ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి


“బ్యాంకింగ్ సేవలు చివరి అంచెదాకా చేరేలా మేం అత్యధిక ప్రాధాన్యమిచ్చాం”;

“ఆర్థిక-డిజిటల్ భాగస్వామ్యాల జోడింపుతో
సరికొత్త అవకాశాల ప్రపంచం ఏర్పడుతుంది”;

“జర్మనీ, చైనా, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో పోలిస్తే నేడు భారత్‌లో
ప్రతి లక్ష మంది వయోజన పౌరులకు శాఖల సంఖ్య ఎక్కువ”;

“భారత డిజిటల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను ఐఎంఎఫ్‌ ప్రశంసించింది”;

“డిజిటలీకరణ ద్వారా సామాజిక భద్రతకు భరోసా కల్పనలో భారతదేశం అగ్రగామిగా నిలిచిందని ప్రపంచ బ్యాంకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది”;

“బ్యాంకింగ్ రంగం ఇవాళ ఆర్థిక లావాదేవీలకు మించి
‘సుపరిపాలన’.. ‘మెరుగైన సేవాప్రదాన’ మాధ్యమంగా మారింది”;

“జన్‌ధన్‌ ఖాతాలు దేశంలో ఆర్థిక సార్వజనీనతకు పునాది
వేయగా సాంకతికార్థిక విప్లవానికి అది ఆధార పీఠంగా మారింది”;

“జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాల శక్తి నేడు దేశమంతటా అనుభవంలోకి వచ్చింది”;

“ఏ దేశంలోనైనా బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా
ఉంటుందో ఆర్థిక వ్యవస్థ అంత ప్రగతిశీలంగా ఉంటుంది”

Posted On: 16 OCT 2022 12:50PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల (డీబీయూ)ను వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా జాతికి అంకితం చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ- ఈ 75 డిజిట‌ల్ బ్యాంకింగ్ యూనిట్లు ఆర్థిక సార్వజనీనతను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు పౌరుల‌ బ్యాంకింగ్ అనుభ‌వాన్ని ఇనుమడింపజేస్తాయని నొక్కిచెప్పారు. “సామాన్యులకు జీవన సౌలభ్యం దిశగా ‘డీబీయూ’ ఒక పెద్ద ముందడుగు” అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలో కనీస మౌలిక సదుపాయాలతో గరిష్ఠ సేవలు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఈ సేవలన్నీ ఎలాంటి పత్రాలతో ప్రమేయం లేకుండా డిజిటల్‌ విధానంలో అందుతాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇది బలమైన, సురక్షిత బ్యాంకింగ్ వ్యవస్థను చేరువ చేయడంసహా బ్యాంకింగ్ విధానాన్ని కూడా సులభతరం చేస్తుందని చెప్పారు. “చిన్న పట్టణాలు, గ్రామాల్లో నివసించే వారు కూడా నగదు బదిలీ చేయడం నుంచి రుణాలు పొందడం దాకా అనేక ప్రయోజనాలు పొందగలరు. దేశంలోని సామాన్యుల జీవితాన్ని సులభతరం చేసేదిశగా దేశంలో కొనసాగిస్తున్న ప్రయాణంలో ఇది మరో పెద్ద ముందడుగు” అని ఆయన అన్నారు.

