జల శక్తి మంత్రిత్వ శాఖ
జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛభారత్ దివస్-2022’
కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత..
ఎస్.బి.ఎం.జి., జె.జె.ఎం.లో అవార్డు గ్రహీతలకు
రాష్ట్రపతి చేతులమీదుగా సత్కారం..
స్వచ్చసర్వేక్షణ్, జె.జె.ఎం. మధింపుపై నివేదికల
తొలి ప్రతులను రాష్ట్రపతికి అందించిన
జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్..
Posted On:
02 OCT 2022 7:54PM by PIB Hyderabad
స్వచ్ఛతా స్ఫూర్తి అయిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలోని తాగునీరు, పారిశుద్ధ్య శాఖ (డి.డి.డబ్ల్యు.స్.) ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ భారత్ దివస్-2022 కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించారు. స్వచ్ఛ భారత్ లక్ష్యసాధనకోసం ఈ సంవత్సరం, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల చేసే కృషిని ప్రోత్సహించి, అభినందించడానికి, బహిరంగ మల విసర్జన రహిత (ఒ.డి.ఎఫ్. ప్లస్) ప్రాంతాల ఏర్పాటును, ప్రతి ఇంటికీ నీటి సరఫరా (హర్ ఘర్ జల్) కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేయడానికి. సమగ్ర పారిశుధ్యం సాధన దిశగా దేశంలో జనోద్యమాన్ని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా, స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) (ఎస్.బి.ఎం.-జి.), జల జీవన్ మిషన్ (జె.జె.ఎం.) కార్యక్రమాల అమలులో ప్రతిభ చూపించి, పురస్కారాలను అందుకున్న వారిని రాష్ట్రపతి సత్కరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్.ఎస్.జి.) 2022, స్వచ్ఛతా హీ సేవా 2022, సుజలాం 1.0-2.0, జె.జె.ఎం. పనితీరు మధింపు, ప్రతి ఇంటికీ నీటి సరఫరా ధ్రువీకరణ వంటి అంశాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ సందర్భంగా అవార్డుల ప్రదానం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, జలశక్తి- గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు, జలశక్తి , ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ఘన, జల వ్యర్థాల నిర్వహణ (ఎస్.ఎల్.డబ్ల్యు.ఎం.) అమలులో, సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించి, వినియోగించినందుకు స్టార్టప్ గ్రాండ్ చాలెంజ్ అవార్డులలు గెలుచుకున్న విజేతలకు ఈ కార్యక్రమంలో సత్కారం జరిగింది. ఒ.డి.ఎఫ్. ప్లస్ అనే ఇతివృత్తానికి సంబంధించిన వివిధ విభాగాలపై గ్రామ పంచాయతీలకు నిర్వహించిన జాతీయ ఫిల్మ్ పోటీల్లో, స్వచ్ఛ భారత్ గ్రామీణ్ పథకం అమలుపై జరిగిన జాతీయ స్థాయి వాల్ పెయింటింగ్ పోటీల్లో విజేతలైన వారికి కూడా సత్కారం జరిగింది. 2022వ సంవత్సరపు స్వచ్ఛ సర్వేక్షణ్, జె.జె.ఎం. పనితీరు మధింపు కార్యక్రమాలపై రూపొందించిన నివేదికల తొలి ప్రతులను ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట్రపతికి అందించారు.
