కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఈపీఎఫ్‌వో 70వ వ్యవస్థాపక దినోత్సవం
ప్రధాన మంత్రి దార్శనికత అయిన 'శ్రమేవ్ జయతే' సాధనలో ఈపీఎఫ్‌వోది కీలక పాత్ర: కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్
ఈపీఎఫ్‌వో విజన్ @ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ
ఉత్తమ పనితీరుకు 'భవిష్య నిధి పురస్కారాలు-2022' ప్రదానం
వర్చువల్ పద్ధతిలో రాంచీలోని ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం
చట్టాల హేతుబద్ధీకరణ, సరళీకరణ వల్ల వ్యాజ్యాలు తగ్గుతాయి, సులభతర వ్యాపారం సాధ్యమవుతుంది: కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్
Posted On:
01 NOV 2022 4:30PM by PIB Hyderabad
న్యూదిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈపీఎఫ్‌వో 70వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ నిర్మాణంలో, దేశవ్యాప్త అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ఈపీఎఫ్‌వో ముఖ్య పాత్ర పోషించిందని ప్రముఖంగా ప్రస్తావించారు.
70 ఏళ్ల ఈపీఎఫ్‌వో చరిత్రను వివరిస్తూ “ఈపీఎఫ్‌వో @70 – ప్రయాణం” పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. సంస్థ 70 సంవత్సరాల ఉనికిపై 'ఈపీఎఫ్‌వో@70' పేరుతో ప్రదర్శించిన ఒక డాక్యుమెంటరీ చిత్రం, దశాబ్దాలుగా ఈ సంస్థ సాధించిన విజయాలను వివరించింది. 70 ఏళ్ల ఈపీఎఫ్‌వో స్మారకంగా, తపాలా శాఖ సహకారంతో ప్రత్యేక కవర్‌ను కేంద్ర మంత్రి విడుదల చేశారు. రాబోయే 25 ఏళ్లకు ఈపీఎఫ్‌వో ప్రణాళికలను రూపొందించడానికి సంబంధించిన ఈపీఎఫ్‌వో విజన్@ 2047 డాక్యుమెంట్, చింతన్ శివిర్‌పై బుక్‌లెట్‌ను కూడా కేంద్ర మంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి గుర్తుగా, యాజమాన్యాలు - ఉద్యోగుల కోసం ఒక వెల్‌కమ్ కిట్‌ను శ్రీ యాదవ్ ప్రారంభించారు. ఈ వర్గాల ప్రయోజనాలను పెంచే మార్గదర్శకాలు, సూచనలు ఇందులో ఉన్నాయి. కేవలం హిందీ, ఆంగ్లంలో మాత్రమే కాకుండా, దేశంలోని అందరికీ అర్ధమయ్యేలా 21 వ్యవహారిక భాషల్లోనూ వీటిని రూపొందించారు.
పుణెలోని ప్రాంతీయ కార్యాలయ భవనానికి వర్చువల్ పద్ధతిలో కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. భోసరి ఎమ్మెల్యే శ్రీ మహేష్ భూమి పూజను చేశారు. రాంచీలో నిర్మించిన ప్రాంతీయ కార్యాలయ భవనాన్ని కూడా వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో రాంచీ ఎంపీ శ్రీ సంజయ్ సేథ్, హతియా ఎమ్మెల్యే శ్రీ నవీన్ జైస్వాల్ ఈ భవనాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా, వివిధ కార్యాలయాలు & సంస్థలకు పురస్కారాల పంపిణీ కూడా జరిగింది: -
ఉత్తమ పనితీరు కనబరిచిన పెద్ద ప్రాంతీయ కార్యాలయం విభాగంలో భవిష్య నిధి పురస్కారం-2022 :- సేలం
ఉత్తమ పనితీరు కనబరిచిన చిన్న ప్రాంతీయ కార్యాలయం విభాగంలో భవిష్య నిధి పురస్కారం-2022:- ఉడుపి
ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లా కార్యాలయం విభాగంలో భవిష్య నిధి పురస్కారం-2022:- జామ్‌నగర్
ఉత్తమ పనితీరు కనబరిచిన మారుమూల కార్యాలయం విభాగంలో భవిష్య నిధి పురస్కారం-2022:- ప్రాంతీయ కార్యాలయం, జమ్మూ
ఉత్తమ పనితీరు కనబరిచిన జోనల్ కార్యాలయం విభాగంలో భవిష్య నిధి పురస్కారం-2022:- పంజాబ్ & హిమాచల్
