ఆర్థిక మంత్రిత్వ శాఖ
కర్ణాటకలో ఆదాయపు పన్ను విభాగం సోదాలు
Posted On:
18 NOV 2022 8:59AM by PIB Hyderabad
వివిధ స్థిరాస్తి సంస్థలతో ఉమ్మడి అభివృద్ధి ఒప్పందాలు (జేడీఏలు) చేసుకుని, భారీగా లాభాలు సంపాదించి, వాటికి లెక్కలు చెప్పని కొందరు వ్యక్తుల నివాసాల్లో ఆదాయపు పన్ను విభాగం తనిఖీలు నిర్వహించింది. 20.10.2022, 02.11.2022 తేదీల్లో సోదాలు, స్వాధీనాలు జరిగాయి. బెంగళూరు, ముంబై, గోవాలోని 50కి పైగా ప్రదేశాల్లో సోదాలు జరిగాయి.
భౌతిక పత్రాలు, డిజిటల్ రూపంలో నేర నిర్ధరణ సాక్ష్యాలను తనిఖీల సమయంలో అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. విక్రయ ఒప్పందాలు, అభివృద్ధి ఒప్పందాలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు (ఓసీ) సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. జేడీఏల ద్వారా వివిధ అభివృద్ధి సంస్థలకు భూమిని బదిలీ చేయడం వల్ల వచ్చిన మూలధన లాభాలను, అధికారులు ఓసీలు జారీ చేసిన తర్వాత కూడా భూ యజమానులు వెల్లడించలేదని ఈ సాక్ష్యాల్లో వెల్లడైంది.
భూమి కొనుగోలు మొత్తం, ఇతర ఖర్చులను కృత్రిమంగా పెంచడం ద్వారా మూలధన లాభాలను తగ్గించి చూపడం, బదిలీ చేసిన భూమికి సంబంధించిన పూర్తి విలువను వెల్లడించకపోవడం వంటి సంఘటనలు అనేక సందర్భాల్లో జరుగుతున్నాయి. మూలధన లాభాలు ఆర్జించినా కూడా కొంతమంది భూ యజమానులు ఆదాయ పన్ను పత్రాలను కూడా దాఖలు చేయట్లేదని వెల్లడైంది. అధికారుల విచారణ ఎదుర్కొన్నప్పుడు సంబంధిత మదింపుదారులు తమ తప్పులను అంగీకరించారు. ఆర్జించిన మూలధన లాభాలను వెల్లడించడానికి, పన్నులు చెల్లించడానికి అంగీకరించారు.
లెక్కల్లో చూపని రూ.1300 కోట్ల ఆదాయాన్ని ఇప్పటివరకు జరిపిన సోదాల్లో ఆదాయ పన్ను అధికారులు గుర్తించారు. ఇంకా, అక్రమంగా దాచిన రూ.24 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
సేకరించిన సాక్ష్యాల మీద విచారణలు కొనసాగుతున్నాయి.
****
(Release ID: 1876982)
Visitor Counter : 146