ప్రధాన మంత్రి కార్యాలయం
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భారతదేశ జి-20 అధ్యక్షత థీమ్, వెబ్ సైట్, లోగోలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి
“జి-20 లోగోలో సార్వత్రిక సౌభ్రాతృత్వ భావం ప్రతిబింబిస్తుంది”
“జి-20 లోగోలోని తామర పూవు ప్రస్తుత కష్టకాలంలో ఆశకు ప్రతిబింబం”
“భారతదేశానికి జి-20 అధ్యక్షత ఒక దౌత్యపరమైన బాధ్యత కాదు...భారతదేశంపై ప్రపంచానికి గల విశ్వాసానికి ఒక చిహ్నం, కొత్త బాధ్యత”
“మనం ఎప్పుడైనా సొంత పురోగతి కోసం పాటు పడుతున్నట్టయితే ప్రపంచ పురోగతి కూడా దృష్టికోణంలో ఉంటుంది”
“మాకు పర్యావరణం ప్రపంచం కోసం చేసే పోరాటం, వ్యక్తిగత బాధ్యత”
“అగ్ర ప్రపంచం, వర్థమాన ప్రపంచం అంటూ ప్రాధాన్యత ఏదీ లేని అంతా ఒక్కటే అయిన ప్రపంచం ఆవిష్కారం మా ప్రయత్నం”
“మా జి-20 మంత్రం ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు”
“జి-20 ఢిల్లీకి లేదా కొన్ని ప్రదేశాలకే పరిమితం కాదు. ప్రతీ ఒక్క పౌరుడు, రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీ అందులో భాగస్వామి కావాలి”
Posted On:
08 NOV 2022 6:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశ జి-20 అధ్యక్ష లోగో, థీమ్, వెబ్ సైట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 2022 డిసెంబర్ 1 నుంచి భారతదేశం జి20 అధ్యక్ష పగ్గాలు చేపడుతుందని చెప్పారు. భారతదేశానికి ఇది చారిత్రక అవకాశమన్నారు. ప్రపంచ జిడిపిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు ప్రాతినిథ్యం గల దేశాల అంతర్జాతీయ ప్రీమియం ఆర్థిక సహకార కూటమి జి-20 అని ఆయన చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్న సంవత్సరంలోనే భారతదేశం జి-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం చిరస్మరణీయమైన సందర్భమని ప్రధానమంత్రి చెప్పారు. జి-20కి సంబంధించిన కార్యకలాపాలు, సంబంధిత సంఘటనలపట్ల ఆసక్తి పెరుగుతూ ఉండడం పట్ల ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు.
జి-20 లోగో ఆవిష్కరణలో పౌరుల పాత్ర గురించి ప్రస్తావిస్తూ వారి నుంచి లోగోకు సంబంధించి వేలాది సృజనాత్మక ఆలోచనలు ప్రభుత్వానికి అందాయని ప్రధానమంత్రి చెప్పారు. చక్కని మద్దతు అందించినందుకు ప్రతీ ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు చెబుతూ ఆ సలహాలన్నీ ప్రపంచ సంఘటనకు ముఖచిత్రంగా మారాయని ప్రధానమంత్రి తెలిపారు. జి-20 లోగా ఇతర లోగోల వంటిది కాదని అది ఒక సందేశమని, భారతదేశానికి సంబంధించిన ప్రతీ ఒక్క నాడిలోను ప్రవహించే భావమని అన్నారు. “అందరికీ “వసుధైవ కుటుంబకం” సిద్ధాంతం పట్ల గల విశ్వాసం” అది అని ఆయన చెప్పారు. జి-20 లోగో సార్వత్రిక సౌభ్రాతృత్వ ఆలోచనకు ప్రతిబింబమని చెప్పారు.
