పర్యటక మంత్రిత్వ శాఖ

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో మూడు రోజుల పాటు రాష్ట్ర పర్యాటక మంత్రుల జాతీయ సదస్సు ప్రారంభం
వచ్చే బడ్జెట్ సమావేశాలకు ముందే జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకువస్తాం: కిషన్ రెడ్డిభారతదేశంలో పర్యాటకాభివృద్ధికి ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం: కిషన్ రెడ్డిజి-20 దేశ పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికి ఒక వేదికను అందిస్తుంది : శ్రీ జి.కిషన్ రెడ్డి

Posted On: 18 SEP 2022 7:23PM by PIB Hyderabad

 

దేశీయ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని  కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అన్నారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆదివారం ప్రారంభమై మూడ్రోజులపాటు జరగనున్న పర్యాటక మంత్రుల సదస్సు సందర్భంగా  మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనానంతర పరిస్థితుల్లో దేశీయ పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం రైలు, రోడ్డు, విమాన మార్గాల అనుసంధానతతోపాటుగా ఇతర మౌలిక వసతుల కల్పనను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు.

 

దీంతోపాటుగా, పర్యాటక రంగంలో పెట్టుబడులను పెంచేందుకు పీపీపీ (పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో పనిచేయనున్నట్లు కేంద్ర మంత్రి  వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే వివిధ భాగస్వామ్య పక్షాలతో మాట్లాడుతున్నామన్నారు. విదేశాల్లో పర్యాటక రంగం పీపీపీ పద్ధతిలోనూ పురోగతి సాధిస్తున్నవిషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. భారత్ లోనూ ఈ విధానాన్ని అమలుచేస్తామన్నారు. పర్యాటక రంగానికి  ప్రోత్సాహాన్ని అందించేందుకు కేంద్రం ‘వికాస్ భీ, విరాసత్ భీ’ నినాదంతో ముందుకెళ్తోందని, పర్యాటక ప్రాంతాల అభివృద్ధితోపాటు, మన వారసత్వ సంపదకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడమే ఈ నినాదం ఉద్దేశ్యమన్నారు. వారసత్వాన్ని, సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషిచేస్తోందన్నారు.

 

ప్రపంచ జనాభా సదస్సులో 85 శాతం ఉన్నటువంటి జీ-20 దేశాల సదస్సును ఈసారి భారతదేశం నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా మన దేశంలోని వివిద ప్రాంతాల్లో 250 వివిధ శాఖల సదస్సులు నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీని ద్వారా భారతీయ పర్యాటక  రంగానికి మరింత  ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కరోనానంతరం భారతదేశ టీకాను తీసుకొచ్చి పర్యాటకులకు అనుకూలమైన వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని, పర్యాటక, ఆతిథ్య రంగాలను మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీడియా కూడా తమవంతు సహాయ, సహాకారాలు అందించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

 

భారతదేశంలో దేశీయ పర్యాటకానికి విస్తృతమైన అవకాశాలున్నాయని, ఈశాన్య రాష్ట్రాలు, శ్రీనగర్ మొదలుకుని ఇతర ప్రాంతాల్లోనూ మన దేశీయ పర్యాటకాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటెంట్లు, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా ఆయా ప్రాంతాలకు పర్యాటకుల సందడి పెరుగుతోందన్నారు.  ఎయిర్‌ కనెక్టివిటీ ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన జీ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో 2014లో 74 ఉన్న విమానాశ్రయాల సంఖ్య ఇప్పుడు 140కి పెరిగిందని, 2025 నాటికి 220 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

 

 

కరోనానంతర పరిస్థితుల్లో పర్యాటక, ఆతిథ్య రంగాలకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ను మార్చి 31, 2023 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించిందని, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ లో  రూ.50వేల కోట్లను పెంచిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దీని ద్వారా హోటళ్లు, రెస్టారెంట్లు, మ్యారేజ్ హాళ్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, ఎమ్ఎస్ఎమ్ఈ లతోపాటు అడ్వెంచర్/హెరిటేజ్ వసతుల కల్పనకు చాలా ఉపయుక్తం అవుతుందన్నారు. రామాయణ్ సర్క్యూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్, హిమాలయన్ సర్క్యూట్ వంటి వివిధ పర్యాటక సర్క్యూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపించడం ద్వారా పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.

 

విదేశాల్లో ఉండే భారతీయులు, భారతీయ సంతతి వారు తామున్న ప్రాంతాల్లోని 5గురు భారతీయేతరులను మన దేశంలో సందర్శించేలా ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి మరోసారి గుర్తుచేశారు. భారతీయులు కూడా మన దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ఆయన సూచించారు. విదేశాల్లోని భారతీయ దౌత్యకార్యాలయాల్లో ప్రత్యేకమైన అధికారిని నియమించి.. మన పర్యాటకానికి ‘దేఖో భారత్’ పేరుతో ప్రోత్సాహం అందించేలా  కార్యాచరణ  చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికి 20 దేశాల దౌత్య కార్యాలయాల్లో ‘పర్యాటక కార్యదర్శి’ కార్యాలయాలు తెరవబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

పర్యాటక రంగం 2018లో రూ. 16.91 లక్షల కోట్లు (USD 240 బిలియన్లు) లేదా భారతదేశ జీడీపీ లో 9.2% ఉత్పత్తి చేసింది మరియు దాదాపు 42.67 మిలియన్ ఉద్యోగాలకు లేదా మొత్తం ఉపాధిలో 8.1%కి మద్దతునిచ్చింది.

