వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కంటెంట్ విష‌యంలో మీడియా, ఎంట‌ర్ టైన్ మెంట్ ప‌రిశ్ర‌మ స్వ‌యం నియంత్ర‌ణ‌లు రూపొందించుకోవాల‌ని శ్రీ పీయూష్ గోయెల్ పిలుపు; స్వ‌యం నియంత్ర‌ణ‌లు రూపొందించుకోక‌పోతే స‌మాజం ప్ర‌భుత్వ జోక్యం కోరుతుంద‌ని వెల్ల‌డి


కంటెంట్ సృష్టిక‌ర్త‌ల ప్ర‌పంచం అయ్యే సామ‌ర్థ్యం భార‌త‌దేశానికి ఉంది : శ్రీ పీయూష్ గోయెల్‌వృద్ధికి దోహ‌ద‌కారి కావ‌డం కోసం మీడియా, ఎంట‌ర్ టైన్ మెంట్ రంగానికి చెందిన చ‌ట్టాల‌న్నీ స‌మ‌కాలీనం కావ‌ల‌సి ఉంది : శ్రీ పీయూష్ గోయెల్‌

సింగిల్ విండో వ్య‌వ‌స్థ ద్వారా ఉత్ప‌త్తికి అనుమ‌తులిచ్చే విధంగా వ్య‌వ‌స్థ స‌ర‌ళ‌త‌రం కావాలి : శ్రీ పీయూష్ గోయెల్‌

స‌రికొత్త వినోద మార్గాలైన‌ గేమింగ్‌, బెట్టింగ్ విభాగాల ద్వారా ఏ విధమైన వినోదాన్ని అనుమ‌తించ‌వ‌చ్చు అనే అంశంలో ప‌రిశ్ర‌మ ఆత్మ‌శోధ‌న చేసుకోవాల‌ని మంత్రి సూచ‌న

Posted On: 17 NOV 2022 4:58PM by PIB Hyderabad

కంటెంట్ విష‌యంలో మీడియా, ఎంట‌ర్ టైన్ మెంట్ రంగానికి క‌నీసం ఏదో ఒక స్థాయి స్వ‌యం నియంత్ర‌ణ పాటించాల‌ని కేంద్ర వాణిజ్య‌-ప‌రిశ్ర‌మ‌లు;  వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు;  ఆహారం-ప్ర‌భుత్వ పంపిణీ వ్య‌వ‌స్థ;  టెక్స్ టైల్స్ శాఖ‌ల మంత్రి శ్రీ పీయూష్  గోయెల్ పిలుపు ఇచ్చారు. న్యూఢిల్లీలో జ‌రిగిన సిఐఐ 11వ‌ బిగ్ పిక్చ‌ర్ స‌మ్మేళ‌నం ముగింపు స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

“ఒక ప‌క్క మ‌నం భార‌తీయ సంస్కృతి, వార‌స‌త్వం, స‌మున్న‌త సాంప్ర‌దాయాలు, మ‌న కుటుంబ వ్య‌వ‌స్థ విలువ‌లు గురించి మాట్లాడుతూనే ఉంటే మ‌రోప‌క్క భార‌తీయ సాంస్కృతిక నియ‌మావ‌ళికి అతీత‌మైన కార్య‌క్ర‌మాలు మ‌న టెలివిజ‌న్‌, ఒటిటి విభాగాల్లో ప్ర‌సారం కావ‌డం చూస్తున్నాం” అని మంత్రి అన్నారు.

కంటెంట్ ను ఆధునికంగాను, అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే రీతిలోను, వినోదాత్మ‌కంగాను అందించ‌డం హ‌ర్ష‌ణీయ‌మే అయినా భార‌తీయ కుటుంబ వ్య‌వ‌స్థ‌, భార‌తీయ సంస్కృతి ఆమోదించ‌గ‌ల విధంగా హుందాగా అందించే అంశంపై ప‌రిశ్ర‌మ పెద్ద‌లు దృష్టి సారించాల‌ని ఆయ‌న సూచించారు. ఈ కార్య‌క్ర‌మాల ద్వారా అందించే సందేశం ఏదీ భార‌త‌దేశ వాస్త‌వ ప‌రిస్థితుల‌తో అనుసంధానం కోల్పోకుండా  ఉండేలా చూడాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

గేమింగ్ వంటి వినూత్న‌మైన వినోద  సాధ‌నంలో ఏ ర‌క‌మైన బెట్టింగ్ వేదిక‌లు, ఇత‌ర అంశాలు వినియోగించుకునేందుకు యువ‌త‌ను అనుమ‌తించ‌గ‌లం అనే విష‌యంలో ప‌రిశ్ర‌మ ఆత్మావ‌లోక‌నం చేసుకోవాల‌ని మంత్రి పిలుపు ఇచ్చారు. ఈ కొత్త ర‌కం వినోద విభాగాలు మ‌న సంస్కృతిని దెబ్బ తీయ‌కుండా ఉండేలా స‌మ‌తూకం పాటించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు.

