సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మీడియా, వినోద రంగం వృద్ధికి 100 బిలియన్ డాలర్ల లక్ష్యం!
2030నాటికి ఇది సాధించాలన్న
సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి...
ఫిక్కీ ఫ్రేమ్స్ ఫాస్ట్ ట్రాక్ 2022 కార్యక్రమంలో ప్రసంగం
-ఇన్వెస్ట్ ఇండియా- ఏజెన్సీ కింద
ఫిల్మ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ పునర్వ్యవస్థీకరణ..,
విదేశీ పెట్టుబడులను అధికంగా
సినీ రంగంలోకి ఆకర్షించడమే ధ్యేయం
సినీ థియేటర్లపై ప్రేక్షకుల ఆసక్తిని
పునరుద్ధరించేందుకు
సింగిల్ విండో ఆమోద వ్యవస్థతో
మోడల్ థియేటర్ విధానం తేనున్న ప్రభుత్వం..
ప్రైవేటు భాగస్వామ్యంతో త్వరలో
ఎ.వి.జి.సి. జాతీయ ప్రతిభా కేంద్రం ఏర్పాటు..
“డేటా వినియోగం లేకుండానే
అధునాతన సాంకేతికత సాయంతో
నేరుగా మొబైల్ ద్వారా డిజిటల్ వినోదం
వీక్షించే అవకాశంపై అన్వేషణ”
సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలను
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో
ప్రతిపాదించే అవకాశం:
సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి వెల్లడి
Posted On:
27 SEP 2022 2:24PM by PIB Hyderabad
2030వ సంవత్సరం నాటికి సినీ పరిశ్రమను 100 బిలియన్ డాలర్లకు మించిన స్థాయికి వృద్ధి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర పరిశ్రమకు సూచించారు. భారత పారిశ్రామిక వాణిజ్య మండలుల సమాఖ్య (ఫిక్కీ) ఫ్రేమ్స్ ఫాస్ట్ ట్రాక్ 2022 పేరిట ఈరోజు ముంబైలో జరిగిన కార్యక్రమం ప్రారంభ సదస్సులో అవూర్వచంద్ర ప్రసంగిస్తూ, “2030 నాటికి మీడియా, వినోద రంగం 100 బిలియన్ డాలర్ల పైస్థాయికి పెరగాలని మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. మీడియా, వినోద రంగానికి మద్దతు ఇవ్వడానికి, అభివృద్ధికి తోడ్పడటానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఎంతవరకైనా కృషి చేస్తుంది." అని అన్నారు.
చలనచిత్ర రంగంకోసం భారతదేశానికి అధిక స్థాయిలో విదేశీ పెట్టుబడులను తీసుకురావడానికి ఇన్వెస్ట్ ఇండియా ఏజెన్సీ కింద మరిన్ని వెసులుబాట్లు కల్పించనున్నట్టు ఆయన ప్రకటించారు. “వివిధ చిత్రపరిశ్రమ యూనిట్లను ఒకటిగా మంత్రిత్వ శాఖ విలీనం చేసింది; ముంబైలోని జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్.ఎఫ్.డి.సి.) ప్రభుత్వ సినిమా రంగ విభాగానికి కేంద్రంగా ఉండబోతోంది. దీంతో ఫిల్మ్ సదుపాయాల కల్పనా కార్యాలయాన్ని పునర్వ్యవస్థీకరించ బోతున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రూపొందించిన ప్రధాన పెట్టుబడి విభాగమైన ఇన్వెస్ట్ ఇండియాకు ఈ కార్యాలయాన్ని అప్పగించబోతున్నాం. భారతదేశానికి పరిశ్రమను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది భారత్‌కు వంద బిలియన్ డాలర్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ.లు) రానున్నాయి. విదేశీ పెట్టుబడులను తీసుకురావడానికి ఇన్వెస్ట్ ఇండియా ఏజెన్సీ ద్వారా వెసులుబాట్లు కల్పించాలని అనుకుంటున్నాం. చిత్రనిర్మాణంకోసం విదేశీ నిర్మాతలు భారతదేశానికి చేరుకునేలా తగిన చర్యలు తీసుకుంటాం.” అని ఆయన అన్నారు.
భారతదేశంలో సినిమా షూటింగ్‌ను సులభతరం చేయడానికి, ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని అపూర్వ చంద్ర తెలిపారు. “,దృశ్య-శ్రవణ రూపకాల ఉమ్మడి నిర్మాణంకోసం కోసం, భారతదేశంలో విదేశీ చిత్రాల షూటింగ్ కోసం ఒక ప్రోత్సాహక పథకాన్ని ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెసివల్‌లో మేం ప్రకటించాం. దీనికి తోడుగా రాష్ట్రాలు కూడా ఇచ్చే మరిన్ని ప్రోత్సాహకాలతో, ఇది చిత్ర నిర్మాతలకు ఆచరణీయమైన, ఆకర్షణీయమైన ప్యాకేజీ అవుతుంది. ” అని ఆయన అన్నారు.
