సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కథలతో పిల్లలతో మాట్లాడే వినూత్న మార్గాన్ని అన్వేషించే 'ఎక్దా కాయ్ జలా' చిత్రం
“మంచి సినిమాల్లో నటించడం కోసం సరైన కథ కోసం ఎదురుచూడాలనే నా నమ్మకాన్ని 'ఎక్దా కాయ్ జలా' చిత్రం బలపరిచింది ” ..చిత్ర కథానాయకుడు సుమిత్ రాఘవన్
పిల్లలు నిద్ర పోవడానికి చెప్పే కధలు మరాఠీ భాషలో 'ఎక్దా కాయ్ జలా' అంటూ ప్రారంభం అవుతాయి. 'ఎక్దా కాయ్ జలా' అంటే 'అనగనగా ఒకసారి' అని అర్థం. సంగీత దర్శకుడు, రచయిత, దర్శకుడు అయిన డాక్టర్ సలీల్ కులకర్ణి 'ఎక్దా కాయ్ జలా' పేరుతో నిర్మించిన చిత్రంలో కేవలం పిల్లల కోసం మాత్రమే కాకుండా అన్ని వయస్సుల వారి కోసం ఒక అబ్దుతమైన కథ చెబుతారు.
గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'ఎక్దా కాయ్ జలా' చిత్రాన్ని ప్రదర్శించారు. విన్నూత పాఠశాల నడుపుతున్న ఒక వ్యక్తి చుట్టూ 'ఎక్దా కాయ్ జలా' కథ తిరుగుతుంది. ఆకాశం కింద చెప్పే కథ ద్వారా ఆలోచన పంచుకోవడానికి వీలవుతుందని అతను నమ్ముతాడు. చిన్న లేదా పెద్ద ఆలోచనలను కథ ద్వారా తెలియజేయ వచ్చును అన్నది అతని నమ్మకం. పాఠశాలలో అతను కథల రూపంలో పాఠాలు చెబుతాడు. అదే పాఠశాలలో అతని కొడుకు కూడా చదువుతూ ఉంటాడు. అతను ఒకసారి జీవితంలో క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటాడు. ఒక సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని అతను తన కొడుకుకు తెలియజేయాల్సి వస్తుంది. ఈ సమయంలో అతను కథను ఉపయోగించుకుని వార్తను చెప్పడానికి మార్గాన్ని ఎంచుకుంటాడు.
చలన చిత్రం ప్రదర్శన తర్వాత ఈరోజు పీఐబీ ఏర్పాటు చేసిన టేబుల్ టాక్ కార్యక్రమంలో 'ఎక్దా కాయ్ జలా' దర్శకుడు డాక్టర్ సలీల్ కులకర్ణి పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన కులకర్ణి ' తాము చెప్పే విషయాలపై పిల్లలు ఎలా స్పందిస్తారు అనే అంశం గురించి పెద్దలు ఊహిస్తారు. పెద్దలకు అర్ధం కాని విషయాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం మరింత కష్టంగా ఉంటుంది. మంచి లేదా చెడు విషయాలను ముందుగా ఎలాంటి ఆలోచన లేకుండా పిల్లలకు ఎలా తెలియజేయవచ్చు అన్న అంశాన్ని చిత్రం ద్వారా చెప్పడానికి ప్రయత్నించాను." అని కులకర్ణి వివరించారు.
ఐఎఫ్ఎఫ్ఐ 53 లో ప్రదర్శనకు 'ఎక్దా కాయ్ జలా' ఎంపిక కావడం పట్ల కులకర్ణి హర్షం వ్యక్తం చేశారు. చిత్ర ప్రదర్శన ముగిసిన తర్వాత ప్రేక్షకుల కళ్ళలో నీరు తిరగడం తనను కదిలించింది అని అన్నారు.ఈ అనుభవం తనకు లతా మంగేష్కర్ పాడిన పాట రికార్డింగ్ సమయంలో తనకు కలిగిందని అన్నారు. రెండు సందర్భాలు తనను ఆనందంలో ముంచి వేశాయని అన్నారు.