మీడియా, ఎంట‌ర్ టైన్ మెంట్ విభాగం భార‌త‌దేశానికి అద్భుత అవ‌కాశాలు అందిస్తోందంటూ మొత్తం ప‌రిశ్ర‌మ‌, దానికి సంబంధించిన విభాగాలు, అందులో ప‌ని చేసే వారు ఒక్క‌టై ఆలోచ‌నాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి త‌మ మ‌ధ్య గ‌ల బ‌లాబ‌లాల‌ను స‌మీక‌రించుకున్న‌ప్పుడే ఆ సామ‌ర్థ్యం పూర్తిగా వినియోగించుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని శ్రీ గోయెల్ అన్నారు. మ‌హ‌మ్మారి విస్త‌రించి క‌ల్లోలం సృష్టించిన కాలంలోవిశ్వ‌స‌నీయం, నాణ్య‌మైన వార్తాంశాలు, వినోదాంశాలు అందిస్తూ పౌరులంద‌రినీ అనుసంధాన‌త క‌లిగి ఉండేలా, స‌మాచారం వారికి స‌కాలంలో అందేలా, వినోదం పొందేలా చేయ‌డం కోసం ప‌రిశ్ర‌మ చేసిన కృషిని ఆయ‌న ప్ర‌శంసించారు.

మీడియా, ఎంట‌ర్ టైన్ మెంట్ రంగం మంచి వృద్ధి అవ‌కాశాలు గ‌ల రంగ‌మ‌ని మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌రిశ్ర‌మ అద్భుత‌మైన, వేగ‌వంత‌మైన వృద్ధిని సాధిస్తున్న‌దంటూ మ‌రింత భారీ ల‌క్ష్యాలు సాధించ‌డంపై దృష్టి సారించాల‌ని పిలుపు ఇచ్చారు. అద్భుత‌మైన డిజిట‌ల్ అనుసంధాన‌త‌, సాంకేతికంగా నిపుణులైన యువతీ యువ‌కులు ఈ రంగానికి అపార‌మైన వ‌న‌రు అని ప్ర‌శంసిస్తూ 5జి రాక‌తో అనుసంధాన‌త మ‌రింత పెరుగుతుంద‌న్నారు. మీడియా, ఎంట‌ర్ టైన్ మెంట్ ప‌రిశ్ర‌మ‌కు భార‌త‌దేశం అతి పెద్ద మార్కెట్ అని పేర్కొంటూ ఈ రంగం దిశ‌ను మార్చ‌గ‌ల స్థాయికి చేరేందుకు మ‌నం ఇంకా ఎంతో దూరం ప్ర‌యాణించాల్సి ఉన్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. ప‌రిశ్ర‌మ‌ను మ‌రింత విస్త‌రించేందుకు, విస్త‌ర‌ణ ప్ర‌యోజ‌నాలు అందుకునేందుకు సాంప్ర‌దాయిక ఆలోచ‌నా ధోర‌ణికి అతీత‌మైన కొత్త ఆలోచ‌న‌లు చేయాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు.

మ‌న న్యాయ విభాగాన్ని కూడా మ‌రింత పోటీ సామ‌ర్థ్యం గ‌ల‌దిగా తీర్చిదిద్దాల‌ని శ్రీ గోయెల్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సూచిస్తున్న విధంగా మ‌నం వ‌ల‌స‌వాద కాలం నాటి ఆలోచ‌నా ధోర‌ణుల నుంచి బ‌య‌ట‌ప‌డి కాలం చెల్లిపోయిన చ‌ట్టాల‌ను తొల‌గించాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మీడియా ప‌రిశ్ర‌మ వాస్త‌వ వృద్ధికి దోహ‌ద‌ప‌డుతూ రోజువారీ కార్య‌క‌లాపాలు స ర‌ళ‌త‌రం చేయ‌గ‌ల చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న విష‌యంలో మీడియా ప‌రిశ్ర‌మ‌తో చ‌ర్చిస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.

దేశంలో షూటింగ్ ల‌కు సింగిల్ విండో విధానం ద్వారా అనుమ‌తులు మంజూరు చేసే అంశం స‌హా వివిధ అంశాల్లో  స‌ర‌ళ‌త‌ర‌మైన వాతావ‌ర‌ణ క‌ల్ప‌న‌కు కృషి చేస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు చెందిన‌ కంపెనీలలు భార‌త మీడియా రంగంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అనుమ‌తిస్తూ ఎఫ్ డిఐ నిబంధ‌న‌లు ఇప్ప‌టికే స‌ర‌ళం చేసిన విష‌యం ఆయ‌న గుర్తు చేశారు. భార‌త‌దేశంలో సృజ‌నాత్మ‌క‌త చేసేందుకు వీలుగా అంత‌ర్జాతీయ క‌ళాకారులకు ఎర్ర తివాచీ వేసే దిశ‌గా ప్ర‌య‌త్నాల‌న్నీ సాగాల‌ని ఆయ‌న అన్నారు.

