ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో న్యాయ మంత్రులు-కార్యదర్శుల అఖిలభారత సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం


“న్యాయ ప్రదానంపై మనం భరోసా కల్పించగలిగితేనే
రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం బలపడుతుంది”;

“దేశ ప్రజలు ప్రభుత్వ ఉదాసీనతగానీ.. ఒత్తిడినిగానీ అనుభవించ రాదు”;

“గత 8 ఏళ్లలో భారతదేశం 1500కుపైగా పాత-అసంబద్ధ చట్టాల
రద్దుసహా 32 వేలకుపైగా అనుసరణీయ నిబంధనలను తొలగించింది”;

“రాష్ట్రాల్లో స్థానిక స్థాయి న్యాయవ్యవస్థలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని భాగం చేయడం ఎలాగో మనం అర్థం చేసుకోవాలి”;

“నిరుపేదలకూ సులభంగా అర్థమయ్యే విధంగా
చట్టాల రూపకల్పనపై మనం దృష్టి సారించాలి”;

“న్యాయ వ్యవస్థలో న్యాయ సౌలభ్యం దిశగా స్థానిక భాష ప్రధాన పాత్ర పోషిస్తుంది”;

“విచారణ ట్రయల్ ఖైదీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పథం చూపాలి... తద్వారా న్యాయవ్యవస్థ మానవాదర్శాలతో ముందుకు వెళుతుంది”;

“మనం రాజ్యాంగ స్ఫూర్తిని పరిశీలిస్తే విభిన్న విధులున్నప్పటికీ న్యాయవ్యవస్థ.. శాసనసభ.. న్యాయస్థానాల మధ్య వాదోపవాదాలు లేదా పోటీకి అవకాశం లేదు”;

“సమర్థ దేశం... సమరస సమాజం కోసం స్పందనాత్మక న్యాయవ్యవస్థ అవశ్యం”

Posted On: 15 OCT 2022 11:03AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో న్యాయ మంత్రులు-కార్యదర్శుల అఖిలభారత సదస్సు ప్రారంభమైన నేపథ్యంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సుప్రసిద్ధ ఐక్యతా ప్రతిమ సాక్షిగా దేశంలోని అన్ని రాష్ట్రాల న్యాయ‌ మంత్రులు, కార్య‌దర్శుల కీలక సదస్సు జరుగుతున్నదని పేర్కొన్నారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల వేళ లక్ష్యాలను చేరుకోవడంలో సర్దార్‌ పటేల్‌ స్ఫూర్తి మనకు దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని అన్నారు.

   భారత్‌ వంటి వర్ధమాన దేశంలో ఆరోగ్యకర, ఆత్మ విశ్వాసపూరిత సమాజం దిశగా విశ్వసనీయ, వేగవంతమైన న్యాయ వ్యవస్థ ఆవశ్యకతను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ప్రతి సమాజంలోనూ న్యాయ వ్యవస్థతోపాటు వివిధ విధానాలు, సంప్రదాయాలు కాలానుగుణ  అవసరాల మేర రూపాంతరం చెందుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ఆ మేరకు “న్యాయ ప్రదానంపై మనం భరోసా కల్పించగలిగితేనే రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం బలపడుతుంది. అలాగే సకాలంలో న్యాయం చేసినపుడు సామాన్యులలో నమ్మకం కూడా ఇనుమడిస్తుంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. దేశంలో శాంతిభద్రతల నిరంతర మెరుగుకు ఇలాంటి ఉదంతాలే అత్యంత ఆవశ్యకమని ఆయన అన్నారు.

   భారతీయ సమాజ ప్రగతి పయనానికి వేల ఏళ్ల చరిత్ర ఉన్నదని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ క్రమంలో సంక్లిష్ట‌ సవాళ్లు ఎదురైనా మనం స్థిరంగా పురోగ‌మిస్తున్నామ‌ని తెలిపారు. “ప్రగతి  పథంలో ముందడుగు వేసే సమయంలో అంతర్గతంగా తననుతాను మెరుగుపరచుకునే ధోరణి మన సమాజంలోని విశేషాంశం” అని శ్రీ మోదీ అన్నారు. నిరంతర అభివృద్ధి ఆవశ్యకతను నొక్కిచెబుతూ- ప్రతి వ్యవస్థ సజావుగా పనిచేయాలంటే ఇదొక అనివార్య ఆవశ్యకాంశమని ప్రధాని సూచించారు. “మన సమాజం అసంబద్ధ చట్టాలు, దుస్సంప్రదాయాలను కాలానుగుణంగా తొలగిస్తూనే ఉంది. అలాకాకుండా ఏదైనా సంప్రదాయం సనాతన ధర్మంగా మారిపోతే అది సమాజానికి భారంగా మారుతుంది” అన్నారు. అలాగే “దేశంలో ప్రభుత్వం లేదనే పరిస్థితిగానీ, ప్రభుత్వ ఒత్తిడిగానీ ప్రజల ఆలోచనల్లోనైనా కనిపించరాదు” అని ఆయన అన్నారు.