   సాధికార కల్పన ద్వారా సామాన్యులను శక్తిమంతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రధాని స్పష్టం చేశారు. ఈ మేరకు సమాజంలో చిట్టచివరి వ్యక్తిదాకా ప్రయోజనం చేరడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమంతా వారి సంక్షేమం దిశగా పయనించేలా విధానాలు రూపొందించామని చెప్పారు. ప్రభుత్వం రెండురంగాలపై ఏకకాలంలో దృష్టి సారించిందని ప్రధాని పేర్కొన్నారు. ఇందులో మొదటిది బ్యాంకింగ్ వ్యవస్థ సంస్కరణ-బలోపేతంసహా పారదర్శకత తేవడం కాగా, రెండోది ఆర్థిక సార్వజనీనతని ఆయన వివరించారు. లోగడ ప్రజలు బ్యాంకులకు వెళ్లాల్సిన సంప్రదాయ పద్ధతిని గుర్తుచేస్తూ, బ్యాంకును ప్రజల ముంగిటకు చేర్చడం ద్వారా ఈ విధానాన్ని ప్రభుత్వం మార్చిందని ప్రధాని అన్నారు. “బ్యాంకింగ్ సేవలు చివరి అంచెదాకా చేరేలా మేం అత్యధిక ప్రాధాన్యమిచ్చాం” అని ఆయన చెప్పారు. పేదలు బ్యాంకులకు వెళతారని భావించే నేపథ్యం నుంచి నేడు బ్యాంకులే పేదల వాకిటికి వెళ్తున్న దృశ్యం భారీ మార్పునకు సంకేతమని, తద్వారా పేదలకు-బ్యాంకులకు మధ్య దూరం తగ్గిందని పేర్కొన్నారు. “మేం కేవలం భౌతిక దూరాన్నే కాకుండా మానసిక దూరాన్ని కూడా తొలగించాం” అన్నారు.

   మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సదుపాయాల కల్పనకే అత్యధిక ప్రాముఖ్యం ఇచ్చామని ప్రధాని గుర్తుచేశారు. దీంతో నేడు దేశంలోని 99 శాతానికిపైగా గ్రామాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో బ్యాంకు శాఖ, బ్యాంకింగ్ అవుట్‌లెట్ లేదా ‘బ్యాంకింగ్ మిత్ర’ సౌకర్యం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. “సాధారణ పౌరుల బ్యాంకింగ్ అవసరాలు తీర్చడం కోసం ‘ఇండియా పోస్ట్‌’ బ్యాంకుల ద్వారా విస్తృత తపాలా కార్యాలయ నెట్‌వర్క్ కూడా ఉపయోగించబడింది” అని ఆయన చెప్పారు. “జర్మనీ, చైనా, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో పోలిస్తే నేడు భారత్‌లో ప్రతి లక్ష మంది వయోజన పౌరులకు బ్యాంకు శాఖల సంఖ్య ఎక్కువ” అన్నారు. తొలినాళ్లలో కొన్ని వర్గాల్లో సందేహాలున్నప్పటికీ “జన్‌ధన్ బ్యాంకు ఖాతాల శక్తి ఎలాంటితో నేడు దేశం మొత్తానికీ అనుభవంలోకి వచ్చింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ఖాతాల వల్ల ప్రభుత్వం చాలా తక్కువ ప్రీమియంతో బలహీనవర్గాలకు బీమా రక్షణ కల్పించిందని ఆయన తెలిపారు. “ఇది పేదలకు తాకట్టులేని రుణ సదుపాయం కల్పించింది. లక్షిత లబ్ధిదారుల ఖాతాలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీని సుగమం చేసింది. ఇళ్లు, మరుగుదొడ్లు, వంటగ్యాస్ సబ్సిడీ, రైతు పథకాల ప్రయోజనాలను సజావుగా చేరవేయడంలో ఈ ఖాతాలే కీలకం” అని ఆయన చెప్పారు. భారత డిజిటల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించడంపై ప్రధానమంత్రి హర్షం వెలిబుచ్చారు. “భారత డిజిటల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను ఐఎంఎఫ్ ప్రశంసించింది. ఈ ఘనత దేశంలోని పేదలు, రైతులు, కార్మికులకే చెందుతుంది. వారు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడమేగాక తమ జీవితంలో దీన్నొక భాగం చేసుకున్నారు” అని ఆయన ఉద్ఘాటించారు.

   ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- “భారతదేశానికి యూపీఐ కొత్త అవకాశాలను సృష్టించింది” అన్నారు. అలాగే “ఆర్థిక-డిజిటల్ భాగస్వామ్యాల జోడింపుతో సరికొత్త అవకాశాల ప్రపంచం ఏర్పడుతుంది. దీనికి యూపీఐ వంటి అత్యంత భారీ నిదర్శనం మన ముందుంది. ప్రపంచంలో ఇటువంటి సాంకేతికతను సృష్టించిన తొలి దేశంగా భారత్‌ గర్విస్తోంది” అన్నారు. ఇవాళ 70 కోట్ల దేశీయ ‘రూపే’ కార్డులు వినియోగంలో ఉన్నాయని, విదేశీ సంస్థలు ఇటువంటి ఉత్పత్తులు అందించే ఒకనాటి పరిస్థితులు ఇప్పుడెంతగానో మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. “ఈ సాంకేతిక-ఆర్థిక సమ్మేళనం పేదల ఆత్మగౌరవంతోపాటు వారి స్థోమతను కూడా పెంచింది. మధ్యతరగతి వారికి సాధికారత కల్పించడమేగాక దేశంలో డిజిటల్‌ అగాధాన్ని కూడా తొలగిస్తోంది” అని ప్రధాని పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనలో ‘డీబీటీ’ పోషిస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు. ఈ ప్రక్రియ ద్వారా వివిధ పథకాల కింద రూ.25 లక్షల కోట్లదాకా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ అయిందని తెలిపారు. ఇందులో భాగంగా రైతులకు తదుపరి విడత నిధులను బదిలీ చేస్తానని వెల్లడించారు. “నేడు ప్రపంచమంతా ఈ ‘డీబీటీ’ని, భారతదేశపు డిజిటల్ సామర్థ్యాన్ని అభినందిస్తోంది. ఇవాళ ఇదొక ప్రపంచ నమూనాగా పరిగణించబడుతోంది. ఎంతవరకూ అంటే- డిజిటలీకరణ ద్వారా సామాజిక భద్రతకు భరోసా కల్పించడంలో భారత్‌ అగ్రగామిగా నిలిచిందని ప్రపంచ బ్యాంకు చెప్పేదాకా వెళ్లింది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

   భారత విధానాలు, కార్యాచరణలో సాంకేతికార్థికత కేంద్రకంగా మారిందని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అది కీలకపాత్రను పోషిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల రాకతో ఈ సాంకేతికార్థిక సామర్థ్యం మరింత విస్తరించగలదని పేర్కొన్నారు. “జన్‌ధన్ ఖాతాలు దేశంలో ఆర్థిక సార్వజనీనతకు పునాది వేయగా సాంకతికార్థిక విప్లవానికి అది ఆధార పీఠంగా మారింది” అని ఆయన అన్నారు. బ్లాక్‌చెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టడంపై ప్రభుత్వ ప్రకటనను ప్రస్తావిస్తూ- రాబోయే రోజుల్లో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థతోపాటు డిజిటల్‌ కరెన్సీ లేదా నేటి డిజిటల్‌ లావాదేవీలు సహా అనేక కీలకాంశాలు వీటితో ముడిపడి ఉంటాయి” అని ప్రధాని పేర్కొన్నారు. పొదుపుతోపాటు భౌతిక నగదుతో చిక్కులు తొలగడం, పర్యావరణ ప్రయోజనాల వంటి సానుకూలతలు ఉంటాయని ఆయన వివరించారు. ప్రస్తుతం నగదు ముద్రణ కోసం కాగితం, ఇంకు దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను అనుసరించడం ద్వారా స్వయం సమృద్ధ భారతం ఆవిర్భావానికి తోడ్పడుతున్నామని చెప్పారు. అదే సమయంలో కాగితం వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ లబ్ధి కూడా లభిస్తుందని పేర్కొన్నారు.