 

మూడురోజుల పాటు జరగనున్న వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులు, కార్యదర్శులు, ఇతర పర్యాటక భాగస్వాముల సదస్సుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 250 మంది వరకు పాల్గొననున్న ఈ సదస్సులో.. కరోనానంతర పరిస్థితుల్లో అంతర్జాతీయంగా పర్యాటక రంగం పెను సవాళ్లు ఎదుర్కొన్ననేపథ్యంలో.. దేశీ పర్యాటకానికి మంచిరోజులు తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణపై నిర్దిష్టంగా చర్చించనున్నారు. ఇందుకోసం అవసరమైన జాతీయ పర్యాటక విధానానికి (నేషనల్ టూరిజం పాలసీ) రూపకల్పన విషయంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

 

పర్యాటక రంగంలో మౌలిక వసతుల కల్పన, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటకం, హిమాలయ రాష్ట్రాల్లో పర్యాటకం, సుస్థిర పర్యాటకం, పర్యాటక రంగంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగం, డిజిటల్ ప్రమోషన్, హోం స్టే సదుపాయాలు, భారతీయ ఆతిథ్య రంగం ప్రత్యేకతలు, ఆయుర్వేదం, వెల్‌నెస్, మెడికల్ వ్యాల్యూ ట్రావెల్, దేశీయ పర్యాటకాభివృద్ధి తదితర అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ సమావేశంలో జీ-20 సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం, దేశంలోని 55 ప్రాంతాల్లో జీ-20 సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై మాట్లాడుతారు. వీటితో పాటు వైల్డ్ లైఫ్ టూరిజం, రెస్పాన్సిబుల్ టూరిజం, జీ-20 దేశాల్లో పర్యాటక సంబంధిత అంశాలపై పరస్పర సహకారం, పర్యాటక శాఖ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షకూడా జరపనున్నారు.

https://lh6.googleusercontent.com/MKR0HcH-75FIXH9WHe0kAkclAH4b4BiBYQcQ0XSUZo8kNLG_Bxay4_WXRHwNGZZLSMbh2oSMDD4FZ4dPQhdv7IfXFRRcV3z-Gx3t1jZpTPv97oFdHzizKvSb8k97_6CUWPT50AS7DxWutDDr8jsmux_o76TVZ6tTV8GpKq6SpIWy0oJv4ZnY7gi7sA5zYjlmZrVWUA

 

దేశవ్యాప్తంగా పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి మంత్రిత్వ శాఖ రూ.7000 కోట్లు మంజూరు చేసింది. 30 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో స్వదేశ్ దర్శన్ పథకం కింద అనేక 76 ప్రాజెక్టులు వివిధ థీమ్‌లలో పర్యాటక మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం మంజూరు చేయబడ్డాయి. ప్రసాద్ పథకం ఆధ్యాత్మిక ప్రదేశాల చుట్టూ పర్యాటక సౌకర్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, దీని కింద 24 రాష్ట్రాల్లో 39 ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయి. ఈ పర్యాటకులు, తీర్థయాత్ర మరియు వారసత్వ గమ్యస్థానాలు/నగరాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి స్వచ్ఛత, భద్రత, సార్వత్రిక సౌలభ్యం, సేవా బట్వాడా, నైపుణ్యాభివృద్ధి మరియు స్థానిక కమ్యూనిటీల జీవనోపాధిపై దృష్టి పెడుతుంది. టూరిస్ట్, డెస్టినేషన్ సెంట్రిక్ విధానాన్ని అనుసరించి స్థిరమైన మరియు బాధ్యతాయుతమైన గమ్యస్థానాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఇటీవల స్వదేశ్ దర్శన్ స్కీమ్ 2.0ని ప్రారంభించింది.

జాతీయ సదస్సు పర్యాటకం  కోసం ఒక ఉమ్మడి దృష్టిని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది మరియు మనం భారతదేశం @ 2047 వైపు వెళుతున్నప్పుడు అది వృద్ధి చెందుతుంది. రాబోయే 25 సంవత్సరాల అమృత్ కాల్, కాన్ఫరెన్స్ యొక్క లక్ష్యం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉమ్మడి సంభాషణను ప్రారంభించడం. 2047లో భారతదేశంలో పర్యాటకానికి సంబంధించిన విజన్‌ను ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో పర్యాటక మరియు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ , పర్యాటక మరియు ఓడ రేవులు, షిప్పింగ్ మరియు జల మార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద నాయక్ తో పాటు అడిష నల్ సెక్రటరీ (టూరిజం) శ్రీ రాకేశ్ కుమార్ వర్మ, ఇతర సీనియర్ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విలేఖరుల సమావేశం అనంతరం జరిగిన కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జైరామ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు.

 

 (Release ID: 1860427) Visitor Counter : 160