   భారత పౌరులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి తొలగించడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- గత 8 సంవత్సరాల్లో మన దేశం 1500కుపైగా పాత, అసంబద్ధ చట్టాలను రద్దుచేసిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అదేవిధంగా 32 వేలకుపైగా అనవసర అనుసరణీయ నిబంధనలను తొలగించిందని పేర్కొన్నారు. తద్వారా జీవన సౌలభ్యానికి, ఆవిష్కరణలకు అడ్డుగా నిలిచే అవరోధాలను అంతం చేసిందని తెలిపారు. “ఈ చట్టాల్లో అధికశాతం బానిసత్వ హయాంనుంచీ కొనసాగుతున్నాయి” అని ఆయన గుర్తుచేశారు. ఆ కాలంనాటి అనేక కాలం చెల్లిన చట్టాలు నేటికీ రాష్ట్రాల్లో అమలవుతున్నాయని, ఈ సదస్సుకు హాజరైన ప్రముఖులు వివిధ అంశాలపై చర్చ సందర్భంగా అటువంటి పాత చట్టాల రద్దుకు వీలు కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని కోరారు. “ప్రస్తుత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల వేళ బానిసత్వ కాలపు చట్టాల రద్దుతోపాటు కొత్త చట్టాలను రూపొందించాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. జీవన సౌలభ్యం, న్యాయ సౌలభ్యంపై దృష్టి సారిస్తూనే రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న చట్టాలను కూడా సమీక్షించాలని ప్రధానమంత్రి సూచించారు.

   న్యాయ ప్రదానంలో జాప్యం అతిపెద్ద సవాలుగా పరిణమించిందని, ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి న్యాయ వ్యవస్థ అత్యంత శ్రద్ధతో కృషి చేస్తున్నదని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగం అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. భారతదేశ గ్రామాల్లో చిరకాలం నుంచీ కొనసాగుతూ వస్తున్న ఇలాంటి యంత్రాంగాన్ని రాష్ట్రస్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ మేరకు “రాష్ట్రాల పరిధిలో స్థానిక స్థాయి న్యాయవ్యవస్థలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని భాగం చేయడం ఎలాగో మనం అర్థం చేసుకోవాలి” అని శ్రీ మోదీ అన్నారు. ఈ సందర్భంగా తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి అంశాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో సాయంకాలపు కోర్టుల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. సెక్షన్ల పరంగా తక్కువ తీవ్రతగల కేసుల విచారణను సాయంకాలపు కోర్టులు చేపట్టాయని, దీంతో గుజరాత్‌ అంతటా ఇటీవలి సంవత్సరాలలో 9 లక్షలకుపైగా కేసులు పరిష్కారమయ్యాయని ఆయన వివరించారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో లక్షలాది కేసుల పరిష్కారానికి, కోర్టులపై భారం తగ్గించడానికి దోహదం చేసిన ‘లోక్ అదాలత్‌’ ఆవిర్భావం గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ వ్యవస్థద్వారా ఎంతో ప్రయోజనం పొందుతున్నారు” అని ఆయన తెలిపారు.

   పార్లమెంటులో చట్టాల రూపకల్పన సందర్భంగా మంత్రుల బాధ్యతను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- చట్టంలోనే గందరగోళం ఏర్పడితే అందులోని ఉద్దేశాలు మాట ఎలా ఉన్నా,  భవిష్యత్తులో ఆ భారాన్ని మోయాల్సింది సామాన్యులేననే వాస్తవాన్ని గుర్తించాలని ప్రధాని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితుల్లో సాధారణ పౌరులు న్యాయం కోసం కోర్టులు, లాయర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ పెద్దమొత్తంలో డబ్బు కూడా ధారపోయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. “చట్టంపై సామాన్యులకు అవగాహన ఏర్పడినపుడు దాని ప్రభావం మరో విధంగా ఉంటుంది” అని ఆయన నొక్కిచెప్పారు. ఇత‌ర దేశాల చట్టాలను ఉదాహరిస్తూ- పార్ల‌మెంటు లేదా చట్టసభలో ఒక చ‌ట్టానికి రూపమిచ్చేటపుడు చ‌ట్ట నిర్వ‌చ‌నం పరిధిలో దాన్ని సమగ్రంగా వివ‌రించేలా తయారుచేయాల్సి ఉంటుందన్నారు. అలాగే సామాన్యులకూ సులువుగా అర్థమయ్యే భాషలో రూపొందించాల్సి ఉంటుందని ప్ర‌ధానమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా సదరు చట్టం అమలుకు నిర్దిష్ట వ్యవధి కూడా నిర్ణయించబడుతుందని తెలిపారు. అటుపైన మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దానిపై సమీక్ష కూడా ఉంటుందని చెప్పారు. “న్యాయ వ్యవస్థలో న్యాయ సౌలభ్యం దిశగా స్థానిక భాష ప్రధాన పాత్ర పోషిస్తుంది. యువతరం కోసం మాతృభాషలో విద్యా పర్యావరణ వ్యవస్థను కూడా రూపొందించాలి. న్యాయ కోర్సులు కూడా మాతృభాషలో ఉండాలి. మన చట్టాలను సరళమైన భాషలో రాయాలి.. హైకోర్టులు, సుప్రీంకోర్టులో ముఖ్యమైన కేసుల డిజిటల్ లైబ్రరీలు స్థానిక భాషలో ఉండాలి” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

