ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 5వ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్ ) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం


ఎన్ఐఐఎఫ్ మెజారిటీ వాటా కలిగిన రెండు ఇన్‌ఫ్రా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్ బీ ఎఫ్ సీ), ఏర్పాటు కావడంతో మొండి బకాయిలు లేకుండా 3 సంవత్సరాల కాలంలో 4,200 కోట్ల నుంచి 26,000 కోట్లకు చేరిన ఉమ్మడి రుణ పరపతి సౌకర్యం

Posted On: 17 NOV 2022 4:17PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నిన్న( 2002 నవంబర్ 17) రాత్రి 5వ  నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్ ) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. 

పెట్టుబడిదారులు విశ్వాసం చూపించడంతో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్ ) విశ్వసనీయమైన పెట్టుబడి వేదికగా అభివృద్ధి చెందిందని గవర్నింగ్ కౌన్సిల్ అభిప్రాయపడింది. ఎన్ఐఐఎఫ్ నిధుల్లో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన పెట్టుబడిదారుల తో సహా భారత ప్రభుత్వం కూడా పెట్టుబడి పెట్టింది. 

భారత ప్రభుత్వం, జపాన్ దేశానికి చెందిన  జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ 

(జేబీఐసీ) ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ద్వారా  మొదటి ద్వైపాక్షిక నిధి "ఇండియా జపాన్ ఫండ్" ఏర్పాటయింది. 2022 నవంబర్ 2న రెండు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి.జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ తో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్ ) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది.  ఎన్ఐఐఎఫ్ మెజారిటీ వాటా కలిగిన   రెండు ఇన్‌ఫ్రా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్ బీ ఎఫ్ సీ), ఏర్పాటు కావడంతో మొండి బకాయిలు  లేకుండా 3 సంవత్సరాల కాలంలో 4,200 కోట్ల నుంచి 26,000 కోట్లకు చేరిన ఉమ్మడి రుణ పరపతి సౌకర్యం కల్పించడం పట్ల సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. 

పెట్టుబడులకు అవకాశం ఉన్న పీపీపీ ప్రాజెక్టులను గుర్తించి, పెట్టుబడుల సమీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు అందించేందుకు సలహా కార్యకలాపాలు ప్రారంభించాలని  ఎన్ఐఐఎఫ్ కి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం సూచించింది. 

ఇప్పటివరకు పూర్తి చేసిన కార్యక్రమాలను ఆధారంగా చేసుకుని భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను ఎన్ఐఐఎఫ్ పరిశీలించాలని శ్రీమతి నిర్మలా సీతారామన్ సూచించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్న పెట్టుబడిదారులతో ఎన్ఐఐఎఫ్  చర్చలు జరపాలని ఆమె సలహా ఇచ్చారు. 

మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అమలు జరుగుతున్న పీఎం గతిశక్తి, జాతీయ మౌలిక సదుపాయాల నడవాలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై ఎన్ఐఐఎఫ్ దృష్టి సారించాలని ఆర్థిక మంత్రి సూచించారు. ఈ రంగాల్లో అమలు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ మరియు బ్రౌన్‌ఫీల్డ్ పెట్టుబడి ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉందని మంత్రి వివరించారు. ఈ రంగాల్లో వాణిజ్య పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం ఉందని శ్రీమతి సీతారామన్ తెలిపారు. 

గత కొన్ని సంవత్సరాల కాలంలో ఎన్ఐఐఎఫ్ సాధించిన ప్రగతి, పెట్టుబడుల రంగంలో గుర్తించిన అంశాలను గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం చర్చించింది. ప్రస్తుతం మాస్టర్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FoF), మరియు వ్యూహాత్మక అవకాశాల నిధి (SoF) పేరిట  ఎన్ఐఐఎఫ్ మూడు  ఫండ్‌లను నిర్వహిస్తున్నది. ఈ మూడు ఫండ్‌ల తాజా స్థితిని  గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం సమీక్షించింది. నిధుల సమీకరణ,పెడుతున్న  పెట్టుబడుల వివరాలను  సమావేశం పరిశీలించింది. రేవులు, రవాణా,  పునరుత్పాదక ఇంధనం మరియు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలలో ప్రస్తుతం  ఎన్ఐఐఎఫ్ పెట్టుబడులు పెడుతున్నది. వీటికి అదనంగా వ్యర్ధాల నిర్వహణ, జల వనరుల శుద్ధి, ఆరోగ్య రంగం, ఈవి ఉత్పత్తి లాంటి రంగాలకు తన కార్యకలాపాలు విస్తరించడానికి గల అవకాశాలను   ఎన్ఐఐఎఫ్ పరిశీలిస్తోంది.ఈ అంశాలు గవర్నింగ్ కౌన్సిల్ పరిశీలనకు వచ్చాయి. 

సమావేశానికి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి శ్రీ వివేక్ జోషి, డీఎస్పీ గ్రూప్ చైర్మన్ శ్రీ మహేంద్ర కొఠారి, భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ శ్రీ దినేష్ ఖారా మణిపాల్ గ్లోబల్ సంస్థ చైర్మన్ శ్రీ టి.వి.మోహన్ దాస్ పాయ్ హాజరయ్యారు.   

 

***



(Release ID: 1876937) Visitor Counter : 139