సహకార మంత్రిత్వ శాఖ

దేశంలో సహకార ప్రగతి లక్ష్యంగా కేంద్ర సహకార శాఖ కృషి!


ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2021 జూలై 6న కొత్తగా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు..
సహకార స్వప్నాల సాకారం, సహకార రంగానికి మరింత ప్రోత్సాహమే ప్రభుత్వ ధ్యేయం...

కొత్త సహకారమంత్రి అమిత్ షా సారథ్యంలో అభివృద్ధి లక్ష్యంగా సహకార రంగం నిర్విరామ కృషి..
రాష్ట్ర ప్రభుత్వాలు, భాగస్వామ్య వర్గాల తోడ్పాటుతో వడివడిగా సహకారశాఖ ముందడుగు..

ఈ నేపథ్యంలో ఈ నెల 8,9 తేదీల్లో ఏర్పాటైన రాష్ట్రాల సహకార మంత్రుల సదస్సు..
న్యూఢిల్లీ, విజ్ఞాన్ భవన్‌లో నిర్వహణ...

సహకార అభివృద్ధిపై సదస్సు తొలి రోజున తమ అభిప్రాయాలు వెలిబుచ్చిన
వివిధ రాష్ట్రాల సహకార మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు,
పలువురు సీనియర్ అధికారులు..

సదస్సులో పాల్గొన్న 21రాష్ట్రాల మంత్రులు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు,
పలువురు ప్రముఖులు, అధికారులు, నిపుణులు..
సహకార రంగం పటిష్టతకు తమ సూచనల వెల్లడి..

జాతీయ సహకార విధానం, సహకార సమాచార వ్యవస్థ, కొత్త సహకార పథకాలు, తదితర
అంశాలపై సదస్సులో విస్తృతంగా జరిగిన చర్చలు...

ప్రపంచ మార్కెట్‌కు ఖాదీ, వ్యవసాయ ఉత్పత్తులు, హస్తకళల ఎగుమతి కోసం బహుళ రాష

Posted On: 10 SEP 2022 8:55AM by PIB Hyderabad

     ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో, కొత్త సహకార మంత్రిత్వ శాఖ 2021 జూలై 6వ తేదీన ఏర్పాటైంది. సహకార రంగం వృద్ధికి మరింత ఊపునిచ్చేందుకు, సహకారంతో సౌభాగ్యం అన్న కలను సాకారం చేసేందుకు  సహకార రంగం ప్రయోజనాలకోసమే ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను రూపొందించారు. కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి అమిత్ షా క్రియాశీలక నాయకత్వంలో సహకార రంగం అభివృద్ధికోసం సహకార మంత్రిత్వ శాఖ నిర్విరామంగా పనిచేస్తోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, భాగస్వామ్య వర్గాల తోడ్పాటుతో ఈ కృషి నిరంతరం కొనసాగుతోంది.

  ఈ నేపథ్యంలో రాష్ట్రాల సహకార మంత్రుల రెండు రోజుల సదస్సును కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నిర్వహించింది. న్యూఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో 2022 సెప్టెంబు 8,9 తేదీల్లో  సదస్సు జరిగింది. తొలి రోజున కేంద్ర సహకార శాఖ సహాయమంత్రి బి.ఎల్. వర్మ స్వాగతోపన్యాసం చేశారు. కేంద్ర హోమ్ సహకార మంత్రి అమిత్ షా ప్రారంభోత్సవ ప్రసంగం చేశారు. సదస్సు తొలి రోజున వివిధ రాష్ట్రాల సహకార మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు సీనియర్ అధికారులు, నిపుణులు ప్రసంగించారు. సహకార రంగంలో అనుబంధం పెనవేసుకున్న వివిధ రంగాలకు సంబంధించి తమ ఆలోచనలను, భావనలను వారు వివరించారు.

  రెండు రోజుల ఈ సదస్సులో 21రాష్ట్రాల సహకారశాఖల మంత్రులు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్, కేంద్ర సహకార సంఘాల రిజిస్ట్రార్, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి విజయకుమార్, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల సహకార సంఘాల రిజిస్ట్రార్లు ప్రసంగించారు. దేశంలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై వారు తమ అభిప్రాయాలను, సూచనలను వెల్లడించారు. సహకార రంగంలో తాము అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను గురించి అన్ని రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ సదస్సులో వివరించాయి.