   “న్యాయ వ్యవస్థ సమాజంతోపాటు ఎదిగినప్పుడే ఆధునికత అనుసరణలో సహజ ధోరణిని అవలంబించగలదు. ఫలితంగా సమాజంలో వచ్చే మార్పులు న్యాయ వ్యవస్థ ద్వారా ప్రతిబింబిస్తాయి” అని శ్రీ మోదీ అన్నారు. న్యాయ వ్యవస్థలో సాంకేతికతను భాగం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ- ఇ-కోర్టులు, వర్చువల్ విచారణ పద్ధతుల ఆవిర్భావం, ఇ-ఫైలింగ్‌ విధానాలను ప్రోత్సహించడాన్ని గుర్తుచేశారు. దేశంలో నేడు 5జి రాకతో ఈ వ్యవస్థలు పెద్ద ఎత్తున ఊపందుకోగలవని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. “ప్రతి రాష్ట్రం తన వ్యవస్థలను సరిదిద్దుకోవడమేగాక ఉన్నతీకరించాలి. సాంకేతిక పరిజ్ఞానం లభ్యతకు అనుగుణంగా సిద్ధం కావడం మన న్యాయ విద్య ముఖ్య లక్ష్యం కూడా కావాలి” అని ప్రధాని స్పష్టం చేశారు.

   దేశంలోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో విచారణ ఖైదీల సమస్యను తాను లేవనెత్తడాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అటువంటి ఖైదీల కేసుల పరిష్కారం కోసం సత్వర విచారణకు కృషి చేయాలని ప్రముఖులను కోరారు. అంతేకాకుండా ఆ ఖైదీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, తద్వారా న్యాయవ్యవస్థ మానవాదర్శాలతో ముందుకెళ్లాలని ప్రధానమంత్రి సూచించారు. అలాగే “సమర్థ దేశం... సామరస్యపూరిత సమాజం కోసం స్పందనాత్మక న్యాయ వ్యవస్థ అవశ్యం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ ఔన్నత్యం గురించి నొక్కిచెబుతూ- న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు రాజ్యాంగమే మూలమని ప్రధాని గుర్తుచేశారు. “ప్రభుత్వం, పార్లమెంటు, మన న్యాయస్థానాలు- ఈ మూడు వ్యవస్థలూ ఒకవిధంగా ఒకే తల్లి బిడ్డలు. కాబట్టి దేని విధులు దానివే అయినప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తితో పరిశీలిస్తే వాటి మధ్య వాదోపవాదాలకు పోటీకి ఆస్కారం లేదు. ఒక తల్లి బిడ్డల్లాగా మూడు వ్యవస్థలు భరతమాతకు సేవ చేయాలి. ఈ 21వ శతాబ్దంలో భారతదేశాన్ని కలసికట్టుగా మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలి” అని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. కాగా, ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు, సహాయ మంత్రి శ్రీ ఎస్‌.పి.సింగ్ బాఘెల్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో కేంద్ర చట్ట-న్యాయ మంత్రిత్వ శాఖ ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తోంది. భారత చట్ట-న్యాయ వ్యవస్థ సంబంధిత సమస్యలపై చర్చించే దిశగా విధాన రూపకర్తలకు ఉమ్మడి వేదికగా నిలవడం దీని లక్ష్యం. ఈ సదస్సు ద్వారా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఉత్తమ విధానాలను పంచుకోగలవు. అలాగే కొత్త ఆలోచనల ఆదానప్రదానంతోపాటు పరస్పర సహకారాన్ని మెరుగుపరచుకుంటాయి. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖులు, న్యాయ నిపుణులు అనేక కీలక అంశాలపై లోతుగా చర్చిస్తారు. ఈ మేరకు సత్వర-సరసమైన న్యాయం దిశగా న్యాయనిర్ణయం, మధ్యవర్తిత్వంసహా చట్టపరమైన మౌలిక సదుపాయాలన్నిటినీ మెరుగుపరచడం, వాడుకలో లేని చట్టాల తొలగింపు, న్యాయ లభ్యత మెరుగు, కేసుల పెండింగ్‌ తగ్గింపు, సత్వర పరిష్కారానికి భరోసా, ఏకరూపత తేవడం  వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాల గురించి చర్చలు సాగుతాయి. అంతేకాకుండా కేంద్ర-రాష్ట్ర సమన్వయం మెరుగు, రాష్ట్ర న్యాయ వ్యవస్థల బలోపేతంపై రాష్ట్ర బిల్లులకు సంబంధించిన ప్రతిపాదనలు తదితరాలపైనా చర్చిస్తారు.

*****

 DS/TS

 


(Release ID: 1868069) Visitor Counter : 229