ప్రధాన మంత్రి కార్యాలయం

అక్టోబరు 9-11 తేదీలలో ప్రధానమంత్రి గుజరాత్‌ పర్యటన


11న ఉజ్జ‌యిని సంద‌ర్శన.. శ్రీ మ‌హాకాళ్ లోక్‌ను అంకితం చేయ‌నున్న ప్ర‌ధాని;

గుజరాత్‌లో రూ.14,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు
జాతికి అంకితం.. శంకుస్థాపన చేయనున్న ప్రధాని;

మోధేరాను దేశంలో తొలి 24 గంటల సౌరశక్తి గ్రామంగా
ప్రకటించనున్న పీఎం.. మెహసానాలో రూ.3900 కోట్లకుపైగా
విలువైన పలు ప్రాజెక్టులు అంకితం-శంకుస్థాపన;

మోధేశ్వరి మాత ఆలయంలో ప్రధాని దర్శనం-పూజలు...
మెహసానాలో సూర్య దేవాలయ సందర్శన;

రసాయన-ఔషధ రంగ ప్రాధాన్యంతో భరూచ్‌లో రూ.8000 కోట్ల
విలువైన ప్రాజెక్టులు అంకితం-శంకుస్థాపన చేయనున్న ప్రధాని;

అహ్మదాబాద్‌లో రూ. 1300 కోట్ల విలువైన ఆరోగ్య
సంరక్షణ సదుపాయాలు అంకితం-శంకుస్థాపన సహా
‘మోదీ షైక్షానిక్‌ సంకుల్’ తొలిదశను ప్రారంభించనున్న ప్రధాని;

జామ్‌నగర్‌లో రూ.1460 కోట్ల విలువైన సాగునీరు.. విద్యుత్.. నీటి సరఫరా.. పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అంకితం-శంకుస్థాపన

Posted On: 08 OCT 2022 12:04PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 9-11 తేదీల మధ్య గుజరాత్‌లో పర్యటించడంతోపాటు అక్టోబరు 11న మధ్యప్రదేశ్‌ను సందర్శిస్తారు. ఈ మేరకు ప్రధాని అక్టోబరు 9న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో మెహసానా జిల్లాలోని మోధెరా గ్రామంలో వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 6:45 గంటలకు మోధేశ్వరి మాత ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని, పూజలు చేయిస్తారు. అటుపైన రాత్రి 7:30 గంటలకు సూర్య దేవాలయానికి వెళ్తారు.

   అక్టోబరు 10వ తేదీ ఉదయం 11:00 గంటల ప్రాంతంలో ప్రధాని భరూచ్‌లోని అమోద్‌లో  పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3:15 గంటలకు అహ్మదాబాద్‌లో ‘మోదీ షేక్షానిక్‌ సంకుల్‌’ తొలిదశను ప్రధాని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు జామ్‌నగర్‌లో కొన్ని ప్రాజక్టులను అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేస్తారు.

   అక్టోబరు 11వ తేదీ మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రధానమంత్రి అహ్మదాబాద్‌లో అసర్వా ప్రజా వైద్యశాలలో వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేస్తారు. అటుపైన సాయంత్రం 5:45 గంటల ప్రాంతంలో ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వరాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని, పూజలు చేయిస్తారు. తర్వాత సాయంత్రం 6:30 గంటలకు శ్రీ మహాకాళ  లోక్‌ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం రాత్రి 7:15 గంటలకు ఉజ్జయినిలో బహిరంగ సభ నిర్వహిస్తారు.