   మన బ్యాంకింగ్ రంగం ఇవాళ ఆర్థిక లావాదేవీలకు మించి ‘సుపరిపాలన’, ‘మెరుగైన సేవల ప్రదానానికి’ మాధ్యమంగా మారిందని ప్రధాని అన్నారు. ఈ వ్యవస్థ నేడు ప్రైవేట్ రంగంతోపాటు చిన్నతరహా పరిశ్రమల వృద్ధికి అపార అవకాశాలను సృష్టించిందని తెలిపారు. భారతదేశంలో సాంకేతికత ద్వారా ఉత్పత్తి, సేవలు అందించే కొత్త అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ ఏర్పడని రంగమంటూ ఏదీలేదని ఆయన అన్నారు. “డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మన తరహా ఆర్థిక వ్యవస్థకు, మన అంకుర సంస్థల ప్రపంచానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ స్వయం సమృద్ధ భారతానికి గొప్ప బలం” అని ఆయన అన్నారు. “ఇవాళ మన చిన్న పరిశ్రమలు, మన ‘ఎంఎస్‌ఎంఈ'లు ‘జీఇఎం’ వంటి వ్యవస్థ ద్వారా ప్రభుత్వ టెండర్లలో పాల్గొంటున్నాయి. వారికి ఈ విధఃగా కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఆ మేరకు ‘జీఇఎం’ వేదికగా ఇప్పటివరకూ రూ.2.5 లక్షల కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల ద్వారా ఈ దిశగా మరిన్ని కొత్త అవకాశాలు ఇక పుట్టుకొస్తాయి” అని ఆయన భవిష్యత్‌ భారతం గురించి వివరించారు. “ఏ దేశంలోనైనా బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో ఆర్థిక వ్యవస్థ అంత ప్రగతిశీలమైనదిగా ఉంటుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశం ఇవాళ 2014కు ముందునాటి ‘ఫోన్ బ్యాంకింగ్’ వ్యవస్థ నుంచి గత 8 ఏళ్లలో ‘డిజిటల్ బ్యాంకింగ్‌’వైపు మళ్లిందని, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ నిరంతరం ముందడుగు వేస్తున్నదని ఆయన తెలిపారు. పాత పద్ధతులను ప్రస్తావిస్తూ 2014కు ముందు బ్యాంకుల విధులు నిర్ణయిస్తూ ఫోన్‌కాల్‌ వచ్చేదని ప్రధాని అన్నారు. ఇలాంటి ఫోన్‌ బ్యాంకింగ్‌ రాజకీయాలు బ్యాంకులను అభద్రత భావనలోకి నెట్టివేశాయని తెలిపారు. ఫలితంగా వేలకోట్ల కుంభకోణాలకు బీజాలు పడి దేశ ఆర్థిక వ్యవస్థకూ భద్రత లేకుండా పోయిందని ఆయన గుర్తుచేశారు.

   ప్రస్తుత ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ను ఏ విధంగా మార్చేసింద‌న్న అంశాన్ని వివరిస్తూ పార‌ద‌ర్శ‌క‌త‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించామని ప్రధాని చెప్పారు. ఈ మేరకు “ముందుగా ‘ఎన్‌పిఎ’లను గుర్తించడంలో పారదర్శకత తెచ్చాం.. ఆ తర్వాత, రూ.లక్షల కోట్ల నిధులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి తీసుకువచ్చాం. ఆ విధంగా బ్యాంకులకు మూలధన పునఃకల్పన చేశాం. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్యలు తీసుకున్నాం. అవినీతి నిరోధక చట్టాన్ని సంస్కరించాం” అని ఆయన విశదీకరించారు. పారదర్శక-శాస్త్రీయ వ్యవస్థ రూపకల్పన, రుణాల కోసం సాంకేతికత-విశ్లేషణల విధానాన్ని ప్రోత్సహిస్తూ, ‘ఐబీసీ’ సాయంతో ‘ఎన్‌పీఏ’ సంబంధిత సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు. “బ్యాంకుల విలీనం వంటి అంశాలు విధాన పక్షవాతం బారినపడినప్పటికీ దేశం ఇవాళ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. తద్వారా లభించిన ఫలితాలు నేడు మనముందున్నాయి” అన్నారు. డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లు, వినూత్న సాంకేతికార్థిక పరిజ్ఞానం ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఇవాళ స్వయం చోదక యంత్రాంగం సృష్టించబడిందని ఆయన గుర్తుచేశారు. వినియోగదారుల స్వయంప్రతిపత్తితో సమానంగా బ్యాంకుల పనితీరుకు తగిన సౌలభ్యం, పారదర్శకత కూడా ఇవాళ అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇక ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఈ రంగంలోని భాగస్వాములదేనని ఆయన స్పష్టం చేశారు.

