సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

19, 20 తేదీల్లో ఇండియాగేట్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు!


కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని
సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహణ

Posted On: 18 NOV 2022 2:34PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు :

  • ఇండియాగేట్ వద్ద పచ్చికబయలులో నవంబరు 19,20 తేదీల్లో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్న సంగీత నాటక అకాడమీ.
  • నవంబరు 19న చెండామేళం, కథక్ నృత్యం, తోలుబొమ్మలాట, మణిపురి నృత్యం ప్రదర్శన.
  • నవంబరు 20న, చెండామేళం, తోలుబొమ్మలాట, మణిపురి నాట్యంతో పాటుగా, ఒడిస్సీ నృత్యం, కథక్ నృత్యం ప్రదర్శన.
  • నవంబరు 19న, సాయంత్రం 6గంటలకు ప్రదర్శనలు ప్రారంభం.

 

    న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద పచ్చిక బయలులో 2022, నవంబర్ 19, 20 తేదీలలో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సంగీత నాటక అకాడమీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

  నవంబర్ 19వ తేదీన జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా, చెండా మేళం, కథక్ నృత్యం, తోలు బొమ్మలాట, మణిపురి నాట్యం,.. నవంబర్ 20న ఒడిస్సీ నృత్యం, కథక్ నృత్యం  ప్రదర్శించనున్నారు. నవంబర్ 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

   నవంబర్ 19 మరియు 20 తేదీలలో ఢిల్లీ పంచవాద్య ట్రస్ట్ ఆధ్వర్యంలో చెండా మేళం ప్రదర్శించబడుతుంది. పంచారీమేళం అనేది కేరళలోని ఆలయ ఉత్సవాల సమయంలో నిర్వహించే ఒక బ్యాండుమేళం ప్రదర్శన. చెండా మేళం (సామూహిక డ్రమ్)కు చెందిన ప్రధాన కళారూపాలలో పంచారీ మేళం(పంచారీ) కూడా ఒకటి. ఇది క్షేత్రవాద్యం (ఆలయ బ్యాండుమేళం) శైలిలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాద్యవిశేషం. అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపం. పంచారీ మేళం, చెండ, ఇలతాళం , బేస్ చెండ (వలంతల) వంటి వాయిద్యాలతో కూడిన ప్రదర్శన మధ్య కేరళలోని అనేక ఆలయాల ఉత్సవాల్లో, వేడుకల్లో ప్రదర్శిస్తారు. ఇక్కడ అత్యంత సాంప్రదాయ పద్ధతిలో ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తారు. ఉత్తర కేరళ (మలబార్), దక్షిణ-మధ్య కేరళ (కొచ్చి)లో సూక్ష్మమైన ప్రాంతీయ భేదంతో పంచారీ కళారూపాన్ని సాంప్రదాయబద్ధంగా ప్రదర్శిస్తూ ఉంటారు.

   సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కలాశిష్ సంస్థకు చెందిన విద్యార్థులు కథక్ నృత్యం ప్రదర్శిస్తారు. రాగ్‌భోపాలీ, తీన్‌తాళ్‌లో,  ఓం నమఃశివాయ అనే కళారూపాన్ని వారు ప్రదర్శిస్తారు, ఆ తర్వాత ద్రుత్తెంతాళ్,  రాగ్‌జన్‌సన్మోహినీ పద్ధతిలో పండిట్ విజయ్‌శంకర్,  రూపకల్పన చేసిన చేసిన తరానా కళారూపాన్ని ప్రదర్శిస్తారు. ప్రస్తుత ప్రదర్శనకు కొరియో గ్రాఫర్‌గా అసావరీ పవార్ వ్యవహరిస్తారు. నవంబర్ 19వ తేదీన మహ్మద్ షమీమ్ బృందం ఆధ్వర్యంలో, నవంబర్ 20న కాలాబాజ్ బృందం ఆధ్వర్యంలో తోలుబొమ్మలాట ప్రదర్శనలు నిర్వహిస్తారు. మణిపురి నృత్యాన్ని పంథోయిబి జాగోయ్‌ మరూప్,  ఒడిస్సీ నృత్యరూపాన్ని సంచారి ఫౌండేషన్ సభ్యులు నిర్వహిస్తారు. నవంబర్ 20న రుద్రాక్ష్ కథక్ నృత్య ప్రదర్శన ఉంటుంది.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022,సెప్టెంబరు 8వ తేదీన సెంట్రల్ వెస్టా ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత, మహాత్మా గాంధీ, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, రాజా రామ్ మోహన్ రాయ్ స్మారకార్థం కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల నుంచి, మహిళా సాధికారత, సైబర్ నేరాల నిరోధం వరకు అనేక సామాజిక సమస్యలు, అంశాల ప్రాతిపదిగగా ఈ కార్యక్రమాలను రూపొందించారు. సందర్శకులు ఎవరైనా ఈ కార్యక్రమాలకు ఉచితంగా హాజరు కావచ్చు. ఈ కార్యక్రమాల ద్వారా నవ భారతదేశం అభివృద్ధిని గురించి సందర్శకులు తెలుసుకోవచ్చు.

****


(Release ID: 1877023) Visitor Counter : 168