ఈ సందర్భంగా పెద్ద రాష్ట్రాల విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్- 2022 అవార్డులను తెలంగాణ, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు ప్రదానం చేశారు.; చిన్న రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో అండమాన్-నికోబాబ్ దీవులు, దాద్రా నాగర్ హవేళీ-డయ్యూ డామన్, సిక్కింలకు అవార్డులు లభించాయి. హర్యానా రాష్ట్రంలోని బివానీ జిల్లాకు ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా అవార్డు లభించింది. అనంతరం జలజీవన్ మిషన్ అమలులో పనితీరు మధింపునకు సంబంధించిన అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. జలజీవన్ మిషన్ కింద 60శాతానికి మించి ఇళ్లకు నీటి కుళాయిలను అమర్చిన విభాగంలో పుదుచ్చేరి, గోవాలకు సత్కారం దక్కింది.; 60శాతానికంటే కంటే తక్కువగా కుళాయి నీటి కనెక్షన్ల ఏర్పాటు విభాగంలో తమిళనాడు మొదటి స్థానం, మేఘాలయ రెండవ స్థానం పొందాయి. ప్రతి ఇంటికీ నీటి సరఫరా (‘హర్ ఘర్ జల్’) విభాగంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్‌పూర్ జిల్లాకు దేశంలోనే మొదటి సర్టిఫికేట్ పొందిన జిల్లాగా గుర్తిస్తూ రాష్ట్రపతి అవార్డును అందించారు, ఆ జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలు తమను తాము ‘హర్ ఘర్ జల్’గా గ్రామసభల ద్వారా ప్రకటించుకున్నాయి.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, గాంధీజీ ఆలోచనలు, భావనలు మనమంతా ఎప్పటికైనా అనసరించదగిననవని, శాశ్వతమైనవని అన్నారు. సత్యం, అహింస లాగానే పరిశుభ్రతకు కూడా జాతిపిత ప్రాధాన్యం ఇచ్చారన్నారు. జాతిపిత జయంతిని 'స్వచ్ఛ భారత్ దివస్'గా జరుపుకోవడం ఆయనకు మనం సమర్పించే సముచితమైన నివాళి అన్నారు. మొదటి నుంచీ చిన్నపిల్లలకు పరిశుభ్రతను అలవాటు చేస్తే వారు తమ జీవితాంతం పరిశుభ్రతపై స్పృహతో ఉంటారని గాంధీజీ భావించారని, పారిశుద్ధ్యం అనేది శతాబ్దాలుగా భారతీయ సంస్కృతి, జీవనశైలిలో అంతర్భాగంగా కొనసాగుతోందని రాష్ట్రపతి అన్నారు. 'స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్)' పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి, పదకొండు కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. మలవిసర్జన కోసం బహిరంగ స్థలాలకు వెళ్లే అలవాటును దాదాపు 60 కోట్ల మంది మార్చుకున్నారు. ఈ పథకం ద్వారా, 2030వ సంవత్సరానికంటే పదకొండేళ్ల ముందుగానే, అంటే 2015లోనే, ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యం 6 (ఎస్,డి.జి.-6)ను భారతదేశం సాధించిందని రాష్ట్రపతి అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవడం, కుళాయిల ద్వారా ఇళ్లకు నీటి సరఫరా ఏర్పాటు, వంటివి కోవిడ్ -19 మహమ్మారి వైరస్ వ్యాప్తి సమయంలో ప్రజలకు రక్షణగా నిలిచాయని అందరూ గ్రహించారని అన్నారు. జల్ జీవన్ మిషన్ గురించి రాష్ట్రపతి మాట్లాడుతూ, 2019లో ఈ పథకాన్ని ప్రకటించే సమయానికి, దేశంలో కేవలం 3.23కోట్ల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి సరఫరా ఏర్పాట్లు ఉన్నాయని, గత మూడేళ్లలో ఈ సంఖ్య 10.27 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇళ్లకు నీటి వసతి కల్పించడం వల్ల నీటి ద్వారా వచ్చే వ్యాధులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. నీటి నిర్వహణ, పారిశుద్ధ్య రంగాల్లో ప్రపంచానికి మనం ఆదర్శంగా నిలవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2022, జలజీవన్ మిషన్ అమలుపై మధింపునకు సంబంధించిన మిగిలిన అవార్డులన్నింటినీ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పాటు జలశక్తి సహాయ మంత్రులు – ష. బిశ్వేశ్వర్ తుడు, ప్రహ్లాద్ సింగ్ పటేల్ విజేతలకు అందించారు. ఇతర విభాగాల విజేతలకు కూడా మంత్రుల కమిటీ అవార్డులను ప్రదానం చేసింది. అన్ని విభిన్న వర్గాల్లో అవార్డులు గెలుచుకున్న విజేతల పూర్తి జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది
(అవార్డ్ గ్రహీతల జాబితా కోసం లింక్.).