క్షేత్ర స్థాయి కార్యాలయం అవలంబించిన వినూత్న అభ్యాసానికి భవిష్య నిధి పురస్కారం-2022:- గువాహటి
భవిష్య నిధి స్వచ్ఛత పురస్కారం-2022:- నొయిడా
ఫిర్యాదుల పరిష్కారంలో ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రాంతీయ కార్యాలయం విభాగంలో భవిష్య నిధి పురస్కారం-2022 :– గురుగావ్ తూర్పు
ఉత్తమ బృందాల విభాగంలో భవిష్య నిధి పురస్కారం-2022 :– ఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఆర్.ఎస్.మనోజ్ నేతృత్వంలోని ఎంఐఎస్ బృందం
ఈ-నామినేషన్‌లో ఉత్తమ యాజమాన్యం విభాగంలో భవిష్య నిధి పురస్కారం-2022 :– ఎం/ఎస్ ఎస్.జె.& ఎస్.పి. ఫ్యామిలీ ట్రస్ట్, నిజామాబాద్, తెలంగాణ
ఉత్తమ పనితీరు కనబరిచిన ఎగ్జెంప్టెడ్ ట్రస్ట్ విభాగంలో భవిష్య నిధి పురస్కారం-2022 :- ఎం/ఎస్ టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, నారిమన్ పాయింట్, బాంద్రా
ఏటికేడు ఈపీఎఫ్‌వో అభివృద్ధి చెందుతున్న తీరు, సభ్యులు పొదుపు చేసిన భారీ మొత్తం నిర్వహణ పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి 'శ్రమేవ్ జయతే' దార్శనికతను సాధించడంలో ఈపీఎఫ్‌వో పోషించాల్సిన పాత్రను మరింత నొక్కి చెప్పారు. చింతన్ శివిర్ ఐదు లక్ష్యాలు అయిన మిషన్ 10 కోట్లు, సులభతర సమ్మతి, ఈపీఎఫ్‌వో కర్మయోగి, సభ్యుల సంతృప్తి, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండడం వంటివి భవిష్యత్తులో ఈపీఎప్‌వో చేపట్టాల్సిన కీలక అంశాలుగా గుర్తించారు.
29 కార్మిక చట్టాలను రద్దు చేసిన నాలుగు లేబర్ కోడ్‌ల ప్రాముఖ్యతను కూడా శ్రీ యాదవ్ నొక్కి వక్కాణించారు. ఈ హేతుబద్ధీకరణ, చట్టాల సరళీకరణ వల్ల వ్యాజ్యాలు తగ్గుతాయి, వ్యాపారం సులభతరం అవుతుంది. చివరి వ్యక్తికి కూడా ప్రయోజనం అందేలా విధానపరమైన మార్పులు తీసుకురావాలన్న ప్రధాన మంత్రి దృక్పథానికి అనుగుణంగా ప్రభుత్వం విధానం అమలవుతోంది.
ఈపీఎఫ్‌వో 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఆయన ప్రశంసించారు. విజేతలను అభినందించారు. దేశంలో అందరికీ సామాజిక భద్రత ఉండాలన్న దృక్పథాన్ని నెరవేర్చడంలో ఈపీఎఫ్‌వో విజన్ @2047లో గుర్తించిన అంశాల అమలు సహాయపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కార్మిక శాఖ కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా కూడా సంతోషం వ్యక్తం చేశారు. పురస్కార విజేతలను అభినందించారు. గత దశాబ్దాల్లో ఈపీఎఫ్‌వో సాధించిన విజయాలను మననం చేసుకోవడానికి ఇది ఒక మంచి సందర్భమని చెప్పారు. పెరుగుతున్న అంచనాలకు అనుగుణంగా ఇక నుంచి ఈపీఎఫ్‌వో ఎంత వినూత్నంగా పని చేస్తుంది, సేవలు ఎలా అందిస్తుంది అన్న అంశం కూడా ముఖ్యమేనని అన్నారు.
ఈ సందర్భంగా, ఐఎల్‌వో డీసెంట్ వర్క్ డైరెక్టర్ శ్రీమతి దగ్మార్ వాల్టర్ ఈపీఎఫ్‌వోను అభినందించారు. మహమ్మారి సమయంలో సంస్థ పనితీరును, సభ్యులకు మంచి సేవలను అందించడంలో చేసిన ప్రయత్నాలను ఆమె ప్రశంసించారు. దేశంలో జనాభా వయస్సు పెరుగుతున్న కొద్దీ, భవిష్యత్తులో సామాజిక భద్రతను అందించడంలో సంస్థ ప్రాముఖ్యత, పాత్ర పెరుగుతూనే ఉంటుంది.
ఈపీఎఫ్‌వో 70వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన ప్రముఖులందరికీ ఈపీఎఫ్‌వో కేంద్ర భవిష్య నిధి కమిషనర్ శ్రీమతి నీలం షామీ రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
******
(Release ID: 1872853)
Visitor Counter : 215