రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఉత్తరాఖండ్‌లో ప్రారంభం కానున్న భారత్‌-అమెరికా సంయుక్త శిక్షణ విన్యాసాలు “యుద్ధ్ అభ్యాస్ 2022”

Posted On: 15 NOV 2022 12:23PM by PIB Hyderabad

18వ దఫా భారత్‌-అమెరికా సంయుక్త శిక్షణ విన్యాసాలు “యుద్ధ్ అభ్యాస్ 22” ఈ నెలలో ఉత్తరాఖండ్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏటా జరుగుతుంది. రెండు దేశాల సైన్యాల మధ్య అత్యుత్తమ పద్ధతులు, వ్యూహాలు, సాంకేతికతలు, విధానాలను పరస్పరం మార్చుకునే లక్ష్యంతో “యుద్ధ్ అభ్యాస్” చేపడుతున్నారు. 2021 అక్టోబర్‌లో, అలస్కాలోని ఎల్మెండోర్ఫ్ రిచర్డ్‌సన్ జాయింట్‌ బేస్‌లో గత దఫా విన్యాసాలు జరిగాయి.

11వ ఎయిర్‌బోర్న్‌ డివిజన్‌లోని 2వ బ్రిగేడ్‌కు చెందిన అమెరికా సైనికులు, అస్సాం రెజిమెంట్‌కు చెందిన భారత సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 7వ అధ్యాయం ప్రకారం శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. శాంతి పరిరక్షణ, అమలుకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు రెండు దేశాల సైనికులు కలిసి పని చేస్తారు. మానవత సాయం, విపత్తు ఉపశమన (హెచ్‌ఏఆర్‌డీ) కార్యకలాపాలు కూడా ఈ శిక్షణలో భాగం. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణం స్పందించి, వెంటనే సహాయక చర్యలను చేపట్టే శిక్షణలో రెండు దేశాల సైనిక దళాలు పాల్గొంటాయి.

రెండు దేశాల సైన్యాల వృత్తిపర నైపుణ్యాలు, అనుభవాల నుంచి పూర్తి ప్రయోజనం పొందేలా ఎంచుకున్న అంశాల మీద శిక్షణ విన్యాసాలు, నిపుణుల చర్చలు (ఈఏడీ) ఉంటాయి. సమీకృత యుద్ధ దళాల గుర్తింపు, నిఘా వ్యవస్థల ఏర్పాటు & పనితీరు, రవాణా, పర్వత యుద్ధ నైపుణ్యాలు, క్షతగాత్రుల తరలింపు, కఠిన భూ భాగాలు & పరిస్థితుల్లో యుద్ధ వైద్య సహాయం వంటివి క్షేత్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఉన్నాయి. యుద్ధ ఇంజినీరింగ్, యూఎస్‌ఏ ప్రతిదాడి వ్యూహాలు, సమాచార కార్యకలాపాలు సహా పోరాట నైపుణ్యాల మార్పిడి, విన్యాసాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి.

రెండు సైన్యాలు తమ విస్తృత అనుభవాలు, నైపుణ్యాలను పంచుకోవడానికి, సమాచార మార్పిడి ద్వారా వారి సాంకేతికతను మెరుగుపరచుకోవడానికి ఈ శిక్షణ కార్యక్రమం దోహదపడుతుంది.

_______



(Release ID: 1876099) Visitor Counter : 236