   చివరగా- గ్రామీణ ప్రాంతాల చిరువ్యాపారులు పూర్తిస్థాయి డిజిటల్‌ లావాదేవీల వైపు మళ్లాలని ప్రధానమంత్రి సూచించారు. దీనికితోడు ప్రతి బ్యాంకుశాఖ 100 మంది వ్యాపారులతో సంధానమై దేశం మొత్తం డిజిటలీకరణలో ప్రవేశించేందుకు తోడ్పడాలని కోరారు. “ఈ వినూత్న కృషితో మన బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ భవిష్యత్‌ కార్యకలాపాలకు సన్నద్ధమయ్యే దశకు చేరి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించగల సామర్థ్యాన్ని సంతరించుకోగలవని నేను నూటికి నూరుపాళ్లు విశ్వసిస్తున్నాను” అంటూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌ శ్రీ శక్తికాంత దాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, బ్యాంకింగ్‌ రంగ ప్రముఖులు, నిపుణులు, లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా అనుసంధానమయ్యారు.

నేపథ్యం

   ఆర్థిక సార్వజనీనతను మరింత లోతుకు తీసుకెళ్లే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (డీబీయూ)ను జాతికి అంకితం చేశారు. కాగా, 75 ఏళ్ల దేశ స్వాతంత్ర్య వార్షికోత్సవాలకు గుర్తుగా దేశంలోని 75 జిల్లాల్లో 75 ‘డీబీయూ’ల ఏర్పాటు గురించి 2022-23 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో డిజిటల్ బ్యాంకింగ్ ప్రయోజనాలు దేశంలో నలుమూలకూ చేరడంతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించే లక్ష్యంతో ‘డీబీయూ’లు ఏర్పాటయ్యాయి. ఈ వినూత్న కృషిలో 11 ప్రభుత్వ రంగ, 12 ప్రైవేట్ రంగ బ్యాంకులతోపాటు ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంక్ కూడా భాగస్వామి అవుతోంది.

   ఈ ‘డీబీయూ’లు ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వివిధ రకాల డిజిటల్‌ బ్యాంకింగ్‌ సదుపాయాలను అందుబాటులోకి తెస్తాయి. పొదుపు ఖాతాలు తెరవడం, నగదు నిల్వ తనిఖీ, పాస్‌బుక్కుల నవీకరణ, నగదు బదిలీ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి, రుణ దరఖాస్తులు, చెక్కులపై చెల్లింపు నిలిపివేత ఆదేశాల జారీ, క్రెడిట్‌/డెబిట్‌ కార్డులకు దరఖాస్తు, ఖాతా వివరాలు చూసుకోవడం, పన్నుల చెల్లింపు, వారసుల నమోదు వగైరా సేవలన్నీ ఈ యూనిట్లద్వారా లభ్యమవుతాయి.

   ఈ ‘డీబీయూ’లు ఖాతాదారులకు ఏడాది పొడవునా బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను చౌకగా, సానుకూల రీతిలో అందిస్తూ మెరుగైన డిజిటల్ అనుభవాన్నిస్తాయి. అలాగే సైబర్‌ భద్రతపై అవగాహన-రక్షణ ప్రాధాన్యంతో డిజిటల్‌ ఆర్థిక చైతన్య వ్యాప్తికి కృషి చేస్తాయి. అంతేకాకుండా ‘డీబీయూ’లు నేరుగా లేదా వ్యాపార సంధానకర్తలు/కరస్పాండెంట్ల ద్వారా అందించే వ్యాపార, ఇతర సేవల ప్రదానంలో తలెత్తే ఫిర్యాదులపై ప్రత్యక్ష సహాయం అందించడం, పరిష్కరించడం కోసం తగిన డిజిటల్ యంత్రాంగం కూడా ఉంటుంది.

*****

DS/TS

 


(Release ID: 1868399) Visitor Counter : 259