   జాతీయ సహకార విధానం, జాతీయ సహకార సమాచార వ్యవస్థ, సహకార మంత్రిత్వ శాఖ తలపెట్టిన కొత్త పథకాలు, కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ సదస్సులో  విస్తృతంగా చర్చలు జరిగాయి. ప్రతి పంచాయతీ పరిధిలో వ్యవసాయ పరపతి సంఘాలు, వ్యవసాయాధారిత ఉత్పత్తులు, తదితర ఉత్పత్తుల ఎగుమతి, సేంద్రియ ఉత్పత్తులకు ప్రోత్సాహం, మార్కెటింగ్, కొత్త రంగాలకు సహకారాన్ని విస్తరించడం తదితర అంశాలపై కూడా చర్చ జరిగింది. ప్రాథమిక వ్యవసాయ, పరపతి సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీకరకణతో సహా నమూనాల నిబంధనల (బైలాస్) రూపకల్పన వంటి అంశాలను చర్చించారు. అలాగే, దీర్ఘకాలిక రుణాల కల్పన, పాల సహాకర సంఘాలు, మత్స్య సహకార సంఘాలతో పాటుగా  ప్రాథమిక సహకార సంఘాలకు సంబంధించిన అనేక ఇతర అంశాలపై కూడా చర్చ జరిగింది. దేశంలో సహకార రంగానికి నిధుల విషయంలో సారథ్యం వహిస్తున్న జాతీయ సహకార అభివృద్ధి సంఘం (ఎన్.సి.డి.సి.) కూడా ఈ సదస్సులో పాల్గొంది. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ డైరెక్టరేట్ల ద్వారా సహకార రంగానికి రుణాలు అందించేందుకు గల అవకాశాలను గురించి ఎన్.సి.డి.సి. ప్రతినిధులు వివరించారు.

  కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో సహకార ఉద్యమం శక్తి సామర్థ్యాలను గురించి ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీకరణ పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను సానుకూలం చేసుకోవాలని, అధునాతన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ వినియోగానికి చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు.

 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు,.. సహకార సంఘాల ద్వారా ఎగుమతులకు ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ పలు చర్యలు తీసుకుంటోందని, 2002వ సంవత్సరపు బహుళ రాష్ట్రాల సహకార సంఘాల చట్టం (ఎం.ఎస్.సి.ఎస్. చట్టం) కింద జాతీయ స్థాయి సహకార ఎగుమతి కేంద్రం రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తోందని అన్నారు. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖతో కలసి సమన్వయంతో ఈ కేంద్రం పనిచేస్తుందని, దేశంలో సహకార ఉద్యమంతో అనుబంధం పెనవేసుకున్న ఉన్న దాదాపు 30కోట్ల మంది ఎగుమతి సామర్థ్యాలను ఈ కేంద్రం మరింతగా బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. సేంద్రియ ఉత్పాదనలు, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం ఉద్దేశించిన బహుళ రాష్ట్రాల సహకార సంఘం రిజిస్ట్రేషన్ గురించి కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివరించారు. ప్రపంచ మార్కెట్‌కు ఖాదీ, వ్యవసాయ ఉత్పత్తులు, హస్తకళల ఎగుమతి లక్ష్యంగా బహుళ రాష్ట్రాల ఎగుమతి కేంద్రం ఏర్పాటుకోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, సీడ్ కల్చర్, సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్, సర్టిఫికేషన్ కోసం  బహుళ రాష్ట్రాల సహకార సంఘాన్ని ప్రభుత్వం రెండు నెలల్లో ఏర్పాటు చేయబోతోందని, దీనితో సేంద్రియ సాగు రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇతర ఆర్థిక వ్యవహారాల సంస్థలతో సమానంగా సహకార సంఘాలను పరిగణించడానికి కేంద్ర సహకార మంత్రిత్వశాఖ తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.

  దేశంలో సహకారంనుంచి సమృద్ధి అనే మంత్రాన్ని సాకారం చేసేందుకు సహకార ప్రాతిపదికతో కూడిన ఆర్థిక వ్యవహారాల నమూనాకు మరింత ప్రోత్సాహం లభించేలా భాగస్వామ్య వర్గాలవారంతా కలసికట్టుగా పనిచేయాలన్న తీర్మానాన్ని ఆమోదించడంతో రెండురోజుల సహకార సదస్సు ముగిసింది.

 

*****



(Release ID: 1858497) Visitor Counter : 137