మోడల్ థియేటర్ విధానం రూపకల్పనలో భారత ప్రభుత్వం, రాష్ట్రాలతో కలసి పనిచేస్తుందని అపూర్వ చంద్ర చెప్పారు. ‘‘గత ఐదారేళ్లుగా దేశంలో సినిమాలు ప్రదర్శించే థియేటర్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ ధోరణిని మనం తిప్పికొట్టాలి, ఈ పరిస్థితిని నివారించాలి. సినిమా థియేటర్లను తెరవడానికి సింగిల్ విండో పోర్టల్‌ను రూపొందించడానికి ఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమం కింద కలిసి పనిచేయడానికి సినిమా సదుపాయాల కల్పనా కార్యాలయాన్నికేటాయిస్తాం, తద్వారా మరిన్ని ఎక్కువ థియేటర్లు ముందుకు రావడానికి, థియేటర్‌లలో సినిమాల మాయాజాలాన్ని చూడటానికి ప్రజలకు మరిన్ని మార్గాలు అందుబాటులోకి వస్తాయి. మోడల్ థియేటర్ విధానాన్ని రూపొందించడానికి రాష్ట్రాలతో కలిసి పని చేస్తాం. తద్వారా రాష్ట్రాలు దానిని ఆ విధానాన్ని అవలంబించడానికి, విధానానికి అనుగుణంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది” అని ఆయన అన్నారు.
కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా చలన చిత్రాల వీక్షణకు సంబంధించి ప్రజల అలవాట్లు మారిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు రోజుల కిందట టికెట్ ధరను రూ. 75కు తగ్గించినపుడు సినిమా షోలు అన్నీ ప్రేక్షలతో హౌస్‌ఫుల్ అయ్యాయని అన్నారు. “ధరలు సరిగ్గా ఉంటే, ప్రజలు థియేటర్లకు వచ్చి టికెట్లు కొనుగోలు చేయగలరని, దీన్నిబట్టి తెలుస్తోంది. థియేటర్‌లకు వెళ్లాలనే తపన ప్రేక్షకులకు ఉంది, కాబట్టి వారిని తిరిగి థియేటర్‌లకు ఎలా రప్పించాలన్న అంశంపై మనం మరింత కృషిచేయాలి.” ఆయన అన్నారు.
సినిమాటోగ్రాఫ్ చట్టానికి ప్రతిపాదించిన సవరణలపై నిన్న సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులతో తాము జరిపిన సమావేశం ఫలించిందని ఆయన పరిశ్రమ ప్రతినిధులకు తెలిపారు. "పైరసీ నియంత్రణ నిబంధనలను ప్రవేశపెట్టడానికి, యు.ఎ. (UA) కేటగిరీతో వయస్సు వర్గీకరణ కోసం ప్రతిపాదించిన సవరణలకు సమావేశానికి హాజరైన భాగస్వామ్య వర్గాలవారంతా తమ మద్దతు తెలిపారు." అని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమ మద్దతుతో సినిమాటోగ్రఫ్ చట్టం సవరణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
సమాచార, ప్రసార మంతిత్వ శాఖ ఏర్పాటు చేసిన యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఎ.వి.జి.సి.) ప్రోత్సాహక టాస్క్ ఫోర్స్ రానున్న15రోజులలోగా నివేదికను సమర్పిస్తుందని తెలియజేశారు. "సబ్ టాస్క్ ఫోర్స్‌ల నివేదికలను మేం సంకలనం చేస్తున్నాం. ఆ తర్వాత ఆ సిఫార్సులను సమర్పించి, నివేదికను చేపట్టే ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్తాం." అని ఆయన అన్నారు. ఎ.వి.జి.సి. అనేది చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ఆధారం వంటిదని చెప్పారు. "బెంగళూరుతో పాటుగా మరిన్ని ప్రాంతాల్లో ఇప్పుడు హాలీవుడ్ చిత్రాల్లో అత్యుత్తమమైన సినిమాలు తయారవుతున్నాయి. ఎ.వి.జి.సి. అనేది 20 ఏళ్ల కిందటి ఐ.టి. విప్లవం లాంటిదే." ఆని ఆయన అన్నారు.
ఎ.వి.జి.సి.లో జాతీయ స్థాయి ప్రతిభా కేంద్రాన్ని ప్రైవేట్ రంగ సహకారంతో, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోతున్నట్లు అపూర్వ చంద్ర తెలియజేశారు. “ప్రైవేట్ రంగం సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా మేం నిర్ణయం తీసుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు 48శాతం, ఫిక్కీకి 26శాతం, సి.ఐ.ఐ.కి 26శాతం వాటాను మేం ప్రతిపాదిస్తున్నాం. దీనితో ఎ.వి.జి.సి. పరివర్తనా ప్రక్రియకు ప్రభుత్వం కాకుండాప్రైవేట్ పరిశ్రమే నాయకత్వం వహించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మీడియా-వినోద పరిశ్రమ పురోగమనానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ఆశిస్తున్నాం.” అని ఆయన అన్నారు.