ఈ లోగోలోని కమలం భారత ప్రాచీన సాంస్కృతిక వారసత్వం, విశ్వాసం, ఆలోచనకు సంకేతమని ఆయన తెలిపారు. ప్రాణికోటి అంతా ఒకటేనన్నది అద్వైత సిద్ధాంతమని, నేటి పలు సంఘర్షణలకు అదే పరిష్కార మాధ్యమం అని ప్రధానమంత్రి చెప్పారు. ఈ లోగో భారతదేశం నుంచి అనేక కీలక సందేశాలు అందిస్తుందని అన్నారు. “బుద్ధుని నుంచి యుద్ధ విముఖత, మహాత్మాగాంధీ నుంచి దౌర్జన్యకాండ వ్యతిరేక పరిష్కారాలు అందించే సందేశం అది. జి-20 ద్వారా భారతదేశం ఆ సిద్ధాంతాలను మరింత సమున్నత శిఖరాలకు చేర్చుతుంది” అని చెప్పారు.
సంక్షోభాలు, గందరగోళాల నడుమ జి-20 అధ్యక్ష బాధ్యత భారతదేశానికి అందుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఒక్కో శతాబ్దిలో ఒక సారి మాత్రమే వచ్చే విచ్ఛినకారకమైన మహమ్మారి, సంఘర్షణలు, ఆర్థిక అస్థిరతల ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొని పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రపంచం అంతా కృషి చేస్తున్నదని ఆయన నొక్కి చెప్పారు. “ఇలాంటి వాతావరణంలో ఆశకు సంకేతం జి-20 లోగోలోని కమలం” అన్నారు. ప్రపంచం తీవ్ర సంక్షోభంలో పడినప్పటికీ దాన్ని మెరుగైనదిగా తీర్చి దిద్దేందుకు మనం ఇప్పటికీ కృషి చేయవచ్చునని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశ సంస్కృతి గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ జ్ఞానానికి, సంపదకు అధిదేవతలు కమల పుష్పం పైనే కూచుని ఉంటారని చెప్పారు. అలాగే కమలంలో ఉన్న భూగోళాన్ని చూపిస్తూ మేథో భాగస్వామ్యం సంక్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడే శక్తిని, సంపద భాగస్వామ్యం సమాజంలోని చిట్టచివరి వరకు చేరగల సామర్థ్యాన్ని మనకి అందిస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. కమలానికి గల ఏడు దళాలు ఏడు ఉపఖండాలు, ఏడు సార్వత్రిక సంగీత స్వరాలకు ప్రతిబింబమని వివరించారు. “సప్తస్వరాలు కలిసినట్టయితే చక్కని సామరస్యం ఏర్పడుతుంది” అని ఆయన చెప్పారు. భిన్నత్వానికి ప్రాతినిథ్యం వహిస్తూనే సామరస్యంగా ప్రపంచం కలిసికట్టుగా ఉండాలన్నది జి-20 సిద్ధాంతమని శ్రీ మోదీ అన్నారు.
ఈ శిఖరాగ్రం కేవలం ఒక దౌత్య సమావేశం కానేకాదని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం భారతదేశాన్ని విశ్వసిస్తున్నందు వల్ల భారతదేశం దాన్ని ఒక కొత్త బాధ్యతగ చేపడుతున్నదని చెప్పారు. “భారతదేశం గురించి తెలుసుకోవాలి, అర్ధం చేసుకోవాలి అనే గతంలో ఎన్నడూ కనివిని ఎరుగని ఉత్సుకత నేడు ప్రపంచంలో కనిపిస్తోంది. నేడు భారతదేశాన్ని కొత్త వెలుగులో అధ్యయనం చేస్తున్నారు. మన వర్తమాన విజయాలను మదింపు చేస్తూ మన భవిష్యత్తు పట్ల అసాధారణమైన ఆశలు వెలువరిస్తున్నారు” అని ప్రధానమంత్రి చెప్పారు. “ఇలాంటి వాతావరణంలో ఆ అంచనాలకు మించి పని చేయాల్సిన; భారతదేశ సమర్థత, సిద్ధాంతం, సామాజిక, మేథో బలం గురించి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత పౌరులపై ఉంది” అన్నారు. “మనం ప్రతీ ఒక్కరిలోనూ శక్తిని నింపాలి. ప్రపంచం పట్ల వారికి గల బాధ్యత గుర్తెరిగేలా చేయాలి” అని సూచించారు.