మెహసానాలో ప్రధానమంత్రి

   ప్రధానమంత్రి మెహసానాలోని మోధెరా గ్రామంలో నిర్వహించే బహిరంగ సభకు అధ్యక్షత వహించి అదే వేదికపైనుంచి రూ.3,900 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగా మోధెరాను భారతదేశపు తొలి 24 గంటల సౌరశక్తి ఆధారిత గ్రామంగా ఆయన ప్రకటిస్తారు. సూర్య భగవానుడి నిలయంగా పేరొందిన మోధెరాను సంపూర్ణ సౌరశక్తి ఆధారిత గ్రామంగా రూపొందించాలన్న ప్రధానమంత్రి దార్శనికత మేరకు ఇలాంటి తొట్టతొలి ప్రాజెక్టు ఇక్కడ రూపుదాల్చింది. ఇందుకోసం నేలమీద ఒక సౌరశక్తి ఉత్పాదక ప్లాంటును నిర్మించి, గ్రామంలోని ప్రభుత్వ భవనాలు, ఇళ్ల పైకప్పులపై 1300కుపైగా సౌరశక్తి వ్యవస్థలను అమర్చారు. ఇవన్నీ ‘బ్యాటరీ విద్యుత్‌ నిల్వ వ్యవస్థ’ (బీఈఈఎస్‌)తో అనుసంధానం చేయబడ్డాయి. భారతదేశ పునరుత్పాదక ఇంధన శక్తి అట్టడుగు స్థాయి ప్రజలకు ఏ విధంగా సాధికారత కల్పిస్తుందో ఈ ప్రాజెక్టు విశదం చేస్తుంది.

   ప్రధానమంత్రి జాతికి అంకితం చేసే ప్రాజెక్టులలో- అహ్మదాబాద్-మెహసానా గేజ్ మార్పిడి ప్రాజెక్ట్లో భాగమైన సబర్మతి-జగుడాన్ సెగ్మెంట్ గేజ్ మార్పిడి; ఓఎన్‌జీసీ నందసన్ భూగర్భ చమురు ఉత్పత్తి ప్రాజెక్టు; ఖేరవ నుంచి షింగోడ సరస్సుదాకా నిర్మించిన ‘సుజలాం-సుఫలాం’ కాలువ; ధరోయ్ డ్యామ్ ఆధారిత వాద్‌నగర్ ఖేరాలు-ధరోయ్ గ్రూప్ సంస్కరణ పథకం; బేచ్రాజీ మోధేరా-చనస్మా రాష్ట్ర రహదారి పరిధిలో భాగమైన ఓ నాలుగు వరసల విస్తరణ ప్రాజెక్ట్; ఉంజా-దసజ్ ఉపేరా లాడోల్ (భాంఖర్ సంధాన మార్గం) విభాగం  విస్తరణ ప్రాజెక్టు; మెహసానాలో సర్దార్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రాంతీయ శిక్షణా కేంద్ర కొత్త భవనం; మోధేరాలోని సూర్య దేవాలయం వద్ద ప్రొజెక్షన్ మ్యాపింగ్ తదితరాలున్నాయి.

   మరోవైపు జాతీయ రహదారి నం.68లోని పటాన్-గొజారియా విభాగం నాలుగు వరుసల విస్తరణసహా పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇందులో మెహసానా జిల్లా జోటానా తాలూకా చలాసన్ గ్రామంలో నీటిశుద్ధి కేంద్రం; దూద్‌సాగర్ డెయిరీలో కొత్త స్వయంచలిత పాలపౌడర్ ప్లాంటు, యూహెచ్‌టీ పాల ప్యాకెట్‌ తయారీ ప్లాంటు; మెహసానా జనరల్ హాస్పిటల్ నవీకరణ-పునర్నిర్మాణం; ఉత్తర గుజరాత్‌లోని మెహసానాతోపాటు ఇతర జిల్లాల కోసం నవీకరించిన పంపిణీ రంగ పథకం తదితరాలున్నాయి.

   ఈ బహిరంగ కార్యక్రమం అనంతరం మోధేశ్వరి మాత ఆలయంలో ప్రధానమంత్రి అమ్మవారిని దర్శించుకుని, పూజలు చేయిస్తారు. అలాగే అక్కడి సూర్యదేవాలయంలోనూ దర్శనం చేసుకోవడంతోపాటు అద్భుతమైన ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ ప్రదర్శనను తిలకిస్తారు.