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వచ్ఛ్ భారత్ మిషన్ కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే కాకుండా జనోద్యమంగా రూపాంతరం చెందిందని, గ్రామీణ భారతదేశ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసిందని అన్నారు. స్వచ్ఛతా హీ సేవా (ఎస్.హెచ్.ఎస్.) 2022 పేరిట పక్షం రోజులపాటు నిర్వహించిన ప్రచారంలో ప్రజలు 'శ్రమదాన్' రూపంలో పాల్గొన్నందుకు షెకావత్ కృతజ్ఞతలు తెలిపారు; అంతేకాక, ఎస్.హెచ్.ఎస్. 2022 అమలులో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను ఆయన అభినందించారు. జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) అమలు చేయడంలో తమ లక్ష్యం కేవలం కుళాయి నీటిని అందించడం మాత్రమే కాదని, తగిన పరిమాణంలో, నాణ్యమైన నీటిని అందించడం తమ ధ్యేయమని స్పష్టంచేశారు. పథకం అమలులో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు చేసిన కృషిని ఆయన అభినందించారు. తొలిసారిగా స్వజల్, స్వచ్ఛప్రదేశ్‌లుగా మారిన అండమాన్-నికోబార్ కేంద్రపాలిత ప్రాంతాన్ని అయన అభినందించారు. అంటే అండమాన్, నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని అన్ని గ్రామాలు ఇప్పుడు ‘హర్ ఘర్ జల్’గా, ఒ.డి.ఎఫ్. ప్లస్‌గా ధ్రువీకరణ పత్రాన్ని సాధించాయి. రాజకీయ సంకల్పం, ప్రభుత్వ నిధులు, ప్రజలు పాల్గొనడం, జన భాగస్వామ్యం వంటి అంశాలతో ఏదైనా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధానమంత్రి ప్రవచించిన “4 పి”ల మంత్రాన్ని కేంద్రమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ కన్న కలను సాకారం చేసేందుకు, స్వచ్ఛ భారత్ మిషన్, ఉజ్వల యోజన, జలజీవన్ మిషన్ వంటి వివిధ పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో దార్శనిక దృష్టితో ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమాలు దేశంలోని గ్రామీణ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయని, ప్రజల భాగస్వామ్యంతో ఈ పథకాలు జనోద్యమాలుగా మారాయని అన్నారు.
కేంద్ర జలశక్తి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ మాట్లాడుతూ, స్వచ్ఛతను ఒక ప్రతినగా, జీవిత లక్ష్యంగా మార్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి నిర్వహణ ప్రాముఖ్యతను గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
కేంద్ర జల శక్తి , గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు మాట్లాడుతూ, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల కింద దేశవ్యాప్తంగా అనేక మంచి పనులు జరగడం ప్రశంసనీయమని అన్నారు. పథకాలు విజయవంతం కావాలంటే, ప్రజా సంఘాల భాగస్వామ్యం, వివిధ భాగస్వామ్య వర్గాల మధ్య మెరుగైన సమన్వయం చాలా అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కింది విభాగాలకు సంబంధించిన పథకాలకు అవార్డుల ప్రదానం జరిగింది.
1. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2022: స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ (ఎస్.బి.ఎం.-జి.) రెండవ దశ కీలక గుణాత్మక ప్రమాణాలపై పనితీరు ఆధారంగా రాష్ట్రాలకు, జిల్లాలకు ర్యాంకింగ్‌ను నిర్ధారించడం ఈ సర్వే కార్యక్రమం లక్ష్యం. భారతదేశం అంతటా 33 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో (చండీగఢ్, ఢిల్లీ, లక్షద్వీప్ వంటి 3 కేంద్రపాలిత ప్రాంతాలు మినహా), అంటే 709 జిల్లాల్లోని 17,559 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని వర్తింపజేశారు. ఎస్.బి.ఎం.(జి)కి సంబంధించిన వివిధ సమస్యలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు 1.75 లక్షలకు పైగా ఇళ్లకు వెళ్లి ఇంటర్వ్యూ చేశారు.
2. స్వచ్ఛతా హీ సేవ (ఎస్,హెచ్.ఎస్.) 2022: గరిష్ఠ సంఖ్యలో కార్యకలాపాలు నిర్వహించి, నివేదించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై ఈ కార్యక్రమం నిర్వహించారు. అంటే.. ప్రజలు శ్రమదాన్, పారిశుద్ధ్య కార్యకలాపాల్లో పాల్గొన్న తీరు, బహిరంగ స్థలాల, సంస్థాగత భవనాలను శుభ్రపరచడం, వ్యర్థ ప్రదేశాలను శుభ్రం చేసిన తీరు, నీటి వనరుల చుట్టూ నాటిన చెట్లు, 'ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్ వ్యస్థాల'పై నిషేధం కోసం గ్రామపంచాయతీలు తీర్మానాన్ని ఆమోదించడం, ఒ.డి.ఎఫ్. ప్లస్ అంశంపై చర్చల్లో సర్పంచ్‌లు పాల్గొతీరు, అవగాహన కార్యక్రమాలలో ప్రజలు పాల్గొనడం, వ్యర్థాల సేకరణకు, వేరుచేసేందుకు షెడ్‌ల నిర్మాణం, తదితర ఎస్.హెచ్.బెచ్. కార్యకలాపాలలో ప్రజలు భాగస్వామ్యం వంటి అంశాల్లో పలు కార్యకలాపాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభను కనబరిచిన వారిని విజేతలుగా ఎంపిక చేశారు.