నేడు భారతదేశం ఈ స్థాయికి చేరడం వెనుక వేలాది సంవత్సరాల ప్రయాణం ఉందని శ్రీ మోదీ చెప్పారు. “ప్రపంచ చరిత్రలో మహోజ్వల స్థితిని మనం పొందాం, అత్యంత అంధకారాన్ని కూడా చవి చూశాం. ఎందరో దురాక్రమణదారులు, వారి దౌర్జన్యకాండ అనుభవించి భారతదేశం ఈ స్థాయికి చేరుకుంది. నేడు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఆ అనుభవాలన్నీ పెద్ద బలంగా నిలుస్తాయి. స్వాతంత్ర్యానంతరం జీరో స్థాయి నుంచి అత్యున్నత స్థానమే గురిగా అతి పెద్ద ప్రయాణం ప్రారంభించాం. గత 75 సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వాలు చేసిన కృషి ఇందులో ఉంది. అన్ని ప్రభుత్వాలు, పౌరులు భారతదేశాన్ని తనదైన బాటలో ముందుకు నడిపించేందుకు కలిసికట్టుగా కృషి చేశారు. ఇదే స్ఫూర్తితో నేడు మనం కొత్త శక్తితో ప్రపంచాన్ని కూడగట్టుకుని ముందడుగేయాలి” అని చెప్పారు.
మనం మన పురోగతికి కృషి చేస్తూనే ప్రపంచ పురోగతిని కూడా కాంక్షిస్తాం అన్నది భారతీయ సంస్కృతి ఇచ్చే కీలక పాఠమని ప్రధానమంత్రి అన్నారు. “భారత నాగరికత ప్రజాస్వామిక వారసత్వం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలో భారతదేశ సుసంపన్నమైన, సజీవ ప్రజాస్వామ్యం. మనకి విలువలున్నాయి. ప్రజాస్వామ్య మాతృక అందించిన గర్వపడే సాంప్రదాయం ఉంది. భిన్నత్వంలోనే చక్కని ఏకత్వం కూడా భారతదేశానికి ఉంది. ప్రజాస్వామ్యం, భిన్నత్వం, దేశీయ వైఖరి, సమ్మిళిత ఆలోచన, ప్రపంచం గురించిన చింత అన్నీ ఉన్నందు వల్ల వాటన్నింటి నుంచి నేడు ఎదుర్కొంటున్న సవాళ్లకి పరిష్కారాలను ప్రపంచం అన్వేషించుకుంటోంది” అని చెప్పారు.
ప్రజాస్వామ్యం ఒక్కటే కాదు, సుస్థిర అభివృద్ధికి కూడా భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి అందరి ముందుంచారు. “మనం సుస్థిర అభివృద్ధిని ప్రభుత్వ వ్యవస్థ బాధ్యతగా కాకుండా మన జీవితంలో అంతర్భాగం చేసుకోవాలి. పర్యావరణం అనేది ప్రపంచ సమస్య మాత్రమే కాదు, వ్యక్తిగత బాధ్యత” అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఆయుర్వేదం పాత్రను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. యోగ, చిరుధాన్యాల పట్ల ప్రపంచంలో ఉత్సుకత ఎదురవుతున్నదని ఆయన అన్నారు.
భారతదేశం సాధించిన పలు విజయాలను ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఉపయోగించుకోవచ్చునని ప్రధానమంత్రి అన్నారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి, సమ్మిళితత్వం, అవినీతి నిర్మూలన, వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణ అన్నీ ప్రపంచానికి టెంప్లేట్లుగా ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. భారతదేశంలో మహిళా సాధికారత, మహిళా చోదక అభివృద్ధి, జన్-ధన్ ఖాతాల ద్వారా ఆర్థిక సమ్మిళితత్వం వంటివి ఈ జి-20 అధ్యక్ష అవకాశం ద్వారా ప్రపంచానికి విస్తరింపచేచే అవకాశం ఉన్నదని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.
