శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025 నాటికి భారత జియోస్పేషియల్ ఆర్థిక వ్యవస్థ 12.8% వృద్ధి రేటుతో రూ. 63,100 కోట్లు దాటుతుందని అంచనా :కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 02 OCT 2022 4:58PM by PIB Hyderabad

2022 అక్టోబర్ 10-14 నుండి హైదరాబాద్‌లో జరగనున్న రెండవ ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (UNWGIC) సదస్సు వివరాలు వెల్లడించిన  డాక్టర్ జితేంద్ర సింగ్
సదస్సుకు హాజరుకానున్న 120 దేశాలకు చెందిన  700 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులతో సహా   దాదాపు  2000 మంది ప్రతినిధులు
 ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యల శాశ్వత పరిష్కారం కోసం భారతదేశం సాంకేతికతను ఎలా ఉపయోగిస్తుందో అని ప్రపంచం చూస్తోంది. డాక్టర్ జితేంద్ర సింగ్
జియోస్పేషియల్ సమాచార, సాంకేతిక వినియోగం ఎక్కువ చేయడం ద్వారా బహుళ ఆర్థిక వ్యవస్థ దేశంలో అభివృద్ధి చెందుతుంది  ...  డాక్టర్ జితేంద్ర సింగ్
హైదరాబాద్, అక్టోబర్ 2: 2025 నాటికి భారత జియోస్పేషియల్ ఆర్థిక వ్యవస్థ  12.8% వృద్ధి రేటుతో  63,100 కోట్ల రూపాయలు  దాటుతుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్ర,సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు,ప్రజా ఫిర్యాదులు,అంతరిక్షం అణుశక్తి శాఖ సహాయ మంత్రి ( స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఉత్పాదకతను పెంపొందించడం, స్థిరమైన మౌలిక సదుపాయాల ప్రణాళిక, సమర్థవంతమైన పరిపాలన మరియు వ్యవసాయ రంగానికి సహాయం చేయడం ద్వారా జియోస్పేషియల్ టెక్నాలజీ సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో కీలకమైన అంశాలలో  ఒకటిగా గుర్తింపు పొందిందని  ఆయన అన్నారు. భారతదేశంలో అన్ని వర్గాలకు  ప్రయోజనం కలిగించే విధంగా  బహుళ రంగాల్లో జియోస్పేషియల్ వినియోగ  పరిధిని విస్తరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో  కేంద్ర  ప్రభుత్వం కృషి చేస్తున్నదని   మంత్రి తెలిపారు.
 హైదరాబాద్ లో అక్టోబర్ 10 నుంచి 14 వరకు జరగనున్న  ఐక్యరాజ్యసమితి రెండవ ప్రపంచ  జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (UNWGIC) సదస్సు వివరాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ఢిల్లీలో పత్రిక ప్రతినిధులకు వివరించారు. ప్రజలకు డిజిటల్ సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో జరగనున్న ప్రపంచ  జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుందని మంత్రి అన్నారు. .ప్రణాళిక అమలు, ఈ-పరిపాలన,  అందుబాటులో ఉన్న వనరులను మెరుగ్గా వినియోగించుకోవడం లాంటి అంశాలలో నిర్ణయాలు తీసుకునేందుకు  భౌగోళిక /జిఐఎస్ ఆధారిత సౌకర్యాలు వినియోగించుకునే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
హైదరాబాద్ సదస్సులో దాదాపు 2000 మంది ప్రతినిధులు పాల్గొంటారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 700 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో సహా 120 దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారని వివరించారు. జియోస్పేషియల్ కాంగ్రెస్ లో  255 సంవత్సరాల చరిత్ర గల సర్వే ఆఫ్ ఇండియా వంటి జాతీయ స్థాయి  మ్యాపింగ్ సంస్థలు, సీనియర్ అధికారులు, ప్రభుత్వేతర సంస్థలు, విద్యా సంస్థలు,పరిశ్రమలు, వినియోగదారు మరియు ప్రైవేటు రంగానికి చెందిన పలు అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయి. ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలూ, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించేందుకు గత 8 సంవత్సరాలుగా ప్రభుత్వం కృషి చేస్తున్నాదని  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
 నవ భారతదేశం నిర్మాణం జరగాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలను సాకారం చేసేందుకు ప్రజలందరికీ నీరు, ఆరోగ్యం,విద్య, పారిశుధ్యం, గృహ వసతి అందించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తున్నదని అన్నారు. జియోస్పేషియల్ రంగంలో  జాతీయ భౌగోళిక మరియు మ్యాపింగ్ సంస్థలు , వాణిజ్య రంగం మరియు వినియోగదారు పరిశ్రమల పాత్ర కీలకంగా ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మరియు టెక్నాలజీ వినియోగించుకోవడం వల్ల త్వరితగతిన  బహుళ-రంగ  ఆర్థిక వృద్ధి లక్ష్యాలను మరియు స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు   అవకాశం కలుగుతుందని మంత్రి తెలిపారు.

