మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
భారతీయ భాషలకు, విజ్ఞాన వ్యవస్థలకు ప్రాధాన్యం తప్పనిసరి: ధర్మేంద్ర ప్రధాన్
ప్రపంచ పౌరుల తయారీకి ఇది అవసరమన్న కేంద్రమంత్రి తంజావూరులోని శాస్త్ర విశ్వవిద్యాలయం
36వ స్నాతకోత్సవంలో ప్రసంగం
Posted On:
18 SEP 2022 5:34PM by PIB Hyderabad
తమిళనాడు రాష్ట్రం, తంజావూరు తాలూకా, తిరుమలైసముద్రంలోని శాస్త్ర విశ్వవిద్యాలయంలో జరిగిన 36వ స్నాతకోత్సవానికి కేంద్ర విద్యా, నైపుణ్యాభవృద్ధి శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ, మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ సహాయమంత్రి ఎల్. మురుగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు విశ్వవిద్యాలయ వైస్‌చాన్సిలర్ ప్రొఫెసర్ ఆర్. సేతురామన్ గత నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న కృషి, ఆయన పడుతున్న తపన ఎంతో అభినందనీయమని అన్నారు. చదువుల కోవెలగా శాస్త్ర విశ్వవిద్యాలయం తన పేరును నిలబెట్టుకుందని, విజ్ఞానరంగంలో ప్రతిభను చాటుకుందని అన్నారు. మానవ శాస్త్రాలు, సాహిత్యం, చరిత్ర వంటి లిబరల్ ఆర్ట్స్‌ను బోధించే కోర్సుల్లో కూడా ఈ విశ్విద్యాలయం అధ్యయనం జరుపుతూ ఉండటం సంతోషదాయకమని అన్నారు. ప్రత్యేక కళలలకు, వాస్తు శిల్పానికి, సంగీత, సాంస్కృతిక అంశాలకు ప్రసిద్ధి గాంచిన తంజావూరు ప్రాంతం, తమిళనాడు రాష్ట్రంలో ఈ కోర్సులు కూడా ప్రముఖ అధ్యయన విభాగాలే అవుతాయని అన్నారు.
తమిళనాడులోని అపురూపమైన దేవాలయాలు ప్రంపంచంలోనే ఎన్నదగిన అద్భుతాలని, విశిష్టమైన నాగరికతకు భారతదేశం కాణాచి అనే వాస్తవాన్ని ఇవి అందరికీ గుర్తు చేస్తున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఎంతో ఉతృష్టమైన, విభిన్నమైన విజ్ఞానసంపదకు తమిళనాడు ఆటపట్టు అని, ‘గొప్పగా ఆలోచించు, పారదర్శకతతో ఆలోచించు’ అన్న సిద్ధాంతాన్ని మనకు అందించిందని అన్నారు.
చరకుడు, సుశ్రుతుడు, ఆర్యభట్టు, భాస్కరాచార్యుడు, నాగార్జునుడు, తిరువళ్లువర్ వంటి గొప్ప మేధావులనుంచి, ఎంతో గొప్ప నాగరికతా సంప్రదాయాలను మనం పుణికి పుచ్చుకున్నామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఎప్పటికీ అనుసరణీయమేనని, ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో ఎదురవుతున్న సవాళ్లకు కూడా మన విజ్ఞాన వ్యవస్థ పరిష్కారాలను సూచిస్తోందని అన్నారు.
భారతదేశం ఒక విశిష్టమైన నాగరికతగా వచ్చే పాతికేళ్లు కీలకపాత్ర పోషించబోతోందని, ప్రపంచ సంక్షేమం లక్ష్యంగా మన నాగరికతా సంప్రదాయాలను ప్రోత్సహించడం, పరిరక్షించడం, ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాల్లో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించవలసి ఉంటుందని కేంద్రమంత్రి సూచించారు. 2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానానికి శాస్త్ర విశ్వవిద్యాలయం పథనిర్దేశకంగా కూడా వ్యవహరించాలని ఆయన అన్నారు.
