సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. వద్ద చలన చిత్ర మాధ్యమంలో స్వాతంత్రోద్యమ చరిత్రను ప్రదర్శించిన - సి.బి.సి. ఎగ్జిబిషన్
ఈ సంవత్సరం భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో "టెక్నాలజీ ఎగ్జిబిషన్" ఒక కొత్త చొరవ కాగా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన మరో ఎగ్జిబిషన్ "ఫ్రీడమ్ మూవ్మెంట్ & సినిమా" మరింత ఎక్కువగా ప్రజలను ఆకర్షిస్తోంది.
కాంపాల్ ఫుట్ బాల్ మైదానంలో "మల్టీ-మీడియా డిజిటల్ ఎగ్జిబిషన్" ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "అనేక సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించి భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పూర్తి కథను ఈ ప్రదర్శన తెలియజేస్తుంది. ఈ ప్రదర్శనను సందర్శించే ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మన స్పూర్తిదాయక నాయకుల గురించి చాలా సమాచారాన్ని ఈ ప్రదర్శన ద్వారా పొందగలుగుతారు." అని పేర్కొన్నారు.
'ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్' అనే విస్తృతమైన ఇతివృత్తంతో సి.బి.సి బృందం రూపొందించిన ప్రదర్శన "కెమెరా లెన్స్" రూపంలో సందర్శకులను ఆకర్షించింది. ఎగ్జిబిషన్ హాల్ లోకి ప్రవేశించగానే, పెద్ద 12 x 10 అడుగుల ఎల్.ఈ.డి. తెరమీద ప్రముఖ దూరదర్శన్ ధారావాహిక 'స్వరాజ్' లోని దృశ్యాలను ప్రదర్శించారు. ఇది వలస పాలనకు వ్యతిరేకంగా వివిధ స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను, వారి త్యాగాలను వివరిస్తుంది.
ముందుకు వెళ్తే, 1857 స్వాతంత్య్ర సంగ్రామం తో పాటు, రాజా రామ్ మోహన్ రాయ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, కాలాపానీ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ల వంటి అమరవీరులకు సంబంధించిన అరుదైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ చిత్రాలను, వీడియోలను చాలా వరకు "ఫిల్మ్స్ డివిజన్" భాండాగారం నుండి సేకరించడం జరిగింది.
సి.బి.సి. రూపొందించిన ఒక "డిజిటల్-ఫ్లిప్-బుక్" పోస్టర్ల రూపంలో భారత స్వాతంత్య్ర పోరాట గాధలను కాలక్రమానుసారం ప్రదర్శిస్తుంది. స్వాతంత్య్ర పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచిన గీతాలను వినవచ్చు, అదేవిధంగా, ప్రక్కనే ఉన్న స్పీకర్ల నుండి భారత స్వాతంత్ర నాయకుల ప్రసంగాలను కూడా వినవచ్చు.
నేతాజీ తో "కదమ్ బధాయే జా" కవాతు అనేది వాస్తవంగా అనిపించే ఒక దివ్యమైన అనుభవం, ఇక్కడ మనం "ఆజాద్-హింద్-ఫౌజ్" యూనిఫాంలో భారతదేశ స్ఫూర్తిదాయకమైన నాయకుడితో కలిసి కవాతు చేయవచ్చు, మన ఫోటో ను తీసుకోవచ్చు.
1857 స్వాతంత్య్ర పోరాటాన్ని వివరించే ఒక నాటకాన్ని వీక్షించడం అనేది ఒక అనుభూతి చెందాల్సిన దివ్యమైన అనుభవం. దృశ్య మాధ్యమం ద్వారా వాస్తవంగా అనిపించే సెట్ మీకు కొత్త మార్గంలో కకోరి రైలు యాక్షన్ ను చూసేందుకు ఇది సహాయపడుతుంది.
"ఫ్లిప్ పోస్టర్ ఎగ్జిబిషన్" లో స్వాతంత్య్ర పోరాటం నుంచి ప్రేరణ పొందిన, దేశ నిర్మాణంలో దోహదపడిన, " ఉదయకాల్, ఉపకార్, మదర్ ఇండియా, బోస్, ది ఫర్గాటెన్ హీరో" వంటి కొన్ని చిత్రాలను ఉదాహరణగా ప్రదర్శించడం జరిగింది.
"ఆజాదీ-క్వెస్ట్-గేమ్" తో పాటు స్వాతంత్య్ర సమరయోధులపై నెట్‌ఫ్లిక్స్ కొత్తగా ప్రారంభించిన యానిమేషన్ సిరీస్ ను కూడా ఈ సి.బి.సి. ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు.
ఎగ్జిబిషన్ ప్రదర్శన భాగం "డిస్కవరీస్-జర్నీ-ఆఫ్-ఇండియా" తో ముగుస్తుంది, ఇది బహు ముఖ రంగాలలో దేశం ఎలా అభివృద్ధి చెందిందనే కథనాన్ని తెలియజేస్తుంది.
ఎగ్జిబిషన్ హాల్ మధ్యలో షాహిదీ కువాన్ లేదా జలియన్ వాలా బాగ్ అమరవీరుల బావి నమూనా ఉంది. ఇక్కడ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రసిద్ధి చెందిన వీరులతో పాటు, గుర్తింపు పొందని వీరందరికీ నివాళులు అర్పించవచ్చు.
(Release ID: 1877867)
Visitor Counter : 216