ఏవి అత్యంత విలువైన అంశాలు గుర్తించేందుకు కృషి చేయాల‌ని ఆయ‌న ప‌రిశ్ర‌మకు పిలుపు ఇచ్చారు. మ‌రింత త‌క్కువ వ్య‌యాల‌తో భార‌త‌దేశంలో కంటెంట్ త‌యారుచేసేందుకు కృషి చేయాలని సూచించారు.  ప్ర‌పంచానికి కంటెంట్ సృష్టిక‌ర్త‌ల కేంద్రం కాగ‌ల సామ‌ర్థ్యం భార‌త‌దేశానికి ఉన్న‌ద‌న్నారు. “ప్ర‌పంచానికి  కావ‌ల‌సిన కంటెంట్ ను భార‌త‌దేశంలో త‌యారుచేయండి” అని ప‌రిశ్ర‌మ‌కు పిలుపు ఇచ్చారు.

మ‌న వినోద సాధ‌నాల‌ను ప్ర‌పంచ స్థాయికి తీసుకువెళ్లాల్సిన బాధ్య‌త ఉన్న‌ద‌ని నొక్కి చెబుతూ విజువ‌ల్ ఎఫెక్ట్స్, యానిమేష‌న్ మ‌రింత మెరుగుప‌రిచే కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానాలు, ప‌రిక‌రాలు దేశంలోకి తీసుకురావాల్సిన అవ‌సరం ఉన్న‌ద‌న్నారు. క‌థ‌లు చెప్ప‌డంలో న‌వ్య‌త బాట ప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉన్న‌దంటూ భార‌త‌దేశం చ‌రిత్ర‌, సంస్కృతి, సాంప్ర‌దాయాల నుంచి స్ఫూర్తిపొంది వాటిని ప్ర‌పంచ య‌వ‌నిక పైకి తీసుకెళ్లాల‌ని మంత్రి సూచించారు. ఎంట‌ర్ టైన్ ప‌రిశ్ర‌మ‌కు ఉపాధి క‌ల్ప‌న సామ‌ర్థ్యాలు కూడా ఉన్నాయంటూ నైపుణ్యాల వృద్ధి, విద్యా కోర్సుల రూప‌క‌ల్ప‌న‌కు కృషి చేయాల‌ని పిలుపు ఇచ్చారు. ఈ రంగంలో ప‌ని చేసే వారు విజ‌య‌గాథ‌లో భాగ‌స్వాములు కావాలంటే చ‌క్క‌ని వేత‌నాలు, సామాజిక భ‌ద్ర‌త‌, ఆరోగ్య సంర‌క్ష‌ణ వ‌స‌తులు క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు.

వీలైనంత వ‌ర‌కు ఈ రంగంలోని వారు ప్ర‌భుత్వంపై ఆధార‌ప‌డ‌కుండా స్వ‌తంత్రంగా కృషి చేసేందుకు ప్ర‌య‌త్నించాలంటూ వారికి అన్ని విధాల మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి, ఈ రంగం మ‌రింత ఉత్త‌మ‌మైన ప‌నితీరు ప్ర‌ద‌ర్శించేందుకు త‌గు ప్రోత్సాహం క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ద‌ని మంత్రి హామీ ఇచ్చారు. “ఈ రంగం అభివృద్ధి కోసం ప్రైవేటు రంగం, ప్ర‌భుత్వం భాగ‌స్వామ్య స్ఫూర్తితో ప‌ని చేయాలి” అన్నారు. భార‌త ప్ర‌తిభాశ‌క్తిని సంపూర్ణంగా వినియోగించుకునేందుకు, త‌ద్వారా మ‌న పోటీ సామ‌ర్థ్యం, నాణ్య‌త మెరుగుప‌రిచి ప్ర‌పంచ మార్కెట్ అవ‌కాశాలు అందిపుచ్చుకునేందుకు ప‌రిశ్ర‌మ కృషి చేయాల‌ని మంత్రి సూచించారు.

బ్రాడ్ కాస్టింగ్ పై సిఐఐ రూపొందించిన రెండు నివేదిక‌ల‌ను మంత్రి విడుద‌ల చేశారు. కేంద్ర‌స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ అపూర్వ‌చంద్ర‌, ఇత‌ర ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1876979) Visitor Counter : 121