జి-7, జి-77 లేదా యుఎన్ జిఏ... వేదిక ఏదైనా సంఘటిత నాయకత్వం కోసం ప్రపంచం ఎంతో ఆశగా ఎదురు చూస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ కోణంలో చూసినట్టయితే భారతదేశానికి జి-20 నాయకత్వం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. భారతదేశం ఒక పక్క అభివృద్ధి చెందిన దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూనే వర్థమాన దేశాల ఆలోచనలు అర్ధం చేసుకుని వాటిని వ్యక్తం చేస్తోందని ఆయన వివరించారు. “ఇదే ప్రాతిపదికగా దశాబ్దాలుగా భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సహప్రయాణికులుగా ఉన్న ప్రపంచ దక్షిణ మిత్రులందరినీ కూడగట్టుకుంటూ భారతదేశ జి-20 నాయకత్వానికి బ్లూప్రింట్ తయారుచేస్తున్నాం” అని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచంలో అగ్రప్రపంచం, వర్థమాన ప్రపంచం అంటూ ఏదీ ఉండదు...ప్రపంచం అంతా ఒక్కటే అన్నది ప్రచారంలోకి తేవాలన్నది భారతదేశం ప్రయత్నమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచం అంతటినీ కూడగట్టుకుంటూ మెరుగైన భవిష్యత్తు సృష్టించుకునేందుకు భారతదేశం విజన్, ఉమ్మడి లక్ష్యాల గురించి ప్రస్తావిస్తూ పునరుత్పాదక ఇంధనం కోసం ఎలుగెత్తి ఇచ్చిన ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్ నినాదం; ఒక భూమండలం, ఒకే ఆరోగ్యం నినాదాలను ఇందుకు ఉదాహరణగా చూపారు. ఇప్పుడు ఒక భూమండలం, ఒకే కుంటుబం, ఒకే భవిష్యత్తు అన్నది జి-20 మంత్రమని ఆయన చెప్పారు. “భారతదేశం అనుసరించే ఈ ఆలోచనా ధోరణులు, విలువలే ప్రపంచ సంక్షేమానికి బాటలు వేస్తాయి” అన్నారు. “ఈ సంఘటన భారతదేశానికి చిరస్మరణీయంగా ఉండిపోవడమే కాదు, భవిష్యత్ ప్రపంచం ఈ చారిత్రక ఘట్టం గురించి ప్రస్తావించుకుంటూనే ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను” అన్నారు.
జి-20 కేవలం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కాదని, అన్ని రాష్ట్రప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా ఇందులో చురుగ్గా పాల్గొనాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా భారతీయులు, జి-20 నిర్వహించే కార్యక్రమాలు “అతిథి దేవోభవ” అనే మన సాంప్రదాయం గురించి ప్రపంచానికి తెలియచేయగల అవకాశం అన్నారు. అలాగే జి-20కి సంబంధించిన కార్యక్రమాలు ఢిల్లీ లేదా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలకే పరిమితం కాదని, దేశంలో ప్రతీ ఒక్క మూలన జరుగుతాయని ఆయన తెలియచేశారు. “మన రాష్ర్టాల్లో ప్రతీ ఒక్క దానికి తనకే సొంతమైన స్వభావం, వారసత్వం, సంస్కృతి, సౌందర్యం, కాంతివలయం, ఆతిథ్య వైఖరి ఉన్నాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. రాజస్తాన్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అందించే ఆతిథ్యం ఉదాహరణగా చెబుతూ ఈ ఆతిథ్యం, వైవిధ్యం గురించే ప్రపంచం అబ్బురపడుతూ ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు.
భారతదేశ జి-20 నాయకత్వం గురించి లాంఛనప్రాయంగా ప్రకటించడానికి తాను వచ్చే వారంలో ఇండోనేసియా వెళ్తున్నానని ప్రధానమంత్రి చెబుతూ రాష్ర్టాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీలైనంతగా తమ పాత్రకు సమాయత్తం కావాలని పిలుపు ఇచ్చారు. “అందరు పౌరులు, మేథావులు కూడా ఈ సంఘటనలోభాగస్వాములు కావడానికి ముందుకు రావాలి” అని సూచించారు. కొత్తగా ఆవిష్కరించిన జి-20 వెబ్ సైట్, ప్రపంచ సంక్షేమం కోసం భారతదేశం ఎంత గరిష్ఠంగా పాత్ర పోషించాలి అనే అంశంపై ప్రతీ ఒక్కరూ తమ అభిప్రాయాలు, సూచనలు తెలియచేయాలని కోరారు. “జి-20 వంటి సంఘటనల విజయం కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది” అన్నారు. “ఇది భారతదేశానికి చిరస్మరణీయమైన సంఘటనేకాదు, భవిష్యత్తులో ప్రపంచ చరిత్ర కూడా ఈ చిరస్మరణీయ సందర్భాన్నిమదింపు చేస్తుందనే విషయంలో నాకెలాంటి సందేహం లేదు” అన్నారు.
