వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఆహారోత్పత్తి లో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు, భారతదేశం, ప్రపంచంలో ని అధిక భాగం ఆహార అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది : శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
అధిక ఆహార ధాన్యాల ఉత్పత్తి ని కొనసాగించడానికి ఉత్పాదకతను పెంచడం అవసరం: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
ఫిక్కీ సదస్సు ‘లీడ్స్ 2022’ ను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించిన - కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
Posted On:
20 SEP 2022 6:00PM by PIB Hyderabad
ఆహారోత్పత్తి లో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు, భారతదేశం, ప్రపంచంలో ని అధిక భాగం ఆహార అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందని, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలు, సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, భారతదేశం, వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. అధిక ఆహార ధాన్యాల ఉత్పత్తి ని కొనసాగించాలంటే, ఉత్పాదకతను కూడా పెంచాలన్న విషయం మనకు తెలిసిందే. కొత్త వ్యవసాయ సాంకేతికతను వినియోగించడం, వాటిని రైతులతో పంచుకోవడం, మెరుగైన నీటిపారుదల వ్యవస్థ ద్వారా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చు తగ్గడంతో పాటు, ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత కూడా పెరుగుతాయని, ఆయన పేర్కొన్నారు. అందరి సహకారం అవసరమని, తద్వారా మన రైతుల ఆదాయం పెరుగుతుందని, దేశంతో పాటు, ప్రపంచ ఆహార భద్రతకు మనం సహకరిస్తున్నామని కూడా శ్రీ తోమర్ వివరించారు.
భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) నిర్వహించిన 'లీడ్స్-2022 సదస్సు' నుద్దేశించి శ్రీ తోమర్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ‘అందరికీ ఆహారం : పొలం నుండి ఫోర్క్ వరకు’ అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సు లో, శ్రీ తోమర్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ, భారతీయ వ్యవసాయ రంగం 3.9 శాతం వృద్ధి రేటుతో గణనీయమైన విజయాన్ని సాధించిందని తెలిపారు. అలాగే, మన వ్యవసాయ ఎగుమతులు కూడా 4 లక్షల కోట్ల రూపాయల మార్కును దాటాయి. వీటిని మనం ఇంకా పెంచుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 900 కోట్ల వరకు ఉంటుందనే అంచనా నేపథ్యంలో, ఆహారం కోసం డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ఫలితంగా వ్యవసాయ భూమి, పశువుల మేత కోసం భూమి, ఎరువులతో పాటు, జన్యుపరంగా మార్పు చెందిన పంటల డిమాండు కూడా బాగా పెరుగుతుందని, శ్రీ తోమర్ చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇటీవలి సంవత్సరాలలో దేశంలో వ్యవసాయ రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన అన్నారు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారుగా మనం ఆవిర్భవించామని ఆయన చెప్పారు. భారతదేశ భౌగోళికం, వాతావరణం, నేలలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అందువల్ల మన దేశం అనేక రకాల వ్యవసాయ వస్తువులు ఉత్పత్తి చేయడంలో సహజంగానే అద్భుతంగా ఉంటుంది. ఇతర దేశాల కంటే మనం ఎక్కువ పంటలు పండించగలమని శ్రీ తోమర్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక పంట సాంద్రత కలిగిన దేశం భారతదేశం. నాల్గవ ముందస్తు అంచనా ప్రకారం, 2021-22 సంవత్సరంలో భారతదేశ ఆహారధాన్యాల ఉత్పత్తి 315.72 మెట్రిక్ టన్నులుగా ఉందని, ఆయన తెలియజేశారు.
భారతదేశాన్ని స్వావలంబన (ఆత్మ నిర్భర్) మరియు అంతర్జాతీయంగా పోటీ పడేలా చేయడానికి, చిన్న రైతుల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని శ్రీ తోమర్ అన్నారు. ఈ దిశలో అనేక ముఖ్యమైన పథకాలు అమలు చేయబడుతున్నాయి, తద్వారా వ్యవసాయ సవాళ్లను తగ్గించవచ్చు, రైతుల ఆదాయాన్ని పెంచవచ్చు. దీనితో పాటు, వ్యవసాయ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదగడానికి భారతదేశం వేగంగా ప్రయాణిస్తోంది. నీటిపారుదల వ్యవస్థలు, నిల్వలు, శీతల గిడ్డంగులతో సహా వ్యవసాయ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరగడం వల్ల రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో వ్యవసాయ పరిశ్రమ మరింత ఊపందుకుంటుందని ఆయన అన్నారు. వీటికి అదనంగా, జన్యుపరంగా మార్పు చెందిన పంటల వాడకం కూడా భారతీయ రైతుల దిగుబడిని పెంచుతుందని భావిస్తున్నారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద 2024-25 నాటికి మత్స్య రంగంలో 70,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు, శ్రీ తోమర్ తెలియజేశారు. అదేవిధంగా, 2024-2025 నాటికి చేపల ఉత్పత్తిని 220 లక్షల టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఫుడ్ ప్రాసెసింగ్ కోసం పీ.ఎల్.ఐ. పథకాన్ని వచ్చే 6 ఏళ్లలో 10,900 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ప్రకటించి, అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అదే సమయంలో, కృషి ఉడాన్ పథకం కింద, వాయు రవాణా ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కోసం అవసరమైన సహాయం, ప్రోత్సాహకాలు కూడా అందించడం జరుగుతుందని, ఆయన చెప్పారు. ఇది ముఖ్యంగా ఈశాన్య మరియు గిరిజన ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఆయన పేర్కొన్నారు. దీంతో రైతులు, సరుకు రవాణా దారులు, విమానయాన సంస్థలు లబ్ధి పొందుతాయని కూడా ఆయన చెప్పారు. డిజిటల్ అగ్రి మిషన్‌ను కూడా ప్రారంభించడం జరిగింది. సాంకేతికత పారదర్శకతను పెంచుతుంది, తద్వారా రైతులు అన్ని పథకాల యొక్క పూర్తి ప్రయోజనాలను పొందుతారు. డ్రోన్ సాంకేతికతను కూడా ప్రోత్సహించడం జరుగుతోంది. వ్యవసాయంలో సాంకేతికత, పారదర్శకత ఎంత పెరిగితే అంత లాభం ఉంటుంది. 11,000 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ ఆయిల్ పామ్ మిషన్ ప్రారంభించినట్లు కూడా శ్రీ తోమర్ తెలియజేశారు. భారతదేశం నేతృత్వంలో వచ్చే ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని జరుపుకోనున్నామని, ఇందుకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయనీ, ఆయన తెలియజేశారు.
ఈ సదస్సులో, న్యూజిలాండ్ దేశానికి చెందిన వాణిజ్యం, ఎగుమతి అభివృద్ధి, వ్యవసాయం, బయో సెక్యూరిటీ, భూ సమాచారం, గ్రామీణ సమాజాల శాఖ మంత్రి, శ్రీ డామియన్ ఓ'కానర్ తో పాటు, పరిశ్రమల ప్రతినిధులు, ఇతరులు పాల్గొన్నారు.
*****
(Release ID: 1861108)
Visitor Counter : 278