2020వ సంవత్సరపు జాతీయ విద్యావిధానం (ఎన్.ఇ.పి.) ముఖ్యాంశాలను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. విద్యార్థులను, యువతను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు వీలుగా భారతీయ విలువలు, సంప్రదాయాల ప్రాతిపదికతో విద్యావిధానం రూపుదాల్చినట్టు ఆయన చెప్పారు. భారతీయ భాషలు, విజ్ఞాన వ్యవస్థకు అది ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ తత్వనీతిజ్ఞుడు తిరువళ్లువర్ మరే ఇతర సాహితీ వేత్తకు, పండితుడికి, తత్వవేత్తకు ఏ మాత్రం తీసిపోరని, ఆయన తత్వాన్ని, భారతీయ విజ్ఞాన వ్యవ్థను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపచేయడం మన కర్తవ్యమని మంత్రి అన్నారు.
ఉన్నత విద్యను అందించే ఉత్తమ అధ్యయన సంస్థగా పరిశోధన, ఆవిష్కరణ ప్రక్రియల్లో తన కృషిని శాస్త్ర విశ్వవిద్యాలయం ఎప్పటిలా కొనసాగించాలని కేంద్రమంత్రి సూచించారు. అభివృద్ధి, అధ్యయనంలో తగిన నమూనాలకు రూపకల్పన చేయడంలో, తద్వారా మానవాళిని గొప్ప భవితవైపు నడిపించడంలో శాస్త్ర విశ్వవిద్యాలయ సారథులు తగిన కృషి చేయగలరన్న ఆత్మవిశ్వాసం తనకు ఉన్నదని అన్నారు. డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాంతో పాటుగా, తమిళనాడుకు చెందిన పలువురు గొప్ప వ్యక్తుల విలక్షణ సంప్రదాయాలను విద్యార్థులు కొనసాగించడం ద్వారా శాస్త్ర విశ్వవిద్యాలయం దేశానికే గర్వకారణంగా నిలబడగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
శాస్త్ర ఇంజినీరింగ్ కళాశాలలో, సృజనాత్మకమైన రీతిలో లోహపు విడిభాగాలను తయారు చేసే షణ్ముగ ప్రిసిషన్ ఫోర్జింగ్ యూనిట్‌ను కూడా కేంద్రమంత్రి సందర్శించారు. ఇనుపలోహంతో తయారీ, ఇనుముతో సంబంధం లేకుండా ఇతర లోహాలతో తయారీ (ఫోర్జింగ్) ప్రక్రియల్లో ప్రముఖ సంస్థగా ఈ యూనిట్ పేరుగాంచింది. నైపుణ్యాల అధ్యయనంలో కూడా ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది. యువత విస్తృత ప్రయోజనాలే లక్ష్యంగా జాతీయ నాణ్యతా అర్హతల వ్యవస్థ (ఎన్.ఎస్.క్యు.ఎఫ్.) ప్రమాణాలకు అనుగుణంగా ఈ సంస్థ నైపుణ్య శిక్షణ కల్పించాలని ఫోర్జింగ్ యూనిట్ ప్రతినిధులకు కేంద్రమంత్రి ప్రధాన్ సూచించారు.
జాతిపిత మహాత్మగాంధీ ప్రవచించిన ఖాదీ, స్వదేశీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న పశ్చిమ తంజావూరులోని సర్వోదయ కేంద్రాన్ని కేంద్రమంత్రి ప్రధాన్ సందర్శించారు. ఈ సందర్భంగా జాతిపితకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, స్థానిక కళలకు, హస్తకళలకు, హస్తకళల కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు సర్వోదయకేంద్రం ఎంతో కృషి చేస్తున్నదని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.
ఖాదీ సంప్రదాయాలకు తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేందుకు, స్థానిక కళాకారులను మరింత బలోపేతం చేసేందుకు ఖాదీ ఖండువాను, పంచెలచాపును, జేబురుమాళ్లను కేంద్రమంత్రి కొనుగోలు చేశారు. ఉత్పత్తిరంగంలో స్వావలంబనతో, దేశాన్ని ఆత్మనిర్భర భారత్‌గా నిలబెట్టాలన్నలక్ష్యాన్ని సాధించేందుకు అందరూ ఖాదీ ఉత్పాదనలను ప్రోత్సహించాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు.
****
(Release ID: 1860490)
Visitor Counter : 190