3. జల్ జీవన్ మిషన్ (జె.జె.ఎం.) –పనితీరుపై మధింపు: జె.జె.ఎం. కింద, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని స్థానిక నీటి వినియోగాల పనితీరును మధింపుచేయడానికికి, గృహాలకు నీటి సరఫరా సేవల స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రతి ఏడాదీ కార్యాచరణ మధింపు కసరత్తును చేపడతారు. నీటి కనెక్షన్ ఈ దిగున పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే సదరు కనెక్షన్ పనిచేస్తున్నట్టుగా పరిగణిస్తారు. : (i) తగినంత నీటి సరఫరా,(అంటే రోజుకు ఒక్కొక్కరికి 55లీటర్లు లేదా, అంతకంటే ఎక్కువ పరిమాణంలో సరఫరా); (ii) స్వచ్ఛమైన తాగునీటి సరఫరా/ నిర్దేశించిన నాణ్యత (బి.ఐ.ఎస్.:10500); (iii) క్రమ పద్ధతిలో నీటి సరఫరా, అనగా రోజువారీ లేదా షెడ్యూల్ ప్రకారం అందించడం. మొత్తం 33 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, 712 జిల్లాల్లోని 13,299 నమూనా గ్రామాలలో ఉండే, 3.01 లక్షల గృహాల్లో, 22,596 గ్రామ స్థాయి పాలనా సంస్థల పరిధిలో కార్యాచరణపై మధింపు కసరత్తును నిర్వహించారు.
4.స్టార్టప్ గ్రాండ్ చాలెంజ్: గ్రామీణ ప్రాంతాల్లోని ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లకు సుస్థిరమైన, ఆచరణీయమైన, ప్రతిస్పందనా పూర్వకమైన పరిష్కారాల విషయంలో తగిన మద్దతు ఇవ్వగల సాంకేతిక పరిజ్ఞానం రూపకల్పనకు స్టార్ట్-అప్ గ్రాండ్ ఛాలెంజ్ పేరి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రౌడ్ సోర్సింగ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని 2021వ సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రారంభించారు. తొలి నెలరోజుల వరకూ దీనిపై కేంద్ర తాగునీటి సరఫరా శాఖ (డి.డి.డబ్ల్యు.ఎస్.) వెబ్‌సైట్లో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. మొత్తం 372 మంది దరఖాస్తుదారులు తమపేర్లు నమోదు చేసుకోగా, అందులో 62 దరఖాస్తులు ఎంపికయ్యాయి. విజేతలుగా నిలిచినవారికి రూ. 2 లక్షలు, లక్ష చొప్పున నగదు బహుమతులను అందించారు.
5. హర్ ఘర్ జల్ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు-జిల్లాలు: దేశంలో మొట్టమొదటి ‘హర్ ఘర్ జల్’గా ధ్రువీకరణ పత్రాన్ని పొందిన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు. వందశాతం గ్రామాల్లో ప్రతి ఇంటికీ నీటిసరఫరా ఏర్పాటు చేసినట్టు ధ్రువీకరణ పొందిన 31 జిల్లాలకు అవార్డులను కూడా అందించారు. తమ గ్రామాన్ని 'హర్ ఘర్ జల్'గా గ్రామసభ ఆమోదించిన తీర్మానం ద్వారా అన్ని గ్రామాల ప్రజలు ప్రకటించారు. ఏ ఒక్క ఇంటికీ మినహాయింపు లేకుండా గ్రామాల్లోని అన్ని గృహాలకు నీటిసరఫరా ఉందని ఇది ధ్రువీకరిస్తుంది. ఈ కార్యక్రమంకింద అన్ని ఇళ్లకు కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది.