పూర్వాపరాలు
ప్రధానమంత్రి విజన్ కు అనుగుణంగా ప్రపంచ యవనికపై నాయకత్వ బాధ్యతలు చేపట్టడం లక్ష్యంగా భారత విదేశాంగ విధానం రూపకల్పన జరిగింది. 2022 డిసెంబర్ 1వ తేదీన భారతదేశం జి-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఈ దిశలో పెద్ద అడుగు. అంతర్జాతీయ ప్రాధాన్యత గల ప్రధాన సమస్యలపై పోరాటానికి తన వంతు సేవలు అందించే ప్రత్యేక అవకాశం జి-20 అధ్యక్ష బాధ్యతల సమయంలో భారతదేశానికి లభిస్తోంది. భారతదేశ జి-20 అధ్యక్ష లోగో, థీమ్, వెబ్ సైట్ ప్రపంచానికి భారతదేశ సందేశాన్ని, ప్రపంచ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయి.
ప్రపంచ జిడిపిలో 85 శాతానికి, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతానికి, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులకు ప్రాతినిథ్యం వహించే దేశాల అంతర్జాతీయ ఆర్థిక సహకార భాగస్వామ్య వేదిక జి-20. ఈ జి-20 అధ్యక్ష కాలంలో భారతదేశం దేశవ్యాప్తంగా భిన్న ప్రదేశాల్లో 32 విభిన్న రంగాలపై 200 వరకు సమావేశాలు నిర్వహిస్తుంది. వచ్చే ఏడాది జరుగనున్న జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు భారతదేశం ఆతిథ్యం వహించే అత్యంత ఉన్నతమైన అంతర్జాతీయ సదస్సుల్లో ఒకటిగా నిలిచిపోతుంది.
India will assuming the G20 Presidency this year. Sharing my remarks at the launch of G20 website, theme and logo. https://t.co/mqJF4JkgMK
— Narendra Modi (@narendramodi) November 8, 2022
India is set to assume G20 Presidency. It is moment of pride for 130 crore Indians. pic.twitter.com/i4PPNTVX04
— PMO India (@PMOIndia) November 8, 2022
G-20 का ये Logo केवल एक प्रतीक चिन्ह नहीं है।
ये एक संदेश है।
ये एक भावना है, जो हमारी रगों में है।
ये एक संकल्प है, जो हमारी सोच में शामिल रहा है। pic.twitter.com/3VuH6K1kGB
— PMO India (@PMOIndia) November 8, 2022
The G20 India logo represents 'Vasudhaiva Kutumbakam'. pic.twitter.com/RJVFTp15p7
— PMO India (@PMOIndia) November 8, 2022
The symbol of the lotus in the G20 logo is a representation of hope. pic.twitter.com/HTceHGsbFu
— PMO India (@PMOIndia) November 8, 2022
आज विश्व में भारत को जानने की, भारत को समझने की एक अभूतपूर्व जिज्ञासा है। pic.twitter.com/QWWnFYvCms
— PMO India (@PMOIndia) November 8, 2022
India is the mother of democracy. pic.twitter.com/RxA4fd5AlF
— PMO India (@PMOIndia) November 8, 2022
हमारा प्रयास रहेगा कि विश्व में कोई भी first world या third world न हो, बल्कि केवल one world हो। pic.twitter.com/xQATkpA7IF
— PMO India (@PMOIndia) November 8, 2022
One Earth, One Family, One Future. pic.twitter.com/Gvg4R3dC0O
— PMO India (@PMOIndia) November 8, 2022
*****
DS/TS
(Release ID: 1874674)
Visitor Counter : 408
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam