఇందుకు అనుగుణంగా, భాగ‌స్వామ్య క‌స్ట‌మ్స్ సంస్థ‌లు, ప్రపంచ క‌స్ట‌మ్స్ సంస్థ‌, ఇంట‌ర్‌పోల్ వంటి అంత‌ర్జాతీయ ఏజెన్సీలతో అమ‌లుకు సంబంధించిన అంశాల‌పై స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేసేందుకు రీజిన‌ల్ క‌స్ట‌మ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మీటింగ్ (ఆర్‌సిఇఎం)ను వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించే అవ‌కాశాన్ని డిఆర్ఐ వినియోగించుకుంటోంది. 
ఈ ఏడాది ఈ కార్య‌క్ర‌మానికి ప్రపంచ క‌స్ట‌మ్స్ సంస్థ (డ‌బ్ల్య‌సిఒ), ఇంట‌ర్‌పోల్‌, మాద‌క ద్ర‌వ్యాలు, నేరాల‌పై ఐరాస కార్యాల‌యం (యుఎన్ఒడిసి), ఆసియా ప‌సిఫిక్ కు చెందిన రీజిన‌ల్ ఇంటెలిజెన్స్ లయ‌జ‌న్ ఆఫీస్ వంటి 22 ఆసియా ప‌సిఫిక్ ప్రాంతానికి చెందిన క‌స్ట‌మ్స్ పాల‌నా సంస్థ‌ల‌ను ఆహ్వానించింది. 
కేంద్ర ఆర్ధిక & కార్పొర‌ట్ వ్య‌వ‌హారాల మంత్రి భార‌త‌దేశంలో స్మ‌గ్లింగ్ 2021-22 పై తాజా ఎడిష‌న్‌ను ఆవిష్క‌రించ‌నున్నారు. స్మ‌గ్లింగ్ వ్య‌తిరేక, వాణిజ్య మోసాల క్షేత్రంలో స‌ర‌ళుల‌ను, గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో డిఆర్ఐ ప‌నితీరు, అనుభవాల‌ను ఈ నివేదిక‌లో పొందుప‌రిచారు. 
గ‌త విజ‌యాల‌ను గుర్తించి, గౌర‌వించే రోజుగా, సిబిఐసి, డిఆర్ఐకు చెందిన యువ‌ అధికారుల‌కు ప్రేర‌ణ‌గా డిఆర్ఐ దినోత్స‌వం నిలుస్తుంది. ప్రాంతీయ దేశాలు, ముఖ్య‌మైన ప్రాంతీయ వాణిజ్య భాగ‌స్వాముల‌కు చెందిన క‌స్ట‌మ్స్ పాల‌నా సంస్థ‌ల‌తో ముచ్చ‌టించి, చ‌ర్చించేందుకు అవ‌కాశాన్ని క‌ల్పించ‌డం ద్వారా ఈ ప్రాంతంలో క‌స్ట‌మ్స్ కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌లో భార‌త పాత్ర‌ను బ‌లోపేతం చేస్తుంది. 

 

***



(Release ID: 1880880) Visitor Counter : 134