సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారతదేశాన్ని సినిమాల చిత్రీకరణ.. అనంతర కార్యకలాపాలకు అత్యంత అభిలషణీయ గమ్యంగా మార్చాలి: శ్రీ అనురాగ్ ఠాకూర్
ఐఎఫ్‌ఎఫ్‌ఐ దార్శనికత.. విలువలు దాని ఇతివృత్తం
‘వసుధైవ కుటుంబకం’లో అంతర్భాగమయ్యాయి;
స్వాతంత్ర్య శతాబ్ది దాకా ఏటా అదనంగా జోడింపుతో
‘75 భవిష్యత్ సృజనాత్మక మేధస్సుల కార్యక్రమం’ కొనసాగింపు;
చిరంజీవికి ‘ఈ ఏటి మేటి భారతీయ చలనచిత్ర దిగ్గజం’ పురస్కార ప్రదానం
భారతదేశాన్ని చలనచిత్ర చిత్రీకరణ.. అనంతర కార్యకలాపాలకు అత్యంత అభిలషణీయ గమ్యంగా మార్చాలన్నదే తన స్వప్నమని కేంద్ర సమాచార-ప్రసారాలు-యువజన వ్యవహారాలు-క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఇందుకోసం మన ప్రజల, చలనచిత్ర పరిశ్రమ అగ్రగాముల-ఆవిష్కర్తల ప్రతిభ తోడ్పాటును ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గోవాలోని పణజి నగరంలో వెండితెర వేల్పులు, స్ఫూర్తిదాయక ప్రసంగాలు, అద్భుత ప్రదర్శనలతో కూడిన 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని (ఇఫి-ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఆయన ప్రారంభించారు.
ఐఎఫ్‌ఎఫ్‌ఐ విషయంలో తన స్వప్నం ఒక వేడుకకే పరిమితం కాదని, అమృత మహోత్సవాల నుంచి అమృతకాలానికి మారిన తర్వాత భారతదేశం 100వ స్వాతంత్ర్య వార్షికోత్సవం నిర్వహించుకునే నాటి ఐఎఫ్‌ఎఫ్‌ఐ స్వరూపానికి సంబంధించినదని మంత్రి వివరించారు. “ప్రాంతీయ వేడుకల సంఖ్యను పెంచడం ద్వారా భారతదేశాన్ని ముఖ్యంగా ప్రాంతీయ సినిమాల రీత్యా సారాంశ సృష్టిలో తిరుగులేని శక్తిగా రూపొందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. నైపుణ్యంగల మన యువతలోని అపార సాంకేతిక ప్రతిభను సద్వినియోగం చేసుకుంటూ భారతదేశం ప్రపంచ నిర్మాణానంతర కార్యకలాపాల కూడలిగా మారే అవకాశాలు అపారం” అని ఆయన పేర్కొన్నారు.
ఆసియాలో అత్యంత ప్రాచీనమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 1952లో ప్రారంభమైన నాటినుంచే ‘ఇఫి’ దార్శనికత, విలువలు దాని ఇతివృత్తం ‘వసుధైవ కుటుంబకం’లో అంతర్భాగంగా ఉన్నాయని శ్రీ అనురాగ్ ఠాకూర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమని శాంతియుత సహజీవన సారాన్ని ప్రబోధించే ఈ ఇతివృత్తాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. “ప్రపంచంలో భారతదేశం పాత్ర పెరుగుతుండటం, జి20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనుండటం వంటివి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో నేతృత్వంలో ‘ఒక భూమి-ఒక కుటుంబం-ఒకే భవిష్యత్తు’ ఇతివృత్తం ఈ ప్రబోధం చుట్టూ తిరుగుతున్నది” అని ఆయన పేర్కొన్నారు.
“ఈ ఏడాది భారతీయ సినిమా ప్రదర్శనల సమాహారం (గాలా ప్రీమియర్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్), అంతర్జాతీయ చిత్రాలు, ఓటీటీ వేదికల నుంచి ప్రదర్శనలుంటాయి. అలాగే ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకున్న ‘ఫౌదా’ నాలుగో సీజన్ ప్రీమియర్ కూడా ఒక భాగం. ఇక ఇజ్రాయెల్ చలనచిత్ర దిగ్గజాలు కూడా ఈసారి వేడుకలకు హాజరవుతున్నారు. ఈ ధారావాహిక తదుపరి సీజన్ కూడా ‘ఇఫి’లో ప్రారంభించబడుతుంది” అని మంత్రి చెప్పారు.
ఈ ఏడాది ‘సత్యజిత్ రే జీవన సాఫల్య పురస్కారం’ గెలుచుకున్నందుకు ప్రముఖ స్పెయిన్ చిత్ర నిర్మాత ‘కార్లోస్ సౌరా’ను మంత్రి అభినందించారు. అలాగే ‘ఈ ఏటి మేటి భారత చలనచిత్ర దిగ్గజం’ పురస్కారాన్ని తెలుగు చలనచిత్ర రంగంలో మెగాస్టార్‌గా ప్రముఖుడైన చిరంజీవికి ప్రదానం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈసారి ‘ఇఫి’లో మణిపురి చలనచిత్ర రంగం 50 సంవత్సరాల జ్ఞాపకార్థం ప్రసిద్ధ ఫీచర్, నాన్-ఫీచర్ మణిపురి చిత్రాల ప్రత్యేక ప్యాకేజీని ప్రదర్శిస్తుందని ఠాకూర్ చెప్పారు.
ఇఫి వేడుకల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న ‘ఫిల్మ్ బజార్’ ప్రాముఖ్యాన్ని శ్రీ అనురాగ్ ఠాకూర్ వివరించారు. “ఫిల్మ్ బజార్ కింద తొలిసారిగా ‘కంట్రీ పెవిలియన్’లను ఏర్పాటు చేసి, దీని పరిధిని విస్తరించింది. ఈ బజార్ 15వ సంచికలో ఏర్పాటుచేసిన 40కిపైగా పెవిలియన్ల సందర్శనకు మిమ్మల్నందర్నీ నేను ఆహ్వానిస్తున్నాను. సినిమా ప్రపంచం నుంచి సరికొత్త ఆవిష్కరణల ప్రదర్శన కోసం తొలిసారిగా ఈసారి ‘ఇఫి’లో ఒక సాంకేతిక కూడలి ఏర్పాటు చేయబడింది” అని మంత్రి వెల్లడించారు.
ఈసారి ‘ఇఫి’ వేడుకలు మరింత సార్వజనీనం, అందరికీ అందుబాటయ్యేలా దివ్యాంగులకు ప్రదర్శనల కోసం ప్రత్యేక తెరలు ఏర్పాటు చేయబడ్డాయని మంత్రి చెప్పారుర. “వారి సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విభాగంలోని చలనచిత్రాల్లో దృశ్య-శ్రవణ వివరణలు, ఉపశీర్షికలు జోడించాం. మరోవైపు విభిన్న ప్రతిభావంతుల కోసం ‘స్మార్ట్ ఫోన్ ఫిల్మ్ మేకింగ్’ (వినికిడి లోపంగలవారు) ‘స్క్రీన్ యాక్టింగ్’ (వీల్‌చైర్ వినియోగదారులకు ప్రత్యేకం) అనే రెండు ప్రత్యేక కోర్సులను ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) ప్రవేశపెట్టనుంది” అని ఆయన చెప్పారు.
***
(Release ID: 1877590)
Visitor Counter : 197