భారతీయ పౌరులు త్వరలో డేటా వినియోగం లేకుండానే తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా మరింత నాణ్యత కూడిన చలనచిత్రాలను, వినోద కార్యక్రమాలను వీక్షించగలరని ఆయన అన్నారు. “అయితే, భారతదేశంలో డేటా ఇతర దేశాలకంటే చాలా చవుకగా ఉంటుంది కాబట్టి, డేటా ఖర్చుల గురించి మేం ఎప్పుడూ ఆలోచించలేదు. మీడియా పరిశ్రమకు, వినోద పరిశ్రమకు ఇది గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. 5-జి నెట్‌నర్క్ సదుపాయం రాబోతున్నందున నేరుగా మొబైల్‌కు ప్రసారం చేయడానికి మరో చక్కని అవకాశం ఉంది. కాన్పూర్ ఐ.ఐ.టి. సహకారంతో ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్‌తో ప్రసార భారతి ముందుకు వచ్చింది. ఎటువంటి డేటాను వినియోగించకుండా నేరుగా-మొబైల్ ద్వారా ప్రసారంతో 200 కంటే ఎక్కువ ఛానెళ్లను చూడవచ్చు. మొబైల్ ఫోన్‌లలో అధిక-నాణ్యమైన చిత్రాలను చూడవచ్చు,." అని ఆయన అన్నారు. రానున్న మూడు, నాలుగేళ్లలో ఈ మార్పు జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించడంలో మీడియా, వినోద నైపుణ్యాల మండలికి ఎంతో ప్రాముఖ్యం ఉందని ఆయన తెలిపారు. “చాలా మంది ఇప్పుడు ఒ.టి.టి. వేదికగా చిత్రాలను చూస్తూ వినోదాన్ని పొందుతున్నారు. అయితే కంటెంట్ రూపొందించే వేగం పెరిగింది, దీనితో ఎక్కువ మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. మీడియా, వినోద నైపుణ్యాల మండలి ఇందులో పెద్ద పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడంలో నైపుణ్యం చాలా ప్రధాన భాగం.” అని ఆయన అన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నిర్మాత రమేష్ సిప్పీ; యునైటెడ్ కింగ్‌డమ్ లోని వెస్ట్ యార్క్‌షైర్ నగరం మేయర్ ట్రేసీ బ్రాబిన్; ప్రఖ్యాత సినీ ప్రముఖుడు రణవీర్ సింగ్,; పునర్యుగ్ సంస్థ వ్యవస్థాపకుడు, ఫిక్కీ, ఎ.వి.జి.సి. ఫోరమ్ చైర్మన్ ఆశిష్ కులకర్ణి; పార్లమెంటు సభ్యురాలు, కమ్యూనికేషన్, ఐటీ మంత్రిత్వ శాఖల స్థాయీ సంఘం సభ్యురాలు సుమలతా అంబరీష్; పార్లమెంటు సభ్యురాలు, రవాణా, పర్యాటక, సంస్కృతీ మంత్రిత్వ శాఖల స్థాయీ సంఘం సభ్యురాలు ప్రియాంక చతుర్వేది; పార్లమెంటు సభ్యుడు, కమ్యూనికేషన్, ఐ.టి. శాఖల స్థాయీ సంఘం సభ్యుడు సంజయ్ సేథ్, ఫిక్కీ డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా పాల్గొన్నారు.
ఫిక్కీ ఫ్రేమ్స్ ఫాస్ట్ ట్రాక్ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమంలో చర్చాగోష్టులు, ప్లీనరీ సదస్సులు, మీడియా-వినోద విభాగానికి సంబంధించిన సినిమాలు, టెలివిజన్, రేడియో ప్రసారాలు, డిజిటల్ వినోద రూపాలు, యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్‌లు వంటి పలు అంశాలపై మాస్టర్ తరగతులు నిర్వహిస్తారు. మీడియా-వినోద పరిశ్రమకు చెందిన కంపెనీల ముఖ్య కార్య నిర్వహణాధికారులు (సి.ఇ.ఒ.లు), సినీ నిర్మాతలు, దర్శకులు, పరిశ్రమకు చెందిన ఇతర వ్యాపార, సృజనాత్మక నిపుణులు, తదితర భాగస్వామ్య వర్గాల వారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ ప్రతినిధులతో పాటు వారు హాజరవుతారు.
****
(Release ID: 1862683)
Visitor Counter : 155