స్వయంగా సంగీత దర్శకుడు అయిన కులకర్ణి తన సొంత సినిమాకు పాటలు రాసిన సమయంలో ఎదురైనా అనుభూతిని వివరించారు. సొంత సినిమాకు పాట రాయడం కొంత కష్టమైన అంశమని అన్నారు. పాట చిత్రీకరణ ఎలా ఉంటుందో ముందే తెలుస్తుంది అయితే ఇతరులు రాసిన పాటలను చిత్రీకరిస్తున్న సమయంలో కలిగే అనుభూతి ఒకసారి ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనివల్ల ఒకసారి ఆనందం లేదా మరో అనుభూతి కలుగుతుంది అని కులకర్ణి అన్నారు.
సినిమా నిర్మాణంపై తన అభిప్రాయాన్ని తెలియజేసిన కులకర్ణి తాను నిర్మించే చిత్రంలో ప్రతి నాయకుడు ఉండడని స్పష్టం చేశారు. ' ఇప్పటికే అందరికి సమస్యలు ఉన్నాయి.ఈ సమయంలో చెడ్డ వ్యక్తులు అవసరం లేదు. పరిస్థితులు విలన్ పాత్ర పోషిస్తాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.
దాదాపు 1700 మంది పిల్లలకు ఆడిషన్ నిర్వహించి చిత్రంలో చింతన్ పాత్ర కోసం అర్జున్ పూర్ణపాత్రే ని ఎంపిక చేశామని కులకర్ణి తెలిపారు.చిత్రంలో తండ్రి పాత్రలో సుమిత్ రాఘవన్ నటించగా, తల్లిగా ఊర్మిళా కనేత్కర్ కొఠారే నటించారు.
కార్యక్రమంలో పాల్గొన్న సుమిత్ రాఘవన్ కథ విన్న వెంటనే చిత్రంలో నటించడానికి అంగీకరించానని అన్నారు. దర్శకుడు కులకర్ణి మంచి కథతో చిత్రాన్ని నిర్మించారని పేర్కొన్నారు. మంచి కథ ఉన్న సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూశానని అన్నారు. " ఒక నటుడి జీవిత కాలం తక్కువగా ఉంటుంది. ఓపికతో మంచి కథ కోసం ఎదురుచూడడం తప్పు కాదు. మంచి సినిమాలో నటించే అవకాశం లభిస్తే మన నమ్మకం తప్పు కాదు అనిపిస్తుంది" అని రాఘవన్ పేర్కొన్నారు.
పిల్లల కోసం డాక్టర్ సలీల్ కులకర్ణి అనేక మంచి పనులు చేశారని రాఘవన్ అన్నారు. "పిల్లల భావాలపై కులకర్ణికి అవగాహన ఉంది. అనేక సంవత్సరాలుగా ఆయన పిల్లలతో కలిసి పనిచేస్తున్నారు' అని రాఘవన్ అన్నారు. చలన చిత్రోత్సవంలో చిత్రానికి ఆదరణ లభించిందని రాఘవన్ అన్నారు. 'సినిమాలో చూపిన సంఘటనలు, దృశ్యాలు ప్రపంచం అంతా ఒకే విధంగా ఉంటాయి. నటీనటులు పాత్రలకు న్యాయం చేశారు. సినిమా ఆశించిన విధంగా వచ్చింది. దేశ, విదేశాల్లో చిత్రానికి ఆదరణ లభించింది. 53 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపిక కావడం చిత్రానికి మరో మణిహారం" అని రాఘవన్ అన్నారు.
2022 నవంబర్ 26 న గోవాలో జరుగుతున్న 53 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో ఏక్దా కాయ్ జలా ప్రదర్శించబడింది.
***
(Release ID: 1879345)