సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

సీబీసీ కళాకారుల ప్రదర్శనలతో రంగుల హరివిల్లు గా కర్తవ్య పథ్

Posted On: 15 SEP 2022 2:14PM by PIB Hyderabad

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకి చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కర్తవ్య పథ్ ప్రారంభోత్సవం మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని  నెలరోజుల పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కి చెందిన సాంగ్ అండ్  డ్రామా విభాగం కళాకారులు  వినోదం, విద్య తో కూడిన సాంస్కృతిక,  వినోద కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు. సంగీతం, నృత్యం, వీధి నాటకాలు, వినోద కార్యక్రమాలు, ప్రదర్శనలు ప్రజలను మంత్రముగ్దులను చేస్తున్నాయి.

స్టెప్ ప్లాజా ఓపెన్-ఎయిర్ వేదికపై జరిగే కార్యక్రమాలను   ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత అన్ని వయసుల వారు ఉచితంగా చూడవచ్చు. రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి. .
వారాంతాల్లో కార్యక్రమాలు మరింత ఆకర్షణీయంగా నిర్వహించడం జరుగుతుంది. భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఆధునిక మేళవింపుతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఆహ్లాదకర  వాతావరణంలో నిర్వహిస్తారు.
  వినోదంతో కార్యక్రమాల ద్వారా ప్రజలకు సమాచారం అందించి వారిని చైతన్యవంతులను చేయాలన్న లక్ష్యంతో వినూత్నంగా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలు సులువుగా అర్ధం చేసుకునే విధంగా సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించింది.   17 సెప్టెంబర్ 2022న నిర్వహించనున్న  రక్తదన్ అమృత్ మహోత్సవ్ (రక్తదాన కార్యక్రమం ) వంటి ముఖ్యమైన కార్యక్రమాలపై కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.  
భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారుల బృందాలు ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తాయి. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి వారికి వైవిధ్యంతో కూడిన వినోదాన్ని అందించేందుకు కథక్, ఒడిస్సి లాంటి జానపద ప్రదర్శనలు ఉంటాయి. ఇండియా గేట్ ను సందర్శించే సందర్శకుల కోసం శాస్త్రీయ వాయిద్య సంగీత ప్రదర్శనలు కూడా ఏర్పాటయ్యాయి. దేశభక్తి గీతాలు మరియు స్వాతంత్ర్య ఉద్యమం ఆధారంగా రూపొందిన  సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందేశాన్ని మరింత ఎక్కువగా వ్యాప్తి చేయనున్నాయి.
ఇండియా గేట్ వద్ద నేతాజీ  విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాటైన కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై పాడే పాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.  జాతీయ వీరుడికి నివాళిగా ప్రతి ప్రదర్శన బోస్  ఇండియన్ నేషనల్ ఆర్మీ  కవాతు పాట అయిన “కదం కదమ్ బాధయే జా” పాటతో ముగుస్తుంది.
నేతాజీ జీవితం మరియు ఆదర్శాలపై రూపొందిన స్కిట్‌లు, వీధి నాటకాలు, నృత్య నాటికలు మొదలైనవి నెల రోజుల పాటు ప్రజలను అలరించనున్నాయి. ఈ ఏడాది గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహణకు రంగం సిద్ధం అవుతోంది. ప్రదర్శనలకు భారీ ఎత్తున హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని  భాగస్వాములు కావాలని ప్రజలందరినీ   సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్   ఆహ్వానిస్తోంది.

***



(Release ID: 1859616) Visitor Counter : 180