6. సుజలామ్ 1.0-2.0: సుజలాం అనేది వంద రోజుల పాటు మురుగునీటిని నిర్వహణకు చేపట్టిన కార్యక్రమం. సోక్ పిట్‌లు, లీచ్‌పిట్, మ్యాజిక్ పిట్‌ల ద్వారా మురుగునీటి నిర్వహణ లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. వ్యర్థ జలాలు అతితక్కువ స్థాయిలో నిలిచిపోయేలా చేసిన ఏర్పాట్లను ఈ కార్యక్రమం కింద తనిఖీ చేస్తారు. గృహాలకు అనుబంధించిన సోక్‌పిట్ల సంఖ్యను, ప్రజా సంఘాల సోక్ పిట్‌ల సంఖ్యను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ. పోర్టల్‌కు నివేదించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం కింద మొత్తం 23,04,029 పిట్లను నిర్మించారు. ఈ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు అవార్డులు అందజేశారు.
7. జాతీయ చలనచిత్ర పోటీ: ఒ.డి.ఎఫ్. ప్లస్ కార్యక్రమానికి సంబంధించిన వివిధ విభాగాలపై గ్రామ పంచాయితీల స్థాయిలో చలనచిత్రాలను రూపొందించే ప్రక్రియపై జాతీయ స్థాయి పోటీని నిర్వహించారు. 2021 డిసెంబరు 15 నుంచి 2022 మే నెల 15వ తేదీ వరకు ఈ పోటీ జరిగింది. ఈ కేటగిరిలో మొత్తం 33 చిత్రాలను రాష్ట్రాలు సిఫార్సు చేశాయి. 3 విభిన్న కేటగిరీల్లో అవార్డులను అందించారు. కొండ ప్రాంతాలు, దీవులు, కేంద్ర పాలిత ప్రాంతాలు-రాష్ట్రాల కేటగిరీల్లో ఈ అవార్డులు అందించారు.
8. నేషనల్ వాల్ పెయింటింగ్ పోటీ: ఒ.డి.ఎఫ్.ప్లస్ ప్లస్ ఇతివృత్తాలకు (థీమ్‌లకు) సంబంధించి వాల్ పెయింటింగ్‌లపై 2021 ఆగస్టు 15నుంచి, 2021 అక్టోబరు 5వరకూ వరకు గ్రామీణ ప్రాంతాల్లో పోటీ నిర్వహించారు. ప్రతి 5 థీమ్‌లపై (బయో-డిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్‌మెంట్-బి.డబ్ల్యు.ఎం., గోబర్ధన్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ-పి.డబ్ల్యు.ఎం., మురుగునీటి నిర్వహణ-జి.డబ్ల్యు.ఎం., మల వ్యర్థాల నిర్వహణ –ఎఫ్.ఎస్.ఎం. వంటి 5 ధీమ్‌లపై) ఈ పోటీ నిర్వహించారు. దేశంలోని ఆరు జోన్లలో- ప్రతి జోన్‌నుంచి, అంటే నార్త్ జోన్, ఈశాన్య జోన్, సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్ నుంచి ప్రాతినిధ్యంతో ఈ పోటీ నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్.ఎస్.జి.) 2022 నివేదికను, జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) పనితీరుపై మధింపు -2022 నివేదికను కేంద్ర జలశక్తి మంత్రి విడుదల చేశారు. ఈ నివేదికల తొలి ప్రతులను భారత రాష్ట్రపతికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో 2023న సంవత్సరానికి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్.ఎస్.జి.), జలజీవన్ సర్వేక్షణ్ (జె.జె.ఎస్.) కార్యక్రమాలను కూడా కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటించారు. ఇంకా, ఈ క్రింది ప్రచారోద్యమ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది:
- "రెట్రోఫిట్ టు ట్విన్ పిట్ అభియాన్": మెరుగైన మల వ్యర్థాల నిర్వహణ దిశగా ఇళ్లలో ట్విన్ పిట్ మరుగుదొడ్లను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
- ‘స్వచ్ఛ్ జల్ సే సురక్ష’: నీటి నాణ్యతపై ప్రచారం, స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు అందించే నీటి నాణ్యతను పర్యవేక్షించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఈ కార్యక్రమానికి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు, ప్రభుత్వ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, అభివృద్ధికి సంబంధించిన భాగస్వాములు, తదితరులు హాజరయ్యారు.
****
(Release ID: 1864693)
Visitor Counter : 240