భరూచ్‌లో ప్రధానమంత్రి

   ప్రధానమంత్రి భరూచ్‌లోని అమోద్‌లో రూ.8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. ఔషధ రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేసేదిశగా మరో ముందడుగు పడింది. ఈ మేరకు జంబుసార్‌లో ముడి ఔషధ తయారీ (బల్క్‌ డ్రగ్‌) పార్కుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. మన 2021-22నాటి మొత్తం ఔషధ రంగ దిగుమతులలో 60 శాతం ఈ ముడి ఔషధాలే కావడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ నేపథ్యంలో బల్క్ డ్రగ్స్ దిగుమతులకు ప్రత్యామ్నాయానికి భరోసా ఇవ్వడంతోపాటు దేశ స్వావలంబన సాధనలో ఈ ప్రాజెక్ట్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇక పారిశ్రామిక వాడల నుంచి శుద్ధి చేయబడిన మురుగునీటి నిర్మూలనకు తోడ్పడే ‘సముద్రాంతర్భాగ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు దహేజ్ వద్ద ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అలాగే ప్రధాని శంకుస్థాపన చేసే మరికొన్ని ప్రాజెక్టులలో అంక్లేశ్వర్ విమానాశ్రయం తొలిదశసహా అంక్లేశ్వర్, పనోలిలో ‘ఎంఎస్‌ఎంఈ’ రంగానికి చేయూతనిచ్చే బహుళ అంచెల పారిశ్రామిక కేంద్ర అభివృద్ధి వగైరాలున్నాయి.

   సందర్భంగా బహుళ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి ప్రధానమంత్రి భూమిపూజ నిర్వహిస్తారు. వీటిలో నాలుగు గిరిజన పారిశ్రామిక పార్కులుండగా- వాలియా (భరూచ్‌), అమీర్‌గఢ్‌ (బనస్కాంత), చకాలియా (దహోద్‌), వనార్‌ (ఛోటా ఉదయ్‌పూర్‌)లలో ఇవి ఏర్పాటవుతాయి. అలాగే ముదేతా (బనస్కాంత)లో వ్యవసాయ-ఆహార పార్కు, కక్వాడీ దంతి (వల్సద్‌)లో సముద్ర ఆహార పార్కు, ఖందీవావ్‌(మహీసాగర్‌)లో ‘ఎంఎస్‌ఎంఈ’ పార్కు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

   కార్యక్రమాల్లో భాగంగా రసాయన రంగానికి ఉత్తేజమిచ్చే అనేక ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ మేరకు దహేజ్‌లో 800 ‘టీపీడీ’ సామర్థ్యంగల కాస్టిక్‌ సోడా ప్లాంటుతోపాటు దీనికి అనుబంధంగాగల 130 మెగావాట్ల సహ విద్యుదుత్పాదక ప్లాంటును ఆయన జాతికి అంకితం చేస్తారు. అలాగే దహేజ్‌లోని ప్రస్తుత కాస్టిక్ సోడా ప్లాంట్‌ సామర్థ్యాన్ని రోజుకు 785 ‘ఎంటీ’ నుంచి 1310 ‘ఎంటీ’ స్థాయికి పెంచిన నేపథ్యంలో దీన్ని కూడా ప్రధాని అంకితం చేయనున్నారు. దహేజ్‌లో ఏటా లక్ష టన్నులకుపైగా క్లోరోమీథేన్‌ వాయువుల తయారీ సంబంధిత ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి అంకితం చేస్తారు. ఆయన అంకితం చేయనున్న మరికొన్ని ప్రాజెక్టులలో- దహేజ్‌లోని హైడ్రాజైన్ హైడ్రేట్ ప్లాంట్ ఒకటి. ఇది సదరు ఉత్పత్తి దిగుమతికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటైంది. ఇక ఐవోసీఎల్‌ దహేజ్-కోయాలి పైప్‌లైన్ ప్రాజెక్ట్, భరూచ్ భూగర్భ డ్రైనేజీ-ఎస్టీపీ పనులుసహా ఉమ్లా అసా పనేత రహదారి విస్తరణ-పటిష్టీకరణ ప్రాజెక్టు కూడా ఉన్నాయి.

అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి

   ప్రధానమంత్రి అక్టోబరు 10వ తేదీన ఆపన్నులైన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన విద్యా ప్రాంగణం ‘మోదీ షేక్షానిక్‌ సంకుల్‌’ తొలిదశను ప్రారంభిస్తారు. విద్యార్థుల సమగ్ర ప్రగతికి అవసరమైన సదుపాయాలను సమకూర్చడంలో ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. అటుపైన అక్టోబరు 11వ తేదీ అహ్మదాబాద్‌లోని అసర్వా పౌర వైద్యశాల ప్రాంగణంలో రూ.1300 కోట్ల విలువైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను ప్రధానమంత్రి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని అంకితం చేయనున్న ప్రాజెక్టులలో గుండె జబ్బుల చికిత్సకు ఉద్దేశించిన మెరుగైన సౌకర్యాలతోపాటు యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో కొత్త హాస్టల్ భవనం కూడా ఉంది. అలాగే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ కొత్త ఆసుపత్రి భవనం; గుజరాత్ కేన్సర్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ కొత్త భవనంసహా నిరుపేద రోగుల కుటుంబాలకు వసతికి ఉద్దేశించిన షెల్టర్ హోమ్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

