జౌళి మంత్రిత్వ శాఖ
నిపుణులైన హస్తకళాకారులకు 28 నవంబర్, 2022, సోమవారం నాడు శిల్పగురు, జాతీయ అవార్డులను ప్రదానం చేయనున్న భారత ఉపరాష్ట్రపతి
కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్న కేంద్ర జౌళి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ, వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
హస్తకళా రంగంలో విశిష్ట హస్తకళాకారులను గుర్తించే లక్ష్యంతో శిల్ప గురు, జాతీయ అవార్డులు
Posted On:
27 NOV 2022 12:38PM by PIB Hyderabad
కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ 2017, 2018, 2019 సంవత్సరాలకు నిపుణులైన హస్తకళాకరులకు శిల్ప గురు, జాతీయ అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని 28 నవంబర్ 2022న నిర్వహించనున్నది.
ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధనకడ్ హాజరుకానున్నారు. కేంద్ర జౌళి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ, వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. రైల్వేలు, జౌళి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శన విక్రమ్ జర్దోష్ గౌరవ అతిథిగా పాల్గొంటారు.
నైపుణ్యం కలిగిన హస్తకళాకారులకు జాతీయ అవార్డుల పథకాన్ని 1965 నుంచి డెవలప్‌మెంట్ కమిషనర్ (హస్తకళలు) కార్యాలయం నిర్వహిస్తుండగా, 2002 నుంచి శిల్ప గురు అవార్డులను ప్రవేశపెట్టారు. ఈ అవార్డులు దేశంలోని సుసంపన్నమైన, విభిన్న హస్తకళల వారసత్వాన్ని పరిరక్షించడమే కాక మొత్తం హస్తకళల రంగం పునరుద్ధరణకు దోహదం చేసిన హస్తకళల ప్రముఖ హస్తకళా నిపుణులకు ప్రతి ఏడాదీ ప్రదానం చేస్తున్నారు. హస్తకళల రంగంలో విశిష్టత కలిగిన హస్తకళాకారులను గుర్తించడం ఈ అవార్డుల ప్రధాన లక్ష్యం. అవార్డు గ్రహీతలు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు, విభిన్న ప్రాంతాలకు చెందిన భిన్న హస్తకళా శైలులకు ప్రాతినిధ్యం వహిస్తారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిపివేసిన ఈ కార్యక్రమంలో గత మూడేళ్ళకు సంబంధించిన అవార్డులను కూడా అందించనున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో హస్తకళల రంగం ప్రముఖ, కీలక పాత్రను పోషిస్తుంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో విస్త్రతంగా గల హస్తకళాకారులకు ఉపాధిని కల్పించడమే కాక, దేశానికి చెప్పుకోదగిన స్థాయిలో విదేశీ మారకాన్ని ఆర్జించి పెడుతూనే, తన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తుంది. హస్తకళల రంగం ఉపాధికి & ఎగుమతులకు చెప్పుకోదగిన విధంగా దోహదం చేయడాన్ని కొనసాగిస్తోంది.
***
(Release ID: 1879392)
Visitor Counter : 167