జియోస్పేషియల్ టెక్నాలజీ మరియు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) భారతదేశం ఈ సాంకేతికతను అవలంబిస్తున్న విధానంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న  ప్రధాన  సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం  సాంకేతికతను ఎలా ఉపయోగిస్తుంది అన్న అంశాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఆయన అన్నారు.
సమస్యల పరిష్కారానికి  జియోస్పేషియల్ సాంకేతికత ప్రభుత్వానికి ఉపయోగపడిందని  డాక్టర్ జితేంద్ర సింగ్  అన్నారు.  జియోస్పేషియల్ సాంకేతికత ద్వారా భౌగోళిక, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు టీకా కేంద్రాల వంటి అంశాలకు సంబంధించిన స్పష్టమైన  ఖచ్చితమైన  సమాచారం అందుబాటులో ఉండడంతో కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఏర్పడిన  అత్యవసర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వం విజయం సాధించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.  అభివృద్ధి పథకాలను రూపొందించి వాటిని మరింత పటిష్టంగా  అమలు చేయడం కోసం  మొత్తం గ్రామీణ రంగాన్ని డిజిటలైజ్ చేసి ప్రభుత్వం మ్యాపింగ్ చేస్తుందని  ఆయన తెలిపారు.
 మ్యాప్‌లోని 21 డేటా లేయర్‌లను ఉపయోగించి 45 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మ్యాప్ చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దీనివల్ల పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు  నీటి వనరులు, అడవులు, నివాస ప్రాంతాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మ్యాపింగ్ మరియు డిజిటలైజేషన్ పథకం కింద దాదాపు 2.6 లక్షల గ్రామ పంచాయతీల సర్వేను  మంత్రిత్వ శాఖ పూర్తి చేసిందని  ఆయన చెప్పారు.
 దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జియోస్పేషియల్  రంగంలో  వివిధ విధానపరమైన  సంస్కరణలు చేస్తూ  ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి అనుకూలమైన పరిస్థితులు, అవకాశాలను   అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నదని  డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.  జియోస్పేషియల్ డేటా కోసం రూపొందించిన మార్గదర్శకాలు, డ్రోన్ రూల్స్ 2021 మరియు ముసాయిదా విధానాలు  (జియోస్పేషియల్, రిమోట్ సెన్సింగ్ మరియు శాటిలైట్ నావిగేషన్) దేశంలో జియోస్పేషియల్ రంగంలో  ప్రణాళిక మరియు పర్యవేక్షణ అవసరాల కోసం  సమాచార సేకరణ, సమాచార వినియోగ అంశాలను సరళీకృతం చేసి, వాణిజ్య అవకాశాలను ఎక్కువ చేస్తాయని  అన్నారు.  
జాతీయ మరియు ప్రపంచ అభివృద్ధి లక్ష్యాలను అమలు చేయడంలో సమగ్ర భౌగోళిక సమాచార నిర్వహణ  కీలక పాత్రను ప్రభుత్వం  గుర్తించిందని శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ   కార్యదర్శి శ్రీ ఎస్. చంద్రశేఖర్  తెలిపారు. జియోస్పేషియల్ రంగం మరింత అభివృద్ధి సాధించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.  స్థానిక, జాతీయ, ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయిలో జియోస్పేషియల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందాయని అన్నారు.  స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను (SDGs) సాధించేందుకు  వినూత్న,పటిష్టమైన  ఆచరణ సాధ్యమైన  పరిష్కారాలను అభివృద్ధి చేయడం ద్వారా జియోస్పేషియల్  సేవల సామర్ద్యాన్ని పెంపొందించడానికి ప్రపంచ దేశాలతో  కలిసి పని చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని  ఆయన అన్నారు.
                 రెండవ ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ గురించి
ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ (UN-GGIM) నియమించిన  గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (UN-GGIM)  రెండవ ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ 2022 సమావేశాలను  ఐక్యరాజ్యసమితి  ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం  కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తుంది.
ఇతివృత్తం మరియు ముఖ్యాంశాలు
i. కోవిడ్  19 మహమ్మారి వల్ల ఏర్పడిన  సామాజిక-ఆర్థిక ప్రభావం నుంచి ప్రపంచం కోలుకుంటున్న సమయంలో జరుగుతున్న  ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్  2022  ' జియో ఆధారిత ప్రపంచం అభివృద్ధి.  ఎవరూ వెనుకబడి ఉండకూడదు' అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ జరుగుతుంది.  స్థిరమైన అభివృద్ధి మరియు మానవ జాతి శ్రేయస్సు, పర్యావరణ మరియు వాతావరణ సవాళ్లను పరిష్కరించడం, డిజిటల్ పరివర్తన మరియు సాంకేతిక అభివృద్ధిని స్వీకరించడం మరియు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం వంటి అంశాల్లో సమగ్ర భౌగోళిక సమాచారం ప్రాధాన్యతపై కూడా సదస్సు దృష్టి సారిస్తుంది. . ఆజాదికా అమృత మహోత్సవ్ వేడుకల నేపథ్యంలో “సబ్‌కాసాత్, సబ్‌కావికాస్” అన్న ప్రధానమంత్రి స్పూర్తితో సదస్సు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి

***


(Release ID: 1864681) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi , Tamil