జామ్‌నగర్‌లో ప్రధానమంత్రి

   ప్రధానమంత్రి జామ్‌నగర్‌లో సాగునీరు, విద్యుత్, నీటి సరఫరా, పట్టణ మౌలిక సదుపాయాలకు సంబంధించిన రూ.1460 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. అలాగే సౌరాష్ట్ర అవతరణ్ ఇరిగేషన్ (SAUNI) యోజన లింక్-3 (ఉండ్ డ్యామ్ నుంచి సోన్మతి డ్యామ్ వరకు), సౌనీ యోజన లింక్-1లోని ప్యాకేజీ 5 (ఉండ్-1 డ్యామ్ నుంచి శాని డ్యామ్ వరకు), హరిపర్ 40 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్ట్ ప్యాకేజీ-7ను ప్రధాని అంకితం చేస్తారు. ఇక శంకుస్థాపన చేసే ప్రాజెక్టులలో- కలవాడ్/జామ్‌నగర్ తాలూకా మోర్బి-మలియా-జోడియా గ్రూప్ సత్వర నీటి సరఫరా పథకం, లాల్‌పూర్ బైపాస్ జంక్షన్ ఫ్లైఓవర్ వంతెన, హాపా మార్కెట్ యార్డ్ రైల్వే క్రాసింగ్, మురుగు సేకరణ పైప్‌లైన్‌ - పంపింగ్‌ స్టేషన్‌ సంబంధిత పునర్నవీకరణ తదితరాలున్నాయి.

ఉజ్జయినిలో ప్రధానమంత్రి

   ప్రధానమంత్రి శ్రీ మ‌హాకాళ్‌ లోక్‌ని జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ తొలిదశ కింద ప్రపంచస్థాయి ఆధునిక సౌకర్యాల కల్పనతో ఆలయ సందర్శనలో యాత్రికులకు మెరుగైన అనుభవం దక్కుతుంది. ఈ ప్రాంతమంతటా రద్దీ తగ్గింపు, వారసత్వ కట్టడాల పరిరక్షణ- పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దీనికింద ఆలయ ప్రాంగణాన్ని దాదాపు ఏడు రెట్లు విస్తరిస్తారు. దీని మొత్తం వ్యయం దాదాపు రూ.850 కోట్లు. ఈ ప్రాజెక్టు పూర్తికి రెండుదశల ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఏటా దాదాపు 1.5 కోట్ల మంది ఆలయాన్ని సందర్శిస్తుండగా అభివృద్ధి పనులు పూర్తయ్యాక ఈ సంఖ్య రెట్టింపు కాగలదని భావిస్తున్నారు.

   మహాకాళ మార్గంలో 108 స్తంభాలున్నాయి, ఇవి శివుని ఆనంద తాండవ రూపాన్ని  (నృత్య రూపం) ప్రతిబింబిస్తాయి. శివుని జీవితాన్ని వర్ణించే అనేక మతపరమైన శిల్పాలు మహాకాళ్‌ మార్గంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ మార్గం వెంబడిగల కుడ్య చిత్రాలు శివ పురాణ గాథలైన సృష్టి మూలం, గణేశ జననం, దక్షుడు-సతీదేవి వృత్తాంతం వగైరాలను కళ్లకు కడతాయి. మొత్తం 2.5 హెక్టార్లలో విస్తరించిన ప్లాజా ప్రాంతం చుట్టూ తామర చెరువుంది. వీటితోపాటు ఫౌంటైన్ల నడుమ శివుని విగ్రహం కూడా ఉంది. కృత్రిమ మేధస్సు, నిఘా కెమెరాలతో ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ మొత్తం ఆవరణను 24 గంటలూ పర్యవేక్షిస్తూంటుంది.

***



(Release ID: 1866243) Visitor Counter : 167